‘ఈడెన్‌’కూ వర్షం బెడద

19 Sep, 2017 00:17 IST|Sakshi
కోల్‌కతాకు బయలుదేరేముందు చెన్నై విమానాశ్రయంలో సేదతీరుతున్న ధోని, కోహ్లి, రాహుల్, హార్దిక్‌ పాండ్యా

కోల్‌కతా చేరిన భారత్, ఆస్ట్రేలియా జట్లు
గురువారం రెండో వన్డే


కోల్‌కతా: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఈడెన్‌ గార్డెన్స్‌లో ఈ నెల 21న జరగనున్న రెండో వన్డేకూ వాన ముప్పు ఉంది. స్థానిక వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ గణేష్‌ దాస్‌ మాట్లాడుతూ ‘ఈ నెల 21 వరకు వర్షాలు కురుస్తాయని ఇప్పటికే తెలియజేశాం. ఇక్కడ ఈ నెలంతా సాయంత్రం చిరుజల్లులు కురిసే అవకాశం ఎక్కువ’ అని అన్నారు. పరిస్థితిని సమీక్షించిన క్యాబ్‌ అధ్యక్షుడు గంగూలీ స్టేడియం వర్గాలకు అవసరమైన సూచనలు చేశారు. పిచ్, ఔట్‌ ఫీల్డ్‌ను కవర్స్‌తో కప్పి ఉంచారు. రెండో వన్డే ఆడేందుకు ఇరు జట్లు సోమవారం కోల్‌కతా చేరుకున్నాయి. అంతకుముందు కోల్‌కతాకు బయలు దేరేముందు చెన్నై విమానాశ్రయంలో ధోని, కోహ్లి తదితరులు ఎయిర్‌పోర్ట్‌లోని ఫ్లోర్‌పై కాసేపు సేదతీరిన ఫొటోలను బీసీసీఐ తమ వెబ్‌సైట్‌లో పోస్ట్‌ చేసింది. కోల్‌కతా చేరుకున్న ఆటగాళ్లు సోమవారం  ప్రాక్టీస్‌ చేయకుండా పూర్తిగా విశ్రాంతి తీసుకున్నారు. చెన్నైలో జరిగిన తొలి వన్డేలో భారత్‌ శుభారంభం చేసిన సంగతి తెలిసిందే.

ఇదే ఆఖరి ‘ఐదు’ సిరీస్‌ ఏమో!
ఇకపై ముఖాముఖీ సిరీస్‌ల్లో ఐదు మ్యాచ్‌లకు చోటు ఉండకపోవచ్చని క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) చీఫ్‌ ఎగ్జిక్యూటీవ్‌ జేమ్స్‌ సదర్లాండ్‌ అన్నారు. ప్రస్తుతం భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న 5 వన్డేల సిరీసే ఆఖరి పోరెమోనని చెప్పారు. ‘భవిష్యత్తులో ఏ దేశం కూడా మూడు వన్డేల సిరీస్‌కు మించి అంగీకరించకపోవచ్చు. దీంతో ద్వైపాక్షిక సిరీస్‌లన్నీ మూడు మ్యాచ్‌లతో జరుగుతాయని నాకు అనిపిస్తోంది’ అని సదర్లాండ్‌ తెలిపారు. ఇప్పటికే ముఖాముఖీ షెడ్యూల్లో టి20లు వచ్చేశాయని, త్వరలో టెస్టు చాంపియన్‌షిప్, 13 జట్ల వన్డే లీగ్‌లకూ శ్రీకారం జరగొచ్చని చెప్పారు. ఈ నేపథ్యంలో వన్డే సిరీస్‌ల కుదింపు అనివార్యమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ జరిగితే ఇటీవలి ఆసీస్, బంగ్లాదేశ్‌ జట్ల మధ్య జరిగినట్లుగా పోటాపోటీ ఉండాలని ఆయన ఆకాంక్షించారు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా