న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు భారత జట్టు ప్రకటన

4 Feb, 2020 12:01 IST|Sakshi

న్యూఢిల్లీ : న్యూజిలాండ్‌తో రెండు టెస్టుల సిరీస్‌కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. కాలికి గాయం కారణంగా టీమిండియా స్టార్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ న్యూజిలాండ్‌ పర్యటన నుంచి తప్పుకోవడంతో యువ బ్యాట్స్‌మెన్‌ శుబ్‌మన్‌ గిల్‌కు భారత జట్టులో చోటు దక్కింది. వన్డే జట్టులోకి ఎంపికైన మయాంక్‌ అగర్వాల్‌, పృథ్వీషాకు.. టెస్టు సిరీస్‌లోనూ అవకాశం కల్పించారు. యువ పేసర్‌ నవదీప్‌ సైని కూడా టెస్టు జట్టులోకి ఎంపికయ్యాడు. 

అయితే న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో మంచి ఆటతీరు ప్రదర్శించిన కేఎల్ రాహుల్‌కు మాత్రం బీసీసీఐ షాకిచ్చింది. న్యూజిలాండ్‌తో చివరి టీ20లో రాణించిన రాహుల్‌కు సెలక్టర్లు టెస్టు జట్టులో చోటు కల్పించలేదు. జట్టులో వికెట్‌ కీపర్‌గా ఉన్న రిషభ్‌ పంత్‌ తన స్థానాన్ని కాపాడుకున్నారు. టెస్ట్‌ జట్టులో ఇషాంత్‌ శర్మ పేరు కూడా చేర్చినప్పటికీ.. అతను ఫిట్‌నెస్‌ పరీక్షను ఎదుర్కొవాల్సి ఉంది. ఇప్పటికే న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ను 5-0 క్లీన్‌స్వీప్‌ చేసిన ఉత్సాహంలో ఉన్న టీమిండియా.. రేపటి నుంచి జరగనున్న మూడు వన్డేల సిరీస్‌లో సత్తా చాటేందుకు సిద్దమవుతోంది.

భారత జట్టు : విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), మయాంక్‌ అగర్వాల్‌, పృథ్వీ షా, శుబ్‌మన్‌ గిల్‌, ఛటేశ్వర్ పూజారా, అజింక్యా రహానే(వైస్‌ కెప్టెన్‌), హనుమ విహారి, వృద్ధిమాన్‌ సాహా(వికెట్‌ కీపర్‌), రిషభ్‌ పంత్‌(వికెట్‌ కీపర్‌), అశ్విన్‌, రవీంద్ర జడేజా, జస్ప్రీత్‌ బుమ్రా, ఉమేష్‌ యాదవ్‌, మహమ్మద్‌ షమీ, నవదీప్‌ సైనీ, ఇషాంత్‌ శర్మ(ఫిట్‌నెస్‌ పరీక్ష ఎదుర్కొవాల్సి ఉంది).

మరిన్ని వార్తలు