భారత్‌-సఫారీల తొలి వన్డేకు అంతరాయం

12 Mar, 2020 14:09 IST|Sakshi

ధర్మశాల: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్‌-దక్షిణాఫ్రికా జట్ల తొలి వన్డేకు వరుణుడు అడ్డంకిగా మారాడు. ఉదయం నుంచి పలు దఫాలుగా వర్షం పడుతూ ఉండటంతో మ్యాచ్‌కు ఆలస్యం కానుంది. ప్రస్తుతం వర్షం ఆగిపోవడంతో పిచ్‌ను తయారు చేసేపనిలో పడ్డారు గ్రౌండ్‌మెన్‌. దాంతో టాస్‌ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. చల్లటి వాతావరణం, తేమ కారణంగా మొదటినుంచి ఇక్కడి పిచ్‌ పేసర్లకు అనుకూలిస్తుంది. గతంలో చూస్తే రెండో బ్యాటింగ్‌ చేసిన జట్లే ఎక్కువ మ్యాచ్‌లు నెగ్గాయి.(స్వదేశంలో మళ్లీ ఆట మొదలు)

న్యూజిలాండ్‌ పర్యటనలో వన్డే, టెస్టు సిరీస్‌లలో అవమానకరంగా వైట్‌వాష్‌కు గురైన తర్వాత కొంత విరామంతో భారత జట్టు మరో పోరుకు సన్నద్ధమైంది. అయితే ఇప్పుడు వేదిక సొంతగడ్డకు మారింది. గత అక్టోబరులో ఇక్కడే జరిగిన టెస్టు సిరీస్‌లో చిత్తుగా ఓడిన దక్షిణాఫ్రికా నాటి పర్యటనకు కొనసాగింపుగా ఇప్పుడు కేవలం వన్డేల కోసమే వచ్చింది. స్వదేశంలో ఆస్ట్రేలియాను వన్డేల్లో చిత్తు చేసిన ఉత్సాహంతో సఫారీలు భారత్‌లో అడుగు పెట్టారు. అయితే భారత్‌లో కోహ్లి సేనను నిలువరించడం అంత సులువు కాదు. ఈ నేపథ్యంలో మూడు వన్డేల సమరం ఆసక్తికరంగా సాగనుంది.(డి కాక్‌ చెలరేగిపోగలడు!)

మరిన్ని వార్తలు