రోహిత్, ఆమిర్‌ల పోరు చూడాల్సిందే! 

19 Sep, 2018 01:32 IST|Sakshi

క్రికెట్‌ అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారత్, పాకిస్తాన్‌ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఎప్పటిలాగే ఈ పోరులో ఉత్కంఠకు లోటు ఉండకపోవచ్చు. ఇంగ్లండ్‌ పర్యటనలో చెలరేగిన కోహ్లి గైర్హాజరు, భారత్‌ వరుసగా రెండు మ్యాచ్‌లు ఆడుతుండటం, ఇక్కడి ఎడారి వాతావరణంలో తీవ్రమైన వేడి వంటి అంశాలపై చర్చ కొనసాగుతోంది. డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాకు తగినట్లుగా భారత్‌ ఆరంభం అదిరిపోవాలి. కానీ ఇంగ్లండ్‌లో విఫలమైన మన ఆటగాళ్లు ఎంత తొందరగా కోలుకొని గాడిలో పడతారనేది కీలకం. చాలా రోజులుగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్న ధోని, రోహిత్, భువనేశ్వర్‌లాంటి వాళ్లు నేరుగా మ్యాచ్‌ బరిలోకి దిగి రాణించడం అంత సులువు కాదు. ఇక్కడి వేడి అన్నింటికంటే పెద్ద సమస్య. ఇంగ్లండ్‌ గడ్డపై సుదీర్ఘ స్పెల్‌లు బౌలింగ్‌ చేసిన మన పేసర్లు కూడా ఇక్కడ అదే తరహాలో బౌలింగ్‌ చేయాలంటే చాలా కష్టం. రెండేసి, మూడేసి పరుగులు తీయడం కూడా బ్యాట్స్‌మన్‌ శక్తిని పూర్తిగా హరించివేసే అవకాశం ఉంది కాబట్టి ఈ టోర్నీలో డబుల్‌ సెంచరీ సాధించడం మాత్రం అసాధ్యమని తేలిపోయింది.

గత ఏడాది చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో భారత్‌ను ఓడించడం వల్ల మానసికంగా పాకిస్తాన్‌దే పైచేయి. ఆ మ్యాచ్‌లో పాక్‌ ఓపెనర్లు, ఆరంభ బౌలర్లు అద్భుత ప్రదర్శనతో భారత్‌ను చిత్తు చేశారు. ఎమిరేట్స్‌ కూడా పాకిస్తాన్‌ను సొంత మైదానంలాంటిది కాబట్టి ఇక్కడి పరిస్థితులపై భారత్‌కంటే వారికే ఎక్కువ అవగాహన ఉంటుంది. ఆ జట్టు ఇటీవలి ఫామ్‌ కూడా చాలా బాగుంది. యువకులు, అనుభవజ్ఞులతో జట్టు సమతూకంగా ఉండటంతో పాటు వారి ఫీల్డింగ్‌ కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా గొప్పగా కనిపిస్తోంది.   టెస్టు జట్టులో స్థానం కోల్పోయిన తర్వాత తన సత్తా ఏమిటో ఇక్కడి చూపించాలని రోహిత్‌ పట్టుదలగా ఉన్నాడు. అయితే అటు వైపు మొహమ్మద్‌ ఆమిర్‌ సిద్ధంగా ఉన్నాడు. ఫుట్‌వర్క్‌ మెరుగ్గా ఉండని రోహిత్‌ను చక్కటి స్వింగ్‌తో తొలి రెండు ఓవర్లలోనే వెనక్కి పంపాలని అతను భావిస్తూ ఉండవచ్చు. దీనిని అధిగమించగలిగితే రోహిత్‌ను అడ్డుకోవడం చాలా కష్టం.  చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో సెంచరీ తర్వాత పాకిస్తానీ ఫఖర్‌ జమాన్‌ అతి వేగంగా దూసుకొచ్చాడు. మరోసారి అతని ఆట కీలకం కానుంది. ప్రతిభ గల పాకిస్తాన్‌ బ్యాట్స్‌మెన్‌కు, భారత స్పిన్నర్లకు మధ్య జరిగే ఆసక్తికర పోరును చూడాల్సిందే. అయితే ఎప్పటిలాగే ఎవరు గెలుస్తారనేది ఈ మ్యాచ్‌లో అంచనా వేయడం కష్టమే.    

మరిన్ని వార్తలు