విజయమే  సమంజసం

27 Feb, 2019 01:12 IST|Sakshi

నేడు బెంగళూరులో రెండో టి20

ఓడితే సిరీస్‌ కోల్పోయే ప్రమాదంలో టీమిండియా

తుది జట్టులో మూడు మార్పులతో బరిలోకి!

ఆత్మవిశ్వాసంతో ఆస్ట్రేలియా

2008లో జరిగిన ఏకైక మ్యాచ్‌లో పరాజయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా చూస్తే... టి20 ఫార్మాట్‌లో టీమిండియా ఒక్కసారి కూడా ఆస్ట్రేలియాకు సిరీస్‌ను కోల్పోలేదు. రెండు లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌ల సిరీస్‌లను గెల్చుకోవడమో లేదా సమంగా ముగించడమో చేసింది. కానీ, ఇప్పుడు సొంతగడ్డపై ఓటమి ముప్పు పొంచి ఉంది. దీనిని తప్పించుకోవాలంటే... తప్పక గెలవాల్సిన పరిస్థితుల్లో కోహ్లి సేన బెంగళూరులో అమీతుమీకి సిద్ధమవుతోంది. అజేయ రికార్డును నిలబెట్టుకోవాలన్నా, అపజయ శకునాలు లేకుండా ప్రపంచ కప్‌నకు సిద్ధమవ్వాలన్నా చిన్నస్వామి స్టేడియంలో భారత్‌ పెద్ద ప్రయత్నమే చేయాల్సి ఉంటుంది. మరి ఇందులో ఎంతవరకు సఫలమవుతారో వేచి చూడాలి.  

బెంగళూరు: బ్యాటింగ్‌లో విఫలమై బౌలింగ్‌లో అనూహ్యంగా పుంజుకున్నా, విశాఖపట్నంలో జరిగిన తొలి టి20ని త్రుటిలో ఆస్ట్రేలియాకు చేజార్చుకుంది టీమిండియా. దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 0–1తో వెనుకబడి ఆత్మరక్షణలో పడింది. పొట్టి ఫార్మాట్‌లో తొలిసారిగా, అందులోనూ స్వదేశంలో ఆసీస్‌కు సిరీస్‌ను కోల్పోయారన్న విమర్శలను తప్పించుకోవాల్సిన పరిస్థితుల్లో చిక్కుకుంది. దీంతో బుధవారం బెంగళూరులో జరుగనున్న రెండో మ్యాచ్‌ను కోహ్లి సేన తీవ్రంగా తీసుకోనుంది. మరోవైపు ఇన్నాళ్లూ కొంత బలహీనంగా ఉన్న టి20ల్లో కంగారూలు క్రమంగా మెరుగవుతూ వస్తున్నారు. ఒత్తిడిని తట్టుకుని విశాఖలో సాధించిన విజయంతో ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. దీనికితోడు భారత్‌పై ‘తొలిసారి’ టి20 సిరీస్‌ గెలుపు వారిని ఉత్సాహపరుస్తోంది. ఇరు జట్లకూ ప్రతిష్ఠాత్మకమైన నేపథ్యంలో చిన్నస్వామి మైదానంలో జరిగే ఈ మ్యాచ్‌ అభిమానులకు వినోదం పంచడం ఖాయంగా కనిపిస్తోంది. 

