శాంసన్‌.. మైండ్‌ బ్లోయింగ్‌ ఫీల్డింగ్‌!

2 Feb, 2020 15:20 IST|Sakshi

మౌంట్‌మాంగనీ: బ్యాటింగ్‌లో విఫలమవుతున్న ఫీల్డింగ్‌లో మాత్రం సంజూ శాంసన్‌ అదరగొడుతున్నాడు.  న్యూజిలాండ్‌తో చివరి టీ20లో రాస్‌ టేలర్‌ కొట్టిన ఒక భారీ షాట్‌ను సిక్స్‌ రాకుండా చేసి నాలుగు పరుగులు సేవ్‌ చేశాడు. శార్దూల్‌ ఠాకూర్‌ వేసిన 8వ ఓవర్‌ చివరి బంతిని టేలర్‌ డీప్‌లో భారీ షాట్‌ ఆడాడు. అయితే అది సిక్స్‌ అనే అంతా భావించారు. 

కానీ చివరి నిమిషంలో బంతిని గాల్లో ఎగిరి పట్టుకున్న శాంసన్‌..  బౌండరీ లైన్‌ అవతలకు వెళ్లే క్రమంలో గ్రౌండ్‌లోకి విసిరేశాడు. దాంతో సిక్స్‌  అనుకున్న ఆ షాట్‌కు రెండు పరుగులే వచ్చాయి. ఇక సంజూ శాంసన్‌ ఫీల్డింగ్‌పై ప్రశంసలు కురిశాయి. వాటే ఎ ఫీల్డింగ్‌ అంటూ సహచరులతో పాటు కామెంటేటర్లు సైతం కొనియాడారు. ఇక శాంసన్‌ ఫీల్డింగ్‌ చూసిన అభిమానులు మాత్రం ముక్కున వేలేసుకుని ఔరా అనుకున్నారు. (ఇక్కడ చదవండి: కోహ్లిని దాటేసిన రాహుల్‌)

టీమిండియా 164 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌ జట్టులో కేఎల్‌ రాహుల్‌(45; 33 బంతుల్లో 4 ఫోర్లు, 2సిక్స్‌లు), రోహిత్‌ శర్మ(60 రిటైర్డ్‌ హర్ట్‌; 41 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధాటిగా ఆడటంతో పాటు శ్రేయస్‌ అయ్యర్‌(33 నాటౌట్‌; 1 ఫోర్‌, 2 సిక్స్‌లు) మరోసారి బాధ్యతాయుతంగా ఆడటంతో నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో కివీస్‌ 17 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.

మరిన్ని వార్తలు