విండీస్‌ కోచ్‌ మాటలు.. అక్షర సత్యం..!

23 Dec, 2019 12:22 IST|Sakshi

కటక్‌: ‘మేము ప్రస్తుతం ఒక డైరెక్షన్‌లో ముందుకు వెళుతున్నాం. అద్భుతాలు చేయడానికి కృషి చేస్తున్నాం. భారత్‌ ముందు 320 పరుగుల లక్ష్యాన్నిఉంచితే పోరాడవచ్చు. అది కూడా భారత్‌ వంటి పటిష్టమైన జట్టు  ముందు సరిపోదనే అనుకుంటున్నా. మేము అత్యుద్భుతమైన ప్రదర్శన చేసినా అది సరిపోవకపోవచ్చు.  విరాట్‌ కోహ్లి నేతృత్వంలోని భారత్‌ జట్టును ఓడించడానికి 300-320 మధ్య స్కోరు చేయాల్సి ఉంటుంది.  కానీ అది మేము విజయం సాధించడానికి సరిపోతుందని నేను అనుకోవడం  లేదు. భారత్‌తో జరిగే చివరి మ్యాచ్‌కు మా జట్టు సభ్యులంతా వంద శాతం ప్రదర్శన ఇవ్వడానికి సమాయత్తమయ్యారు’ అని భారత్‌ మ్యాచ్‌కు ఒక రోజు ముందు వెస్టిండీస్‌ కోచ్‌ ఫిల్‌ సిమ్మన్స్‌ చెప్పిన మాటలు ఇవి.(ఇక్కడ చదవండి: ‘నంబర్‌ వన్‌’ అని నిరూపించుకుంది: పొలార్డ్‌)

ఈ మాటలు అక్షర సత్యమయ్యాయి. విండీస్‌ 316  పరుగుల టార్గెట్‌ను టీమిండియా ముందు ఉంచినా దాన్ని మనోళ్లు సునాయాసంగానే ఛేదించారు. సిమ్మిన్స్‌ ఏదైతే ఊహించాడో అది దాదాపు నిజమైంది. సాధారణంగా 300 పైచిలుకు పరుగులు ఛేదించాలంటే ఏ జట్టుకైనా కష్టమే. అది కూడా ఒత్తిడిలో ఉన్నప్పుడు  ఆ టార్గెట్‌ను అందుకోవడం కష్టం. మరి టీమిండియా మాత్రం ఏమాత్రం తడబాటు లేకుండా దాన్ని ఛేదించింది. దీన్ని సిమ్మన్స్‌ ఊహించడం ఇక్కడ విశేషంగానే చెప్పొచ్చు. గతంలో  విండీస్‌ టీ20 వరల్డ్‌కప్‌ సాధించడంలో కీలక  పాత్ర పోషించిన  సిమ్మన్స్‌.. ఆ తర్వాత బోర్డుతో  విభేదాల కారణంగా కోచింగ్‌  బాధ్యతలకు  దూరమయ్యాడు. కాగా, ఇటీవల మళ్లీ అతన్నే కావాలనే కోచ్‌గా నియమిస్తూ విండీస్‌ పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. విండీస్‌ బోర్డులో పాత వారు వెళ్లిపోయి, కొత్త వారు రావడంతో సిమ్మన్స్‌ నియామకం మళ్లీ జరిగింది. ఒక కోచ్‌గా జట్టు పరిస్థితినే కాకుండా ప్రత్యర్థి జట్టును కూడా అంచనా వేయడమే ప్రధానంగా కోచ్‌లు చేసే పని.  దాన్ని సిమ్మన్స్‌ ఇక్కడ నిరూపించుకున్నాడనే చెప్పాలి. ఫీల్డ్‌లో  కోచ్‌ల పాత్ర ఏమీ లేకపోయినా, తమ అంచనాలు నిజమైనప్పుడు మాత్రం వారు ఒక్కసారిగా వెలుగులోకి వస్తారు. ఇలా సిమ్మన్స్‌ ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అయ్యాడు.

మరిన్ని వార్తలు