అయ్యో గప్టిల్‌.. ఎంత పొరపాటాయే!

8 Feb, 2020 09:56 IST|Sakshi

ఆక్లాండ్‌: టీమిండియాతో జరుగుతున్న ద్వైపాక్షిక సిరీస్‌లో న్యూజిలాండ్‌ ఆటగాళ్లు రనౌట్ల రూపంలో కీలక వికెట్లు చేజార్చుకుంటున్నారు. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా నాల్గో టీ20లో మున్రోను విరాట్‌ కోహ్లి అద్భుతమైన రీతిలో రనౌట్‌ చేయగా, తొలి వన్డేలో నికోలస్‌ను సైతం కోహ్లినే రనౌట్‌ చేశాడు. ఈ రెండు సందర్భాల్లోనూ న్యూజిలాండ్‌ అనవసరపు పరుగు కోసం యత్నించి మూల్యం చెల్లించుకుంది. ఇప్పుడు రెండో వన్డేలో సైతం అదే పొరపాటును మార్టిన్‌ గప్టిల్‌ చేశాడు. ఈ మ్యాచ్‌లో సెంచరీ చేసే ఊపులో ఉన్న గప్టిల్‌ సింగిల్‌ కోసం ప్రయత్నించి వికెట్‌ కోల్పోయాడు. (ఇక్కడ చదవండి: గప్టిల్‌ నయా రికార్డు)

గప్టిల్‌ 79 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 79 పరుగుల వద్ద ఉండగా రనౌట్‌ అయ్యాడు. రవీంద్ర జడేజా వేసిన 30 ఓవర్‌ రెండో బంతిని రాస్‌ టేలర్‌ షార్ట్‌ థర్డ్‌ మ్యాన్‌ దిశగా రివర్స్‌ స్వీప్‌ ఆడాడు. అయితే దానికి సింగిల్‌కు రమ్మంటూ గప్టిల్‌ను పిలిచాడు. దాంతో ఇద్దరూ పరుగు కోసం ప్రయత్నిస్తుండగా శార్దూల్‌ ఠాకూర్‌ బంతిని అందుకుని కీపర్‌ రాహుల్‌ విసిరాడు. దాంతో వెంటనే రాహుల్‌ వికెట్లను గిరటేయడం,  గప్టిల్‌ ఎటువంటి అనుమానం లేకుండా పెవిలియన్‌కు చేరుకోవడం జరిగిపోయాయి. అది రనౌట్‌ అని కచ్చితంగా గప్టిల్‌కు తెలియడంతో థర్డ్‌ అంపైర్‌ నిర్ణయం కోసం వేచి ఉండకుండానే మైదానాన్ని వీడాడు.  

ఈ మైదానంలో గప్టిల్‌కు విశేషమైన రికార్డు ఉంది. ఇక్కడ ఈ మ్యాచ్‌ ముందు వరకూ చూస్తే గప్టిల్‌ 15 ఇన్నింగ్స్‌ల్లో 61కి పైగా సగటుతో 739 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, మూడు హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. తాజా మ్యాచ్‌లో గప్టిల్‌ హాఫ్‌ సెంచరీ సాధించినా, సెంచరీ సాధించే అవకాశాన్ని మిస్సయ్యాడు. గప్టిల్‌ ఔట్‌తో 157 పరుగుల వద్ద కివీస్‌ మూడో వికెట్‌ను కోల్పోయింది. అంతకుముందు బ్లండెల్‌(22), నికోలస్‌(41)లు ఔటయ్యారు.(ఇక్కడ చదవండి: షమీని ఎందుకు తీసినట్లు?)

>
మరిన్ని వార్తలు