సై అంటే సై!

17 Dec, 2017 01:01 IST|Sakshi

వైజాగ్‌లో నేడు భారత్, శ్రీలంక మూడో వన్డే

సిరీస్‌ విజయమే లక్ష్యం 

ఫామ్‌లో టీమిండియా

ఆశల పల్లకిలో లంక

కొన్ని సందర్భాల్లో గెలుపు తప్ప ఇంకేది సరిపోదు. అలాంటి సందర్భమే ఇప్పుడు వైజాగ్‌లో వచ్చింది. ఇక్కడ వ్యూహంపై రెండాకులు ఎక్కువ చదవాలి. ఒక్కో అడుగు జాగ్రత్తగా వేయాలి. ఏదేమైనా గెలవాల్సిందే... ఎందుకంటే ఇక్కడ మ్యాచ్‌ పోతే సిరీసే పోతుంది. గెలిస్తేనే సిరీస్‌ అందుతుంది. ఈ నేపథ్యంలో భారత్, శ్రీలంకలకు ఇది ఆఖరి పోరు అనే బదులు సిరీస్‌ అందుకునే పోరు అంటే బాగుంటుంది. 

సాక్షి, విశాఖపట్నం: ఇక్కడ ఓ మ్యాచ్‌లోనే తేల్చుకోవడానికి వచ్చినా... ఒక సిరీస్‌ను గెల్చుకునేందుకు సిద్ధమయ్యాయి ఇరు జట్లు. మూడు వన్డేల సిరీస్‌లో భారత్, శ్రీలంక చెరోటి గెలిచాయి. ఇపుడు ఇక్కడ మరోటి గెలిస్తే... ఓ జట్టు విజేత అవుతుంది. 2–1తో సిరీస్‌ ముగుస్తుంది. అయితే ఎవరు ముగిస్తారు విజయవంతంగా? ఎవరు నిలుస్తారు విజేతగా? అంటే మాత్రం ఇంకొన్ని గంటలు వేచి చూడాలి. ఉక్కు నగరంలో ఉక్కు పిడికిలితో బరిలోకి దిగేందుకు రోహిత్‌ సేన, పెరీరా బృందం ‘సై అంటే సై’ అంటున్నాయి. ఇరు జట్ల బ్యాట్స్‌మెన్‌ ఫామ్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర రెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో జరిగే ఈ డేనైట్‌ మ్యాచ్‌ హోరాహోరీగా సాగే అవకాశముంది. 

వైజాగ్‌ ఫేవరెట్‌ భారత్‌... 
విశాఖపట్నంలో క్రికెట్‌ మ్యాచ్‌ అంటే ఠక్కున గుర్తొచ్చేది ధోనినే. ఇక్కడికి ఓ అనామకుడిగా వచ్చి అసాధారణ కెప్టెన్‌గా ఎదిగిన వైనం మనకందరికీ తెలుసు. ‘ఈ చరిత్ర ఏ సిరాతో’ అన్నట్లు ‘అతని భవిత ఈ వేదికతో’ మారిపోయింది. అంతేకాదు అతనితో పాటు చాలా మంది ఆటగాళ్లకు అచ్చొచ్చిన స్టేడియం ఇది. పైగా టీమిండియాకు ఫేవరెట్‌ వేదిక కూడా. ఇక్కడ ఏడు మ్యాచ్‌లాడిన భారత్‌ ఐదింట గెలిచి, ఒక్కసారే ఓడింది. మరో మ్యాచ్‌ రద్దయింది. దీంతో ఇక్కడ జరిగే నిర్ణాయక మూడో మ్యాచ్‌లో తమ ‘ఫేవరెట్‌ ఇజం’తో లంకను ఓడించి సిరీస్‌ను గెలవాలని భావిస్తోంది టీమిండియా. రెండేళ్లుగా సొంతగడ్డపై భారత్‌ రికార్డు అజేయంగా ఉంది. 2015 అక్టోబర్‌ తర్వాత భారత్‌ ఒక్క సిరీస్‌ను కోల్పోలేదు. అన్నీ  చేజిక్కించుకుంది. 