మార్పులు ఎన్ని? 
తొలి టి20లో రెగ్యులర్‌ ఓపెనర్‌ ధావన్‌ను తప్పించిన భారత జట్టు మేనేజ్‌మెంట్‌... ఈసారి వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు విశ్రాంతినిచ్చే యోచనలో ఉంది. వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ రిషభ్‌ పంత్, పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌ స్థానాల్లో  ఆల్‌రౌండర్‌ విజయ్‌ శంకర్, పేసర్‌ సిద్థార్థ్‌ కౌల్‌ను తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఎంత టి20 అయినా తుది జట్టులో ఒకేసారి మూడు మార్పులు చేస్తారా? అనేది అనుమానం. ఓపెనర్ల రొటేషన్, ఒత్తిడి తగ్గించడం అనే కోణంలో ఆలోచిస్తే రోహిత్‌ స్థానంలో ధావన్‌ రావొచ్చు. బౌలింగ్‌లో మరో ప్రత్యామ్నాయం కావాలని భావిస్తే శంకర్‌కు చోటు దక్కుతుంది. విశాఖలో ఉమేశ్‌ చివరి ఓవర్‌ వైఫల్యం కౌల్‌ను ఎంచుకునేలా చేస్తోంది. మరోవైపు పునరాగమనంలో రాహుల్‌ ఆకట్టుకున్నాడు. సొంత నగరంలో మరింత చెలరేగితే అతడితో పాటు జట్టుకూ మేలు. పంత్‌ లేకుంటే దినేశ్‌ కార్తీక్‌పై మరింత భారం పడుతుంది. వన్డే జట్టులో స్థానం కోల్పోయిన అతడు పొట్టి ఫార్మాట్‌లోనూ వేటు పడకుండా ఉండాలంటే కచ్చితంగా రాణించాలి. కెప్టెన్‌ కోహ్లి తనదైన ఇన్నింగ్స్‌ ఆడాల్సిన అవసరం ఉంది. నెమ్మదైన పిచ్‌ను ఓ కారణంగా చెప్పుకొన్నా, చివరి వరకు క్రీజులో ఉన్నప్పటికీ వెటరన్‌ ధోని విశాఖలో పరుగులు సాధించలేకపోవడం విమర్శలకు తావిచ్చింది. బెంగళూరులో వాటికి సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. వీరంతా పుంజుకుని భారీ స్కోర్లు చేస్తే కంగారూలకు కష్టాలు తప్పవు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బుమ్రా పేస్‌ను ఎదుర్కొనడం ఎంత కష్టమో ఆసీస్‌కు తొలి మ్యాచ్‌లో తెలిసొచ్చింది. ముఖ్యంగా అతడి యార్కర్ల పదునేంటో 19వ ఓవర్లో వేసిన బంతి చెబుతోంది. అంచనాలు నిలబెట్టుకుంటే కౌల్‌ స్థిరమైన కెరీర్‌కు బాటలు పడతాయి. స్పిన్‌ త్రయంలో కృనాల్‌ పాండ్యా తన పాత్రను సమర్థంగా పోషిస్తున్నాడు. కొత్త కుర్రాడు మయాంక్‌ మార్కండే మాయాజాలం అంతర్జాతీయ స్థాయికి చాటాలి. వీరిద్దరితో పోలిస్తే చహల్‌ కొంత వెనుకంజలో ఉన్నట్లే. ప్రత్యర్థులు అతడి బౌలింగ్‌ను చదివేసినట్లు కనిపిస్తోంది. చహల్‌ మేల్కొనాల్సిన సమయం వచ్చింది. 

ఆసీస్‌... అలాగే(నా)! 
చివరి ఓవర్‌లో అయినప్పటికీ తొలి మ్యాచ్‌ విజయం ఆస్ట్రేలియాకు ఊరటనిచ్చి ఉంటుంది. ముఖ్యంగా మ్యాక్స్‌వెల్‌ మెరుపులు, పేసర్ల పొదుపైన బౌలింగ్‌ ఆకట్టుకుంది. అయితే, బెంగళూరులో ఆ జట్టు బ్యాటింగ్‌ ఆర్డర్‌ కూర్పులో మార్పులుండొచ్చు. స్టొయినిస్‌లాంటి ఆటగాడిని ఓపెనర్‌గా పంపడంపై పునరాలోచన చేయొచ్చు. కెప్టెన్‌ అరోన్‌ ఫించ్‌ వన్‌డౌన్‌లోనే వస్తాడంటున్నారు. దీంతో టర్నర్‌ను పక్కనపెట్టి ఇన్నింగ్స్‌ను ఆరంభించగల వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ అలెక్స్‌ క్యారీని తీసుకుంటారని భావిస్తున్నారు. తద్వారా హ్యాండ్స్‌కోంబ్‌ను పూర్తిస్థాయి బ్యాట్స్‌మన్‌గా పంపొచ్చు. విశాఖలో పేసర్లు కమిన్స్, బెహ్రెన్‌డార్ఫ్‌ పరుగులు కట్టడి చేయగా, కూల్టర్‌నీల్‌ టీమిండియాను దెబ్బకొట్టాడు. ఏకైక స్పిన్నర్‌గా ఆడమ్‌ జంపానే ఆడించొచ్చు. మొత్తమ్మీద ఒక్క మార్పుతోనే ఆసీస్‌ బరిలోకి దిగుతుందని అంచనా. 

తుది జట్లు (అంచనా)
భారత్‌: రాహుల్, రోహిత్‌/ధావన్, కోహ్లి (కెప్టెన్‌), పంత్‌/విజయ్‌ శంకర్, ధోని, దినేశ్‌ కార్తీక్, కృనాల్, ఉమేశ్‌/సిద్ధార్థ్‌ కౌల్, చహల్, మార్కండే, బుమ్రా. 
ఆస్ట్రేలియా: స్టొయినిస్, షార్ట్, ఫించ్‌ (కెప్టెన్‌), మ్యాక్స్‌వెల్, హ్యాండ్స్‌కోంబ్, టర్నర్, కూల్టర్‌నీల్, కమిన్స్, జే రిచర్డ్‌సన్, బెహ్రెన్‌డార్ఫ్, జంపా.

►రాత్రి 7 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం

పిచ్, వాతావరణం 
చిన్నస్వామి మైదానం పిచ్‌ బ్యాటింగ్‌కు పూర్తి అనుకూలం. వాతావరణం వేడిగా ఉండనుంది. 

>
మరిన్ని వార్తలు