ఇదొక కొత్త అనుభవం: కోహ్లి

31 Jan, 2020 18:28 IST|Sakshi

వెల్లింగ్టన్‌: న్యూజిలాండ్‌తో జరిగిన నాల్గో టీ20లో టీమిండియా సూపర్‌ ఓవర్‌లో విజయం సాధించింది. సూపర్‌ ఓవర్‌లో న్యూజిలాండ్‌ నిర్దేశించిన 14 పరుగుల టార్గెట్‌ను టీమిండియా బంతి మిగిలి ఉండగా ఛేదించింది. కోహ్లి ఐదో బంతికి ఫోర్‌ కొట్టి భారత్‌కు విజయాన్ని అందించాడు. గత మ్యాచ్‌లో టీమిండియా సూపర్‌ ఓవర్‌లోనే విజయం సాధించగా, రోహిత్‌ శర్మ వరుసగా రెండు సిక్సర్లు కొట్టి గెలుపును సాధించి పెట్టాడు. తాజా మ్యాచ్‌లో కేఎల్‌ రాహుల్‌-కోహ్లిలు సూపర్‌ ఓవర్‌ ఆడటానికి క్రీజ్‌లోకి వచ్చారు. తొలి రెండు బంతులకు సిక్స్‌, ఫోర్‌తో 10 పరుగులు సాధించిన రాహుల్‌.. మూడో బంతికి ఔటయ్యాడు. నాల్గో బంతికి కోహ్లి రెండు పరుగులు, ఐదో బంతికి బౌండరీ కొట్టి మ్యాచ్‌ను ముగించాడు. (ఇక్కడ చదవండి: టీమిండియా ‘డబుల్‌ సూపర్‌’)

అయితే మ్యాచ్‌ తర్వాత కోహ్లి మాట్లాడుతూ..  ఇది తనకు, జట్టుకు కొత్త అనుభవం అని పేర్కొన్నాడు. తాను ఇంతకుముందు ఎన్నడూ సూపర్‌ ఓవర్‌లో భాగం కాలేదని, ఇప్పుడు అందులో భాగం కావడం కొత్త పాఠం నేర్చుకున్నట్లు ఉందన్నాడు. ఒక జట్టుగా తాము వరుసగా రెండు సూపర్‌ ఓవర్‌ మ్యాచ్‌లు ఆడటం  ఎప్పుడూ జరగలేదన్నాడు. ఇది జట్టు సాధించిన సమిష్టి విజయమని కోహ్లి తెలిపాడు. ఇక కేఎల్‌ రాహుల్‌, సంజూ శాంసన్‌లను కోహ్లి కొనియాడాడు. వారిద్దరూ బంతిని బాగా స్టైక్‌ చేస్తారనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు. సంజూ శాంసన్‌ ఎటువంటి భయం లేని క్రికెటర్‌  అని కోహ్లి తెలిపాడు. అయితే తమ ఇన్నింగ్స్‌లో మొదటి సిక్స్‌ కొట్టిన తర్వాత పిచ్‌ అర్ధం చేసుకోవడంలో శాంసన్‌ విఫలం కావడంతో అతని ఇన్నింగ్స్‌ తొందరగా ముగిసిందన్నాడు. ఓవరాల్‌గా బ్యాటింగ్‌ చేసే క్రమంలో పిచ్‌ను అర్ధం చేసుకోవడంలో కాస్త ఇబ్బంది పడ్డామన్నాడు. ఇక స్లాగ్‌ ఓవర్లలో నవదీప్‌ సైనీ ఆకట్టుకున్నాడన్నాడు. గత రెండు మ్యాచ్‌ల్లో టీమిండియా అద్భుతమైన ముగింపు ఇవ్వడంతో ఫ్యాన్స్‌కు ప్రశ్నించే అవకాశాన్ని ఇవ్వలేదన్నాడు. 

మరిన్ని వార్తలు