గర్జించిన కోహ్లి.. కుదేలైన విండీస్‌

6 Dec, 2019 22:48 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : టీమిండియా సారథి విరాట్‌ కోహ్లి మళ్లీ గర్జించాడు. విశ్వనగరంలో విశ్వరూపం ప్రదర్శించిన కోహ్లి టీమిండియాకు ఒంటి చేత్తో విజయాన్ని అందించి ఔరా అనిపించాడు. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా స్థానిక రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ మైదానంలో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. విండీస్‌ నిర్దేశించిన 208 పరుగుల భారీ లక్ష్యాన్ని కోహ్లి సేన మరో 8 బంతులు మిగిలుండగానే ఛేదించింది. లక్ష్య ఛేదనలో విరాట్‌ కోహ్లి (94 నాటౌట్‌; 50 బంతుల్లో 6ఫోర్లు, 6 సిక్సర్లు) అసాధారణరీతిలో బ్యాటింగ్‌ చేయగా.. ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌(56; 41 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధసెంచరీతో కెప్టెన్‌కు సహకారాన్ని అందించాడు. విండీస్‌ బౌలర్లలో పియర్‌ రెండు వికెట్లు పడగొట్టగా.. పొలార్డ్‌, కాట్రెల్‌లు తలో వికెట్‌ దక్కించుకున్నారు. 

మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా స్థానిక ఉప్పల్‌ మైదానంలో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో టీమిండియాకు వెస్టిండీస్‌ 208 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. పొట్టి ఫార్మట్‌కు పెట్టింది పేరైన కరేబియన్‌ ఆటగాళ్లు వచ్చిన వారు వచ్చినట్టు యథేచ్చగా బ్యాట్‌ ఝుళిపించారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది.

విండీస్‌ ఆటగాళ్లలో హెట్‌మైర్(56; 41 బంతుల్లో 2ఫోర్లు, 4సిక్సర్లు), లూయిస్‌(40; 17 బంతుల్లో 3ఫోర్లు, 4 సిక్సర్లు), పొలార్డ్‌(37;19 బంతుల్లో 1ఫోర్‌, 4 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగారు. చివర్లో జాసన్‌ హోల్డర్‌(24; 9 బంతుల్లో 1ఫోర్‌, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించాడు. దీంతో కోహ్లి సేన ముందు విండీస్‌ భారీ లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది. భారత బౌలర్లలో చహల్‌ రెండు, జడేజా, చహర్‌, సుందర్‌లు తలో వికెట్‌ పడగొట్టాడరు.  

మరిన్ని వార్తలు