కోహ్లి కూడా రాణించలేదు కదా!

14 Feb, 2020 11:30 IST|Sakshi

ఉమేశ్‌ యాదవ్‌ కంటే సైనీనే బెటర్‌

న్యూఢిల్లీ:  న్యూజిలాండ్ పర్యటనలో ఘోరంగా విఫలమైన టీమిండియా పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాకు మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా అండగా నిలిచాడు. న్యూజిలాండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో బుమ్రా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. వెన్నుకు జరిగిన శస్త్రచికిత్స తర్వాత ఈ ఏడాది జనవరిలో తిరిగి జట్టులోకి వచ్చిన బుమ్రా కివీస్‌పై అంత ప్రభావం చూపలేకపోయాడు. కివీస్‌తో వన్డే సిరీస్‌లో వికెట్‌ కూడా తీయకపోవడం చర్చకు దారి తీసింది. అయితే అతడి ప్రదర్శనపై నెహ్రా తాజాగా మాట్లాడుతూ.. బుమ్రా ఫామ్ విషయంలో ఆందోళన చెందాల్సిన పనిలేదన్నాడు. ప్రస్తుతం బుమ్రా తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడన్నాడు. (ఇక్కడ చదవండి: సే‘యస్‌’ అయ్యర్‌)

ప్రతీ సిరీస్‌లోనూ బుమ్రా రాణించాలని అనుకోవడం పొరపాటే అవుతుందన్నాడు. ఇక్కడ టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిని ఉదహరించాడు. కివీస్‌తో ఇప్పటివరకూ జరిగిన సిరీస్‌లో కోహ్లి కూడా పెద్దగా రాణించలేదనే విషయం గుర్తించుకోవాలన్నాడు. ప్రతీ సందర్భంలో టాప్‌ ఆటగాళ్లు రాణించాలనుకోవడం సరైనది కాదన్నాడు. మహ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్ వంటి వారి స్థానాల్లో శార్దూల్ ఠాకూర్, నవ్‌దీప్ సైనీ వంటి వారిని కూడా గుర్తించాలని నెహ్రా కోరాడు. ప్రధాన బౌలర్లపైనే ఎప్పుడూ ఆధారపడకుండా జట్టు యాజమాన్యం సరైన నిర్ణయాలు తీసుకోవాలన్నాడు. బుమ్రాపైనే ఆధారపడడం వల్ల అతడిపై ఒత్తిడి పెరిగిపోతోందన్నాడు. కివీస్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌కు నవ్‌దీప్‌ సైనీని తీసుకుంటే బాగుంటుందన్నాడు. ఉమేశ్ యాదవ్ కంటే అతడే బెటరని నెహ్రా అభిప్రాయపడ్డాడు.(ఇక్కడ చదవండి: అదే బుమ్రా వైఫల్యానికి కారణం: జహీర్‌)


 

మరిన్ని వార్తలు