ధోని రికార్డును పంత్‌ బ్రేక్‌ చేస్తాడా?

5 Dec, 2019 12:28 IST|Sakshi

హైదరాబాద్‌: టీమిండియా-వెస్టిండీస్‌ జట్ల మధ్య రేపటి(శుక్రవారం) నుంచి మూడు టీ20ల సిరీస్‌ ఆరంభం కానున్న తరుణంలో యువ వికెట్‌  కీపర్‌ రిషభ్‌ పంత్‌ను ఒక రికార్డు ఊరిస్తోంది. ఈ సిరీస్‌లో వికెట్‌ కీపర్‌గా సంజూ శాంసన్‌ జట్టులో ఉన్నప్పటికీ పంత్‌కే తొలి అవకాశంగా కనబడుతోంది. కనీసం రెండు టీ20ల్లోనైనా పంత్‌ ఆడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అదే సమయంలో పంత్‌ ముంగిట ఒక రికార్డు కూడా ఉంది. అది కూడా టీమిండియా మాజీ కెప్టెన్‌, సీనియర్‌ వికెట్‌ కీపర్‌ ఎంఎస్‌ ధోని రికార్డు. భారత్‌-వెస్టిండీస్‌ల మధ్య ఇప్పటివరకూ జరిగిన టీ20ల సిరీస్‌ పరంగా చూస్తే వికెట్‌ కీపర్‌గా ధోని ఏడు మ్యాచ్‌లు ఆడి ఐదు ఔట్లలో భాగమయ్యాడు.

కాగా, పంత్‌ కూడా విండీస్‌తో ఇప్పటివరకూ ఏడు టీ20ల ఆడినా మూడు ఔట్లతోనే ఉన్నాడు. దాంతో మరొకసారి భారత్‌-వెస్టిండీస్‌ల టీ20 సిరీస్‌ జరుగనున్న తరుణంలో ధోని రికార్డుపై పంత్‌ కన్నేశాడు. ఈ సిరీస్‌లో మరో రెండు ఔట్లలో పంత్‌ భాగమైతే ధోని సరసన నిలుస్తాడు. ఒకవేళ మూడు ఔట్లలో భాగమైతే ధోని రికార్డును పంత్‌ బ్రేక్‌ చేస్తాడు. మరి పంత్‌కు అవకాశం దక్కి  ఇరు జట్ల మధ్య పొట్టి సిరీస్‌లో భారత్‌ తరఫున అత్యధిక ఔట్లలో భాగస్వామ్యం అవుతాడో లేదో చూద్దాం. రేపు ఇరు జట్ల మధ్య ఉప్పల్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో తొలి టీ20 జరుగనుంది.

భారత్‌ -విండీస్‌ టీ20 సిరీస్‌ల్లో ఎక్కువ ఔట్లలో భాగస్వామ్యమైన వికెట్‌ కీపర్ల జాబితా..

ఎంఎస్‌ ధోని-3 క్యాచ్‌లు-2 స్టంపింగ్స్‌- 7 మ్యాచ్‌లు

దినేశ్‌ రామ్‌దిన్‌- 5 క్యాచ్‌లు-నో స్టంపింగ్స్‌-7 మ్యాచ్‌లు

ఆండ్రీ ఫ్లెచర్‌- 3  క్యాచ్‌లు- నో స్టంపింగ్స్‌-4 మ్యాచ్‌లు

దినేశ్‌ కార్తీక్‌- 3 క్యాచ్‌లు-నో స్టంపింగ్స్‌- 4 మ్యాచ్‌లు

రిషభ్‌ పంత్‌- 3 క్యాచ్‌లు- నో స్టంపింగ్స్‌-7 మ్యాచ్‌లు

మరిన్ని వార్తలు