గెలిచి సమం చేశారు..

8 Dec, 2019 22:35 IST|Sakshi

టీమిండియా కొంప ముంచిన చెత్త ఫీల్డింగ్‌

హాఫ్‌ సెంచరీ సాధించిన సిమ్మన్స్‌

తిరువనంతపురం: టీమిండియాతో జరిగిన రెండో టీ20లో వెస్టిండీస్‌ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌ను విండీస్‌ 1-1తో సమం చేసింది. టీమిండియా నిర్దేశించిన 171 పరుగుల లక్ష్యాన్ని కేవలం రెండు వికెట్లు కోల్పోయి ఛేధించింది. లక్ష్య ఛేదనలో ఓపెనర్‌ సిమ్మన్స్‌(67 నాటౌట్‌; 45 బంతుల్లో 4ఫోర్లు, 4 సిక్సర్లు) భీభత్సం సృష్టించగా.. మరో ఓపెనర్‌ ఎవిన్‌ లూయిస్‌ (40; 35 బంతుల్లో 3ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించాడు. వీరికి తోడు హెట్‌మైర్‌(23;14 బంతుల్లో 3 సిక్సర్లు), నికోలస్‌ పూరన్‌(38 నాటౌట్‌; 18 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో విండీస్‌ విజయం సునాయసమైంది. విండీస్‌ బ్యాట్స్‌మెన్‌ జోరుకు తోడు ఆటగాళ్ల చెత్త ఫీల్డింగ్‌ టీమిండియా పరాజయానికి బాటలు వేసింది. భారత బౌలర్లలో సుందర్‌, జడేజాలు తలో వికెట్‌ దక్కించుకున్నారు. 

టీమిండియా నిర్దేశించిన 171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్‌కు ఓపెనర్లు చక్కటి శుభారంభాన్ని అందించారు. ముఖ్యంగా లూయిస్‌ భారత బౌలర్లపై విరుచుకపడ్డాడు. అయితే ఆరంభంలోనే లూయిస్‌​ క్యాచ్‌ను రిషభ్‌ పంత్‌ మిస్‌ చేయగా.. సిమ్మన్స్‌ క్యాచ్‌ను వాషింగ్టన్‌ సుందర్‌ నేలపాలు చేశాడు. ఈ రెండు క్యాచ్‌లు భువనేశ్వర్‌ బౌలింగ్‌ వేసిన ఓకే ఓవర్‌లో కావడం గమనార్హం. ఇక అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ఓపెనర్లు మరింత దాటిగా ఆడారు. ఇదే ఊపులో లూయిస్‌ భారీ షాట్‌కు యత్నించి సుందర్‌ బౌలింగ్‌లో స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. అనంతరం సిమ్మన్స్‌ గేర్‌ మార్చి దూకుడుగా ఆడటం ప్రారంభించాడు. దీంతో విండీస్‌ విజయం దిశగా పయనించింది. ఇదే క్రమంలో హెట్‌మైర్‌, పూరన్‌లు కూడా తలో చేయి వేయడంతో 18.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని పూర్తిచేసింది. ఇక నిర్ణయాత్మకమైన మూడో టీ20 బుధవారం ముంబై వాంఖడే స్టేడియంలో జరగనుంది. 

చదవండి:
వెస్టిండీస్‌ లక్ష్యం 171


     

మరిన్ని వార్తలు