చివరి టీ20: ఇద్దరు కెప్టెన్లూ పక్కపక్కనే..

2 Feb, 2020 17:08 IST|Sakshi

మౌంట్‌మాంగనీ: టీమిండియా-న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరిగిన ఐదో టీ20లో అరుదైన సందర్భం చోటు చేసుకుంది. సాధారణంగా ప్రత్యర్థి జట్ల కెప్టెన్లు ఒకేచోట కూర్చొని మ్యాచ్‌ చూడటం చాలా అరుదు. మరి అటువంటిది టీమిండియా రెగ్యులర్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి.. న్యూజిలాండ్‌ రెగ్యులర్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌లు పక్కపక్కనే కూర్చొని మ్యాచ్‌ను తిలకించడం ఆసక్తిని రేపింది. మ్యాచ్‌లో ఫలితం ఎలా ఉన్నా తాము క్రికెటర్లమనే సంగతిని వీరు గుర్తు చేశారు. మ్యాచ్‌ను ఆస్వాదిస్తూ విశేషాలను పంచుకున్నారు. మనసంతా తమ జట్లపైనే ఉన్నప్పటికీ ఆ విషయాన్ని మాత్రం లోలోపలే దాచుకుని మరీ మ్యాచ్‌ను చూశారు. (ఇక్కడ చదవండి: టీమిండియా క్లీన్‌స్వీప్‌)

వీరిద్దరూ కలిసి మ్యాచ్‌ చూసిన క్షణాలు అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది.  వీరిద్దరూ అండర్‌-19 క్రికెట్‌  ఆడుతున్నప్పట్నుంచీ స్నేహితులు అనే విషయం మనకు తెలిసిందే. ఇప్పటికే ఎన్నోసార్లు కేన్‌ విలియమ్సన్‌ ఒక అసాధారణ బ్యాట్స్‌మన్‌ అని కోహ్లి  కొనియాడాడు. ఇప్పుడు సిరీస్‌లోని చివరి మ్యాచ్‌ను కలిసి వీక్షించే అవకాశం వీరిద్దరికీ దొరికింది.  ఈ మ్యాచ్‌ నుంచి కోహ్లి విశ్రాంతి తీసుకోగా, విలియమ్సన్‌ భుజం గాయం కారణంగా రిజర్వ్‌ బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఫలితంగా గ్యాలరీ లో కూర్చొని కలిసి మరీ ప్రశాంతంగా మ్యాచ్‌ను చూశారు ఈ ఇద్దరు సారథులు.  చివరి టీ20లో సైతం భారత్‌ విజయం సాధించి సిరీస్‌ను 5-0 తేడాతో క్లీన్‌స్వీప్‌ చేసింది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన టీమిండియా 164 పరుగుల టార్గెట్‌ను నిర్దేశిస్తే, కివీస్‌ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 156 పరుగులకే పరిమితమై 7 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.(ఇక్కడ చదవండి: శాంసన్‌.. మైండ్‌ బ్లోయింగ్‌ ఫీల్డింగ్‌!)

>
మరిన్ని వార్తలు