అమ్మాయిలు అదరగొట్టేశారు

25 Feb, 2020 05:24 IST|Sakshi
పూనమ్‌ యాదవ్‌, షఫాలీ వర్మ

మెరిపించిన షఫాలీ

పూనమ్‌ మాయాజాలం

బంగ్లాదేశ్‌పై భారత్‌ విజయం

మహిళల టి20 ప్రపంచకప్‌

డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియాపై శుభారంభం ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో భారత మహిళలు గ్రూప్‌ ‘ఎ’లో టాప్‌ గేర్‌లో దూసుకెళ్తున్నారు. బంగ్లాదేశ్‌తో జరిగిన పోరులో బ్యాటింగ్‌లో షఫాలీ  మెరిపించగా... బౌలింగ్‌లో పూనమ్‌ యాదవ్‌ మళ్లీ ప్రత్యర్థిని తిప్పేసింది. దీంతో భారత అమ్మాయిల జట్టు వరుసగా రెండో మ్యాచ్‌లోనూ విజయం సాధించి సెమీఫైనల్‌ దిశగా అడుగు ముందుకేసింది.

 పెర్త్‌: ఆల్‌రౌండ్‌ ప్రతాపంతో భారత మహిళల జట్టు టి20 ప్రపంచకప్‌లో వరుసగా రెండో విజయాన్ని సాధించింది. సోమవారం హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సేన 18 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. మొదట భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. ఓపెనర్‌ షఫాలీ వర్మ (17 బంతుల్లో 39; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) చెలరేగింది. తర్వాత బంగ్లాదేశ్‌ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 124 పరుగులకే పరిమితమైంది. నిగర్‌ సుల్తానా (26 బంతుల్లో 35; 5 ఫోర్లు) మెరుగ్గా ఆడింది. లెగ్‌ స్పిన్నర్‌ పూనమ్‌ యాదవ్‌ (3/18) మళ్లీ ఆకట్టుకుంది. షఫాలీకి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది. దాంతో షఫాలీ టి20 ప్రపంచకప్‌ చరిత్రలో పిన్న వయస్సులో (16 ఏళ్ల 27 రోజులు)  ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచిన క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. భారత్‌ తమ తదుపరి మ్యాచ్‌లో ఈనెల 27న మెల్‌బోర్న్‌లో న్యూజిలాండ్‌ జట్టుతో ఆడుతుంది.  

షఫాలీ సిక్సర్లు...
భారత టీనేజ్‌ ఓపెనర్‌ షఫాలీ వర్మ సిక్సర్లతో దంచేసింది. దీంతో స్కోరు శరవేగంగా కదిలింది. జ్వరం కారణంగా రెగ్యులర్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన ఈ మ్యాచ్‌కు దూరమైంది. తానియా భాటియా ఓపెనర్‌గా వచ్చినా 2 పరుగులే చేసి అవుటైంది. అయితే షఫాలీ, జెమీమా రోడ్రిగ్స్‌ (37 బంతుల్లో 34; 2 ఫోర్లు, 1 సిక్స్‌)తో కలిసి మెరుపులు మెరిపించింది. భారత్‌ 5.1 ఓవర్లోనే 50 పరుగులను చేరుకుంది. ఆమె అవుటయ్యాక స్కోరు మందగించింది. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ (8), దీప్తి శర్మ (11)లు పెద్దగా స్కోర్లేమీ చేయలేదు. కానీ చివర్లో వేద కృష్ణమూర్తి (11 బంతుల్లో 20 నాటౌట్‌; 4 ఫోర్లు) ధాటిగా ఆడింది. దీంతో ప్రత్యర్థి ముందు సవాల్‌తో కూడిన లక్ష్యాన్ని ఉంచగలిగింది.

క్రమం తప్పని పతనం...
తర్వాత లక్ష్యఛేదనకు దిగిన బంగ్లాదేశ్‌ ఆరంభం నుంచే వికెట్లను పారేసుకుంది. దీంతో ఏ దశలోనూ లక్ష్యంవైపు కన్నెత్తి చూడలేదు. ఓపెనర్‌ ముర్షిదా ఖాతున్‌ (26 బంతుల్లో 30; 4 ఫోర్లు), మిడిలార్డర్‌లో నిగర్‌ సుల్తానా (26 బంతుల్లో 35; 5 ఫోర్లు) మెరుగ్గా ఆడగలిగారు. మిగతా వాళ్లను భారత బౌలర్లు సులభంగానే బోల్తా కొట్టించడంతో క్రమం తప్పకుండా బంగ్లాదేశ్‌ వికెట్లు పతనమయ్యాయి. శిఖా పాండే, హైదరాబాద్‌ అమ్మాయి అరుంధతి రెడ్డి తలా 2 వికెట్లు తీశారు. రాజేశ్వరి గైక్వాడ్‌కు ఒక వికెట్‌ దక్కింది.  సోమవారమే జరిగిన మరో మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో శ్రీలంకపై గెలిచింది.

స్కోరు వివరాలు
భారత్‌ ఇన్నింగ్స్‌: తానియా (స్టంప్డ్‌) నిగర్‌ (బి) సల్మా 2; షఫాలీ వర్మ (సి) షమీమా (బి) పన్నా ఘోష్‌ 39; రోడ్రిగ్స్‌ (రనౌట్‌) 34; హర్మన్‌ప్రీత్‌ (సి) రుమానా (బి) పన్నా ఘోష్‌ 8; దీప్తి శర్మ (రనౌట్‌) 11; రిచా (సి) నహీదా అక్తర్‌ (బి) సల్మా 14; వేద (నాటౌట్‌) 20; శిఖా పాండే (నాటౌట్‌) 7; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 142.

వికెట్ల పతనం: 1–16, 2–53, 3–78, 4–92, 5–111, 6–113.

బౌలింగ్‌: జహనారా 4–0–33–0, సల్మా 4–0–25–2, నహీదా అక్తర్‌ 4–0–34–0, పన్నా ఘోష్‌ 4–0–25–2, రుమానా 2–0–8–0, ఫాహిమా 2–0–16–0.

బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌: షమీమా సుల్తానా (సి) దీప్తి (బి) శిఖా 3; ముర్షిదా (సి) రిచా (బి) అరుంధతి రెడ్డి 30; సంజిదా ఇస్లామ్‌ (సి) తానియా (బి) పూనమ్‌ యాదవ్‌ 10; నిగర్‌ సుల్తానా (సి) అరుంధతి (బి) రాజేశ్వరి 35; ఫర్జానా హక్‌ (సి) తానియా (బి) అరుంధతి రెడ్డి 0; ఫాహిమా (సి) షఫాలీ (బి) పూనమ్‌ యాదవ్‌ 17; జహనార (స్టంప్డ్‌) తానియా (బి) పూనమ్‌ యాదవ్‌ 10; రుమానా (బి) శిఖా 13; సల్మా (నాటౌట్‌) 2; నహీదా (నాటౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 124.

వికెట్ల పతనం: 1–5, 2–44, 3–61, 4–66, 5–94, 6–106, 7–108, 8–121.

బౌలింగ్‌: దీప్తి శర్మ 4–0–32–0, శిఖా పాండే 4–0–14–2, రాజేశ్వరి 4–0–25–1, అరుంధతి 4–0–33–2, పూనమ్‌ 4–0–18–3.
 

మరిన్ని వార్తలు