తన రికార్డును తిరగరాసుకున్న రోహిత్‌

18 Dec, 2019 17:55 IST|Sakshi

విశాఖ:  టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ తన రికార్డును తానే సవరించుకున్నాడు. ఒక క్యాలెండర్‌ ఇయర్‌ అత్యధిక అంతర్జాతీయ సిక్సర్లు సాధించిన రికార్డును రోహిత్‌ తిరగరాశాడు. 2018లో అంతర్జాతీయంగా 74 సిక్సర్లు సాధించిన రోహిత్‌.. ఈ ఏడాది ఇప్పటివరకూ 77 సిక్సర్లు కొట్టాడు.  ఫలితంగా అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక క్యాలెండర్‌ ఇయర్‌ అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డును సవరించుకున్నాడు. కాగా, ఈ జాబితాలో తొలి మూడు స్థానాల్లో రోహితే ఉండటం విశేషం. 2017లో జరిగిన అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో రోహిత్‌ 65 సిక్సర్లు సాధించగా, దాన్ని 2018లో బ్రేక్‌ చేశాడు. ఇప్పుడు గతేడాది రికార్డును రోహిత్‌ తిరగరాసుకున్నాడు. ఈ జాబితాలో నాల్గో స్థానంలో ఏబీ డివిలియర్స్‌(65 సిక్సర్లు-2015) ఉండగా, ఇయాన్‌ మోర్గాన్‌(60 సిక్సర్లు-2019) ఐదో స్థానంలో ఉన్నాడు.(ఇక్కడ చదవండి: ఇరగదీసిన టీమిండియా.. విండీస్‌కు భారీ లక్ష్యం)

ఒక ఓవర్‌లో అత్యధిక పరుగుల రికార్డు
ఒక ఓవర్‌లో అత్యధిక పరుగుల రికార్డును సాధించిన రికార్డును  టీమిండియా సవరించుకుంది. ఇప్పటివరకూ 1999లో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో సచిన్‌ టెండూల్కర్‌-అజేయ్‌ జడేజాల జోడి  ఒక ఓవర్‌లో 28 పరుగులు సాధించింది. తాజాగా ఆ రికార్డును శ్రేయస్‌ అయ్యర్‌-రిషభ్‌ పంత్‌ల జోడి బ్రేక్‌ చేసింది. విండీస్‌తో రెండో వన్డేలో ఈ జోడి ఒక ఓవర్‌లో 31 పరుగులు సాధించింది. రోస్టన్‌ ఛేజ్‌ వేసిన 47 ఓవరల్‌లో అయ్యర్‌-పంత్‌లు ఈ ఫీట్‌ను నమోదు చేశారు. ఈ ఓవర్‌లో నాలుగు సిక్సర్లు,  ఒక ఫోర్‌ వచ్చింది.  తొలి బంతిని ఛేజ్‌ నో బాల్‌గా వేశాడు.  ఆ బంతికి బై రూపంలో పరుగు కూడా వచ్చింది. ఈ ఓవర్‌లో పంత్‌ కేవలం పరుగు మాత్రమే తీయగా,  28 పరుగుల్ని అయ్యర్‌ సాధించడం విశేషం.(ఇక్కడ చదవండి: పంత్‌కు పూనకం వచ్చింది..)

రెండో అత్యుత్తమ స్కోరు
ఈ మ్యాచ్‌లో భారత్‌ ఐదు వికెట్ల నష్టానికి 387 పరుగులు చేయడంతో అరుదైన ఘనతను సాధించింది. వన్డే ఫార్మాట్‌లో విండీస్‌పై రెండో అత్యుత్తమ స్కోరును నమోదు చేసింది. 2011లో ఇండోర్‌లో జరిగిన మ్యాచ్‌లో విండీస్‌పై భారత్‌ 418 పరుగులు సాధించగా, ఆ తర్వాత స్థానంలో నేటి మ్యాచ్‌ చేరింది.

మరిన్ని వార్తలు