నా సొంత మైదానంలోనే ఆ మ్యాచ్: గంగూలీ

29 Oct, 2019 03:59 IST|Sakshi

డే అండ్‌ నైట్‌ టెస్టు నిర్వహణకు బీసీసీఐ రెడీ

బంగ్లాదేశ్‌ నిర్ణయంపై ఎదురుచూపు

కోల్‌కతాలో ‘గులాబీ’ మ్యాచ్‌!

కోల్‌కతా: డే అండ్‌ నైట్‌ టెస్టుల నిర్వహణపై చాలా కాలంగా తన ఆసక్తిని ప్రదర్శించిన సౌరవ్‌ గంగూలీ ఇప్పుడు బోర్డు అధ్యక్ష హోదాలో దానికి కార్యరూపం ఇచ్చేందుకు సన్నద్ధమయ్యాడు. బీసీసీఐ పగ్గాలు చేపట్టిన తర్వాత పలు మార్లు గులాబీ బంతితో టెస్టు నిర్వహణ గురించి సౌరవ్‌ వ్యాఖ్యానించడంతోనే పరోక్షంగా అతని ఆలోచన అర్థమైంది. ఈ విషయంపై బీసీసీఐ అధికారిక నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్‌తో కోల్‌కతాలో భారత్‌ ఆడే రెండో టెస్టును డే అండ్‌ నైట్‌గా నిర్వహించాలని తాము భావిస్తున్నట్లు బోర్డు ప్రకటించింది. తన సొంత మైదానంలో ఈ మ్యాచ్‌ జరుగుతుందని స్వయంగా దీనిని నిర్ధారించిన సౌరవ్‌... మీ అభిప్రాయం చెప్పాలంటూ బంగ్లాదేశ్‌ బోర్డును కోరాడు. నవంబర్‌ 22 నుంచి 26 వరకు ఈడెన్‌ గార్డెన్స్‌లో ఈ మ్యాచ్‌ జరగనుంది.

‘నేను బంగ్లాదేశ్‌ బోర్డు అధ్యక్షుడు నజ్ముల్‌ హసన్‌తో మాట్లాడాను. వాళ్లు దాదాపుగా అంగీకరించారు. అయితే తమ ఆటగాళ్లతో మాట్లాడాల్సి ఉందని నాతో చెప్పారు. ఇది కచ్చితంగా డే అండ్‌ నైట్‌ మ్యాచ్‌ అవుతుందని నేను నమ్ముతున్నా. వారు వీలైనంత తొందరగా తమ అధికారిక ప్రకటన చేస్తారు. ఒక్కసారి బంగ్లా బోర్డు నుంచి సమాధానం వస్తే మేం టెస్టు నిర్వహణ కోసం ఏర్పాట్లు మొదలు పెడతాం’ అని గంగూలీ వ్యాఖ్యానించాడు. భారత్‌లాగే బంగ్లాదేశ్‌ కూడా ఇప్పటి వరకు ఒక్క డే అండ్‌ నైట్‌ టెస్టు కూడా ఆడలేదు. తమకు గులాబీ బంతితో ఏ మాత్రం అనుభవం లేదనేది ఆ జట్టు ఆటగాళ్ల భావన.

ఒలింపియన్లకు సన్మానం...
కోల్‌కతా టెస్టు సందర్భంగా షూటర్‌ అభినవ్‌ బింద్రా, బాక్సర్‌ మేరీకోమ్, షట్లర్‌ పీవీ సింధు తదితర ఒలింపియన్లను ఘనంగా సన్మానించనున్నట్లు  సౌరవ్‌ వెల్లడించాడు. ఆస్ట్రేలియాలో క్యాన్సర్‌ నిర్మూలన కోసం పని చేస్తున్న జేన్‌ మెక్‌గ్రాత్‌ ఫౌండేషన్‌ కోసం ప్రతీ ఏటా ‘పింక్‌ టెస్టు’ను నిర్వహిస్తారు. అదే తరహాలో ఈడెన్‌ గార్డెన్స్‌ మ్యాచ్‌ కూడా ప్రతీ సంవత్సరం సాగే వేడుక కావాలని తాను కోరుకుంటున్నట్లు మాజీ కెప్టెన్‌ మనసులో మాట చెప్పాడు.

ఫస్ట్‌క్లాస్‌ క్రికెటర్లకు కాంట్రాక్టులు... 
మరోవైపు తొలిసారి ఫస్ట్‌క్లాస్‌ క్రికెటర్లకు కూడా కాంట్రాక్ట్‌ పద్ధతిని ప్రవేశపెట్టనున్నట్లు గంగూలీ ప్రకటించాడు. బోర్డు కొత్త ఫైనాన్స్‌ కమిటీ దీనికి సంబంధించి కార్యాచరణ రూపొందిస్తుందని అతను చెప్పాడు. ప్రస్తుతం భారత దేశవాళీ క్రికెటర్లు ఏడాదికి తాము ఆడే మ్యాచ్‌ల సంఖ్యను బట్టి రూ. 25 లక్షల నుంచి 30 లక్షల వరకు ఆర్జిస్తున్నారు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా