టీమిండియాకు షాక్‌.. శార్దూల్‌కు పిలుపు!

13 Dec, 2019 21:23 IST|Sakshi

చెన్నై: టీమిండియా పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ మరోసారి గాయం బారిన పడ్డాడు. వన్డే ప్రపంచకప్‌ అనంతరం మోకాలి గాయం కారణంగా ఆటకు నాలుగు నెలలు దూరమైన ఈ మీడియం పేసర్‌ వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో రీ ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఆదివారం నుంచి వెస్టిండీస్‌తో ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌ కోసం టీమిండియా క్రికెటర్లు ప్రాక్టీస్‌ మొదలెట్టారు. అయితే నెట్‌ ప్రాక్టీస్‌లో భాగంగా భువీకి గాయం తిరగబెట్టినట్టు సమాచారం. 

గాయం కారణంగా భువీని వన్డే​ సిరీస్‌ నుంచి తప్పించి అతడి స్థానంలో ముంబై మీడియం పేసర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ను ఎంపిక చేసే అవకాశం ఉందని, దీనికి సంబంధించి బోర్డు నుంచి అధికారిక ప్రకటన వెలువడనుందని బీసీసీఐకి చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు. అయితే భువీ గాయం తీవ్రతపై స్పష్టతనివ్వడానికి ఆ అధికారి నిరాకరించారు. టీ20 సిరీస్‌ గెలిచిన ఉత్సాహంతో కీలక వన్డే సిరీస్‌కు సమయాత్తమవుతున్న టీమిండియాకు ఇది పెద్ద ఎదురుదెబ్బ. దీంతో వన్డే సిరీస్‌లో సీనియర్‌ బౌలర్‌ మహ్మద్‌ షమీతో కలిసి యువ పేసర్‌ దీపక్‌ చహర్‌ ఏ మేరకు రాణిస్తారో చూడాలి. 

ఇక భువీ గాయంపై బౌలింగ్‌ కోచ్‌ అరుణ్‌కుమార్‌ స్పందించాడు. ‘భువీ గాయంపై ఫిజియో పరీక్షలు నిర్వహిస్తున్నాడని, నివేదిక రాగానే అతడి గాయంపై స్పష్టత వస్తుంది’అని భరత్‌ అరుణ్‌ పేర్కొన్నాడు. ఇక ఇప్పటికే జస్ప్రిత్‌ బుమ్రా, నవదీప్‌ సైనీలు గాయాల బారిన పడటంతో భారత బౌలింగ్‌ రిజర్వ్‌ బెంచ్‌ బలహీనపడింది. తాజాగా భువీ కూడా మరోసారి గాయపడటంతో టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఆందోళనచెందుతోంది. ఆటగాళ్లు ముఖ్యంగా బౌలర్లు గాయాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ఫలితం మాత్రం శూన్యంగా కనిపిస్తోంది.  

ఇక భువనేశ్వర్‌కు బ్యాకప్‌గా ఉమేశ్‌ను ఎంపిక చేస్తారని భావించినప్పటికీ.. శార్దూల్‌ వైపే సెలక్టర్లు మొగ్గు చూపినట్లు సమాచారం. యువ పేసర్‌ నవదీప్‌ సైనీ గాయం నుంచి కోలుకున్నప్పటికీ పూర్థిస్థాయి ఫిట్‌నెస్‌ సాధించలేదు. దీంతో రిస్క్‌ చేయడం ఎందుకని సైనీని పరిగణలోకి తీసుకోలేదు. ఇక శార్దూల్‌ టీమిండియా తరుపున గతేడాది జరిగిన ఆసియా కప్‌-2018 టోర్నీలో చివరగా ఆడాడు. ఐపీఎల్‌-12లోనూ అంతగా ఆకట్టుకోని శార్దూల్‌ అందివచ్చిన అవకాశాన్ని ఏ మేరకు సద్వినియోగం చేసుకుంటాడో చూడాలి. 

మరిన్ని వార్తలు