టీమిండియా మరో ఓటమి.. సిరీస్‌ కివీస్‌ వశం

26 Jan, 2020 18:04 IST|Sakshi

క్రైస్ట్‌చర్చ్‌: వన్డే సిరీస్‌ విజేతను డిసైడ్‌ చేసే మ్యాచ్‌లో భారత్‌ ‘ఏ’ జట్టు చెతులెత్తేసింది. అనధికారిక మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం న్యూజిలాండ్‌ ‘ఏ’ తో జరిగిన ఉత్కంఠ పోరులో టీమిండియా 5 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 1-2 తేడాతో భారత జట్టు చేజార్చుకుంది. కివీస్‌ జట్టు నిర్దేశించిన 271 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 49.4 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఐదు పరుగుల తేడాతో మ్యాచ్‌ను అదేవిధంగా సిరీస్‌ను కూడా కివీస్‌ కైవసం చేసుకుంది. 

లక్ష్య ఛేదనలో ఇషాన్‌ కిషన్‌ (84 బంతుల్లో 71; 8ఫోర్లు) చివరి వరకు క్రీజులో ఉన్నా జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. కిషన్‌కు తోడు పృథ్వీ షా (38 బంతుల్లో 55; 8ఫోర్లు, 1 సిక్సర్‌) హాఫ్‌ సెంచరీ సాధించగా.. రుతురాజ్‌ గైక్వాడ్‌ (44), అక్షర్‌పటేల్‌ (32)లు పర్వాలేదనిపించారు. అయితే సారథి మయాంక్‌ అగర్వాల్‌ (24)తో పాటు సూర్యకుమార్‌ యాదవ్‌ (5), విజయ్‌ శంకర్‌(19), కృనాల్‌ పాండ్యా (7)లు పూర్తిగా నిరాశపరిచారు. కైల్‌ జేమ్సన్‌ నాలుగు వికెట్లతో చెలరేగగా.. అజాజ్‌ పటేల్‌ మూడు, రవీంద్ర రెండు వికెట్లు పడగొట్టి కివీస్‌ విజయంలో కీలకపాత్ర పోషించారు. 

అంతకుముందు టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేపట్టిన కివీస్‌ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 270 పరుగులు చేసింది. భారత బౌలర్ల ధాటికి కివీస్‌ ఓ క్రమంలో 105 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ తరుణంలో మార్క్‌ చాప్‌మన్‌ (98 బంతుల్లో 110; 10 ఫోర్లు, 1 సిక్సర్‌) సెంచరీతో సంచలన ఇన్నింగ్స్‌ ఆడాడు. చాప్‌మన్‌కు తోడు లోయరార్డర్‌ బ్యాట్స్‌మన్‌ ఆస్టల్‌ (65 బంతుల్లో 56; 2ఫోర్లు, 1 సిక్సర్‌) ఆర్థసెంచరీతో రాణించాడు. వీరిద్దరు ఏడో వికెట్‌కు 136 పరుగులు నమోదు చేయడం విశేషం. ఇషాన్ పోరెల్ మూడు వికెట్లతో రాణించగా.. రాహుల్‌ చహర్‌ రెండు, సందీప్‌ వారియర్‌, అక్షర్‌ పటేల్‌లు తలో వికెట్‌ పడగొట్టారు. ఇక తొలి వన్డేలో విశ్వరూపం ప్రదర్శించిన భారత ఆటగాళ్లు.. అదే జోరును తర్వాతి రెండు వన్డేల్లో కొనసాగించలేక ఓడిపోవడం గమనార్హం.  

చదవండి: 
వన్డేనే కానీ... ధనాధన్‌

మరిన్ని వార్తలు