అయ్యర్‌.. ఆ షాట్‌ అవసరమా!

8 Feb, 2020 14:15 IST|Sakshi

ఆక్లాండ్‌:  న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో టీమిండియా కష్టాల్లో పడ్డ సమయంలో నిలకడగా ఆడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దిన శ్రేయస్‌ అయ్యర్‌.. అనవసర తప్పిదంతో వికెట్‌ను సమర్పించుకున్నాడు. ఎంతో కుదురుగా ఆడుతున్నాడనుకునే సమయంలో అవసరం లేని షాట్‌కు యత్నించి పెవిలియన్‌ చేరాడు.  భారత జట్టు 34 పరుగుల వద్ద పృథ్వీ షా(24) వికెట్‌ కోల్పోయిన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన అయ్యర్‌ మరొకసారి ఎంతో పరిణితితో ఆడాడు. కోహ్లి(15), రాహుల్‌(4), కేదార్‌ జాదవ్‌(9)లు నిష్ర్కమించిన సమయంలో అయ్యర్‌ మాత్రం సమయోచితంగానే బ్యాటింగ్‌ చేశాడు. ఈ క్రమంలోనే 56 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 52 పరుగులు చేశాడు. కాగా, హాఫ్‌ సెంచరీ పూర్తైన వెంటనే అయ్యర్‌ నిర్లక్ష్యపు షాట్‌ ఆడాడు. బెన్నెట్‌ వేసిన 28 ఓవర్‌ రెండో బంతిని ఫోర్‌ కొట్టి అర్థ శతకం సాధించిన అయ్యర్‌.. ఆపై మరుసటి బంతికి కట్‌ షాట్‌ ఆడటానికి యత్నించి ఔటయ్యాడు. (ఇక్కడ చదవండి: కోహ్లి అంచనా తప్పింది..!)

తక్కువ ఎత్తులో లైన్‌ లెంగ్త్‌తో వచ్చిన బంతిని వికెట్‌ కీపర్‌ పైనుంచి షాట్‌ కొట్టాలని భావించాడు. ఆ బంతిని అసలు ఆ షాట్‌ ఆడాల్సిన అవసరం లేదు. బంతి బాగా బౌన్స్‌ అవుతేనే వికెట్‌ కీపర్‌ పైనుంచి షాట్లకు అవకాశం ఉంటుంది. అటువంటింది అయ్యర్‌ మాత్రం షాట్‌ను ఎలాగైనా ఆడాలనే ఆత్రంలో, బంతి గమనాన్ని అంచనా వేయలేకపోయాడు. దాంతో వికెట్‌ కోసం కాచుకుని కూర్చుకున్న కివీస్‌కు మూల్యం చెల్లించుకున్నాడు. ఆ బంతి టాప్‌ ఎడ్జ్‌ తీసుకోవడంతో కీపర్‌ లాథమ్‌ చేతుల్లోకి వెళ్లి పడింది. దాంతో టీమిండియా అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అయ్యర్‌.. ఆ షాట్‌ అవసరమా అనుకోవడం మాత్రమే ఫ్యాన్స్‌ వంతైంది. జట్టు స్కోరు 129 పరుగుల వద్ద ఉండగా అయ్యర్‌ ఆరో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. 274 పరుగుల లక్ష్య ఛేదనలో ఒక స్పెషలిస్టు బ్యాట్స్‌మన్‌ అలా ఆడటం టీమిండియా మేనేజ్‌మెంట్‌ను సైతం అసంతృప్తికి గురి చేసి ఉంటుంది. 

మరిన్ని వార్తలు