శాంసన్‌ ఏందిది..?

31 Jan, 2020 12:59 IST|Sakshi

వెల్లింగ్టన్‌:  టీమిండియా యువ వికెట్‌ కీపర్‌ సంజూ శాంసన్‌ తనకు వచ్చిన అవకాశాన్ని మళ్లీ మిస్‌ చేసుకున్నాడు. శ్రీలంకతో సిరీస్‌లో భాగంగా చివరి టీ20లో అవకాశం దక్కించుకుని రెండు బంతులే ఆడి నిరాశపరిచిన శాంసన్‌.. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో నాల్గో టీ20లో తుది జట్టులో అవకాశం దక్కించుకున్నాడు. టీమిండియా ఇప్పటికే సిరీస్‌ను కైవసం చేసుకోవడంతో నాల్గో మ్యాచ్‌లో మార్పులు చేసింది. అందులో శాంసన్‌ ఒకడు. రోహిత్‌ శర్మ స్థానంలో శాంసన్‌కు అవకాశం కల్పించింది టీమిండియా మేనేజ్‌మెంట్‌. అయితే శాంసన్‌ తన ఆట తీరును మార్చుకోలేదు. లంకేయులతో  సిరీస్‌లో తొలి బంతికి సిక్స్‌ కొట్టిన శాంసన్‌.. రెండో బంతికి వికెట్లు ముందు దొరికిపోయాడు. 

ఇప్పుడు కివీస్‌తో సిరీస్‌లో ముందుగా టీమిండియా బ్యాటింగ్‌ దిగడంతో ఓపెనర్‌గా వచ్చి ఐదు బంతులే ఆడి 8 పరుగుల వద్ద తొలి వికెట్‌గా నిష్క్రమించాడు.  కుగ్‌లీన్ వేసిన రెండో ఓవర్‌ మొదటి బంతిని సిక్స్‌ కొట్టిన శాంసన్‌.. రెండో బంతికి పరుగు తీయలేదు. ఇక మూడో బంతికి భారీ షాట్‌ కొట్టే యత్నంలో సాన్‌ట్నార్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. మ్యాచ్‌ ఆరంభమైన కాసేపటికే శాంసన్‌ భారీ షాట్లకు పోయి వికెట్‌ను సమర‍్పించుకున్నాడు. ఆదిలోనే అంత అత్యుత్సాహం ఎందుకో శాంసన్‌కే తెలియాలి. అసలు పిచ్‌ పరిస్థితిని అర్థం చేసుకోకుండా అలా మూల్యం చెల్లించుకోవడం అతని దుందుడుకు స్వభావానికి అద్దం పడుతోంది. అది మ్యాచ్‌ చివరి బంతి అయినట్లు ఒక పేలవమైన షాట్‌ ఆడటం​ విసుగు తెప్పించింది. ఐదేళ్ల తర్వాత శాంసన్‌కు వచ్చిన రెండో అవకాశం ఇది. దీన్ని కూడా వృథా చేసుకోవడంతో శాంసన్‌ ఏందిది? అనుకోవడం అభిమానుల వంతైంది. (ఇక్కడ చదవండి: వారికి విశ్రాంతి..ఈ ముగ్గురికీ అవకాశం)

>
మరిన్ని వార్తలు