తొలి టీ20: భారత్‌ V/S వెస్టిండీస్‌

6 Dec, 2019 20:39 IST|Sakshi

హైదరాబాద్‌: మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా స్థానిక ఉప్పల్‌ మైదానంలో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో టీమిండియాకు వెస్టిండీస్‌ 208 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. పొట్టి ఫార్మట్‌కు పెట్టింది పేరైన కరేబియన్‌ ఆటగాళ్లు వచ్చిన వారు వచ్చినట్టు యథేచ్చగా బ్యాట్‌ ఝుళిపించారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది.

విండీస్‌ ఆటగాళ్లలో హెట్‌మైర్(56; 41 బంతుల్లో 2ఫోర్లు, 4సిక్సర్లు), లూయిస్‌(40; 17 బంతుల్లో 3ఫోర్లు, 4 సిక్సర్లు), పొలార్డ్‌(37;19 బంతుల్లో 1ఫోర్‌, 4 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగారు. చివర్లో జాసన్‌ హోల్డర్‌(24; 9 బంతుల్లో 1ఫోర్‌, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించాడు. దీంతో కోహ్లి సేన ముందు విండీస్‌ భారీ లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది. భారత బౌలర్లలో చహల్‌ రెండు, జడేజా, చహర్‌, సుందర్‌లు తలో వికెట్‌ పడగొట్టాడరు.  

జోరును అడ్డుకోలేకపోయిన బౌలర్లు.. 
కరేబియన్‌ బ్యాట్స్‌మన్‌ జోరుకు భారత బౌలర్లు అడ్డుకట్ట వేయలేకపోయారు. దీనికితోడు చెత్త ఫీల్డింగ్‌తో కోహ్లి సేన భారీ మూల్యాన్ని చెల్లించుకుంది. ఒకటి కాదు రెండు కాదు అనేక క్యాచ్‌లను భారత ఫీల్డర్లు జారవిడిచారు. ఇక బౌలర్లు ఈ మ్యాచ్‌లో పూర్తిగా తేలిపోయారు. ఎన్నో అంచనాలు పెట్టుకున్న దీపక్‌ చహర్‌ ఏ మాత్రం ప్రభావం చూపెట్టలేకపోయాడు. నాలుగు ఓవర్లలో ఒక్క వికెట్‌ పడగొట్టి ఏకంగా 56 పరుగులు సమర్పించుకున్నాడు. 

ఆరంభం నుంచి ధాటిగానే..
టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌ వాషింగ్టన్‌ సుందర్‌ వేసిన తొలి ఓవర్‌లోనే 13 పరుగులు పిండుకుంది. అయితే దీపక్‌ చహర్‌ వేసిన రెండో ఓవర్‌లో ఓపెనర్‌ సిమన్స్‌(2) రోహిత్‌ శర్మకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన బ్రాండన్ కింగ్‌తో కలిసి లూయిస్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దిడు. ముఖ్యంగా లూయీస్‌ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. దీంతో ఐదు ఓవర్లు ముగిసే సరికి విండీస్‌ 50 పరుగులు దాటేసింది. అయితే వాషింగ్టన్‌ సుందర్‌ బౌలింగ్‌లో లూయిస్‌(40; 17 బంతుల్లో 3ఫోర్లు, 4 సిక్సర్లు) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.

అనంతరం రవీంద్ర జడేజా బౌలింగ్‌లో బ్రాండన్‌ కింగ్‌(31; 23 బంతుల్లో 3ఫోర్లు, 1 సిక్సర్‌) స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో మూడో వికెట్‌కు 37 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఇన్నింగ్స్‌ 18వ ఓవర్‌లో మణికట్టు స్పిన్నర్‌ చహల్‌ బౌలింగ్‌లో పొలార్డ్‌(37) క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. ఇదే ఓవర్‌లో హెట్‌మైర్(56) కూడా భారీ షాట్‌కు యత్నించి క్యాచ్‌ ఔట్‌గా వెనుదిరిగాడు. దీంతో ఓకే ఓవర్‌లో విండీస్‌ రెండు కీలక వికెట్లు కోల్పోయింది.

మరిన్ని వార్తలు