ఫామ్‌లోకి వచ్చిన బ్యాట్స్‌మెన్‌... 
తొలి మ్యాచ్‌లో ఒక్క ధోని మినహా మూకుమ్మడిగా విఫలమైన టీమిండియా బ్యాట్స్‌మెన్‌ మొహలీలో కదంతొక్కారు. కెప్టెన్, ఓపెనర్‌ రోహిత్, మరో ఓపెనింగ్‌ బ్యాట్స్‌మన్‌ ధావన్, కొత్త కుర్రాడు శ్రేయస్‌ అయ్యర్‌ పిచ్‌ పరిస్థితుల్ని చక్కగా ఆకలింపు చేసుకొని చెలరేగారు. టాపార్డర్‌ అంతా ఫామ్‌లోకి రావడంతో భారత్‌ ఇక్కడ కూడా మరో భారీ స్కోరును ఆశిస్తోంది. రెండో వన్డేలో ధోని, పాండ్యా ఇన్నింగ్స్‌ చివర్లో తక్కువ పరుగులకే నిష్క్రమించినా... అదేమంతా కలవరపెట్టే అంశం కాదు. ఇన్నింగ్స్‌ను నడిపించాల్సిన సమయంలో ధోని ఎంత చురుగ్గా వ్యవహరిస్తాడో అందరికీ తెలుసు. ఇక బౌలింగ్‌లో భువీ, బుమ్రా తమ సత్తాను పూర్తిస్థాయిలో బయటపెట్టలేదు. ఒకట్రెండు వికెట్లు తీసినప్పటికీ కీలకమైన నిర్ణాయక పోరులో ఇదే మాత్రం సరిపోదు. ఆరంభంలో, డెత్‌ ఓవర్లలో తమ జోరు చాటితే మిగతా పనిని చహల్, హార్దిక్‌ పాండ్యాలు చూసుకుంటారు.  

పరంపరకు బ్రేక్‌ వేయాలని లంక... 
స్వదేశంలో భారత్‌ ఎదురులేని సిరీస్‌ విజయాలతో సాగుతుంటే... మరోవైపు లంక మాత్రం తమ సుదీర్ఘ పరాజయాల పరంపరకు బ్రేక్‌ వేయాలనే పట్టుదలతో ఉంది. వరుసగా ఎనిమిది సిరీస్‌లను కోల్పోయిన లంక ఒకదాన్ని మాత్రంగా ‘డ్రా’ చేసుకోగలిగింది. అయితే ఇక్కడ ధర్మశాల ఇచ్చిన కిక్‌ సిరీస్‌పై ఆశల్ని పెంచింది. మొహాలీలో ఓడినా... మరీ భారత్‌ (తొలి వన్డేలో) అంత చిత్తుగా మాత్రం కంగుతినలేదు. టాపార్డర్‌ పడుతూ లేస్తూ సాగుతున్నప్పటికీ... ఆల్‌రౌండర్‌ మాథ్యూస్‌ అండతో మిడిలార్డర్‌ పటిష్టంగా ఉంది. గత మ్యాచ్‌లో అజేయ సెంచరీ సాధించిన అతను తొడ కండరాల గాయం నుంచి పూర్తిగా కోలుకోవడం శ్రీలంకకు శుభపరిణామం. అనుభవజ్ఞుడైన తరంగ భారీ ఇన్నింగ్స్‌ను రుచిచూపించలేదు. తిరిమన్నె, గుణతిలక, డిక్‌వెలాలు ఇంకా మెరుగైన ఆటతీరును కనబర్చలేదు. కీలకమైన ఈ మ్యాచ్‌లో వీరంతా సమష్టిగా రాణిస్తే పోరాడే స్కోరును ప్రత్యర్థి ముందు ఉంచవచ్చు. బౌలింగ్‌లో లంక బాగున్నప్పటికీ రో‘హిట్స్‌’తో మొహాలీలో గతి తప్పింది. దీంతో ఒక్క మాథ్యూస్‌ మినహా లక్మల్, ప్రదీప్, ధనంజయ, సచిత్‌లంతా బాధితులయ్యారు. కెప్టెన్‌ పెరీరా పరుగులిచ్చినా 3 వికెట్లు తీశాడు. మొత్తానికి ధర్మశాల స్ఫూర్తితో బరిలోకి దిగాలని లంక టీమ్‌ భావిస్తోంది. 

పిచ్, వాతావరణం 
ఎపుడైనా సరే విశాఖ పిచ్‌ బ్యాట్స్‌మెన్, బౌలర్లకు సమాన అవకాశాలిస్తుంది. బౌలింగ్‌లో పేసర్లు, స్పిన్నర్లకు ఇది మంచి వికెట్‌. ధర్మశాల, మొహాలీలతో పోల్చుకుంటే ఇది కోస్తా ప్రాంతం కాబట్టి శ్రీలంకకు కొలంబోను తలపించవచ్చు. వర్షం ముప్పు లేదు.

జట్లు (అంచనా)
భారత్‌: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), ధావన్, శ్రేయస్‌ అయ్యర్, దినేశ్‌ కార్తీక్, మనీశ్‌ పాండే, ధోని, హార్దిక్‌ పాండ్యా, భువనేశ్వర్, బుమ్రా, చహల్, కుల్దీప్‌/సుందర్‌. 
శ్రీలంక: తిసారా పెరీరా (కెప్టెన్‌), గుణతిలక, తరంగా, సమరవిక్రమ, మాథ్యూస్, డిక్‌వెలా, గుణరత్నే, సచిత్, లక్మల్, అకిల ధనంజయ, నువాన్‌ ప్రదీప్‌. 

► మధ్యాహ్నం 1.30 గంటల నుంచి  స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం   

మరిన్ని వార్తలు