రెండో టీ20లో భారత్‌ ఘన విజయం

30 Jun, 2018 04:04 IST|Sakshi

చెలరేగిన రాహుల్, రైనా

2–0తో సిరీస్‌ సొంతం

జూలై 3 నుంచి ఇంగ్లండ్‌తో టీమిండియా పోరు  

అగ్రశ్రేణి జట్టుగా తమ స్థాయిని ప్రదర్శిస్తూ భారత జట్టు అలవోకగా ఐర్లాండ్‌ ఆట కట్టించింది. తొలి మ్యాచ్‌లో సునాయాసంగా నెగ్గిన కోహ్లి సేన రెండో మ్యాచ్‌లో ఆమాత్రం కూడా కష్టపడాల్సిన అవసరం లేకపోయింది. ఏ విభాగంలోనూ సరితూగలేని ఐర్లాండ్‌కు ఎలాంటి సంచలనానికి అవకాశం ఇవ్వకుండా రికార్డు విజయంతో టీమిండియా టి20 సిరీస్‌ను ఏకపక్షంగా ముగించింది. ముందుగా రాహుల్, రైనా దూకుడుతో బ్యాటింగ్‌లో భారీ స్కోరుతో కదం తొక్కి... ఆ తర్వాత బౌలింగ్‌లో చెలరేగింది. ఐర్లాండ్‌తో ‘సన్నాహకం’ ముగిసిన తర్వాత మంగళవారం నుంచి ఇంగ్లండ్‌ సవాల్‌ను ఎదుర్కొనేందుకు భారత్‌ సిద్ధమైంది. 
 
డబ్లిన్‌: ఐర్లాండ్‌తో జరిగిన రెండు టి20 మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్‌ 2–0తో కైవసం చేసుకుంది. శుక్రవారం ఇక్కడ జరిగిన రెండో టి20లో భారత్‌ 143 పరుగుల భారీ తేడాతో ఐర్లాండ్‌ను చిత్తుగా ఓడించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. కేఎల్‌ రాహుల్‌ (36 బంతుల్లో 70; 3 ఫోర్లు, 6 సిక్సర్లు), సురేశ్‌ రైనా (45 బంతుల్లో 69; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీలతో కదం తొక్కారు. వీరిద్దరు రెండో వికెట్‌కు 57 బంతుల్లోనే 106 పరుగులు జోడించగా, చివర్లో హార్దిక్‌ పాండ్యా (9 బంతుల్లో 32 నాటౌట్‌; 1 ఫోర్, 4 సిక్సర్లు) మెరుపు ప్రదర్శన కనబర్చాడు. అనంతరం ఐర్లాండ్‌ 12.3 ఓవర్లలో 70 పరుగులకే కుప్పకూలింది. విల్సన్‌ (15) టాప్‌ స్కోరర్‌. భారత బౌలర్లలో మరోసారి కుల్దీప్‌ (3/16), చహల్‌ (3/21) ప్రత్యర్థిని పడగొట్టారు.  

సెంచరీ భాగస్వామ్యం...
భారత జట్టు అనుకున్నట్లుగానే నాలుగు మార్పులతో బరిలోకి దిగింది. ధావన్, ధోని, భువనేశ్వర్, బుమ్రా స్థానాల్లో రాహు ల్, దినేశ్‌ కార్తీక్, ఉమేశ్‌ యాదవ్, సిద్ధార్థ్‌ కౌల్‌ జట్టులోకి వచ్చారు. ఈ మ్యాచ్‌తో అరంగేట్రం చేసిన కౌల్‌ భారత్‌ తరఫున టి20ల్లో ఆడిన 75వ ఆటగాడిగా నిలిచాడు. రోహిత్‌ను కాదని రాహుల్‌తో పాటు ఓపెనర్‌గా బరిలోకి దిగిన కోహ్లి (9) వరుసగా రెండో మ్యాచ్‌లోనూ విఫలమయ్యాడు. అయితే రాహుల్, రైనా కలిసి ఐర్లాండ్‌ను ఆడుకున్నారు. ఐపీఎల్‌ ఫామ్‌ను కొనసాగిస్తూ రాహుల్‌ సిక్సర్లతో చెలరేగగా, రైనా కూడా తనదైన శైలిలో జోరుగా ఆడాడు.

సిమీ సింగ్‌ ఓవర్లో వరుసగా 6, 6, 4 కొట్టిన రాహుల్, ఆ తర్వాత రాన్‌కిన్‌ ఓవర్లో మరో రెండు భారీ సిక్సర్లతో 28 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే కెవిన్‌ ఓబ్రైన్‌ తన తొలి బంతికే రాహుల్‌ను అవుట్‌ చేయడంతో సెంచరీ భాగస్వామ్యం ముగిసింది. మరో రెండు బంతులకే రోహిత్‌ (0) కూడా ఔటయ్యాడు. అనంతరం 34 బంతుల్లో రైనా హాఫ్‌ సెంచరీ మార్క్‌ ను అందుకున్నాడు. రైనాను కూడా ఓబ్రైన్‌ వెనక్కి పంపించిన తర్వాత వచ్చిన మనీశ్‌ పాండే (20 బంతుల్లో 21 నాటౌట్‌; 1 ఫోర్‌) దూకుడుగా ఆడలేకపోయాడు. అయి తే హార్దిక్‌ మెరుపు ఇన్నింగ్స్‌ భారత్‌కు భారీ స్కోరు అందించింది. ఆఖరి ఓవర్లో పాండ్యా వరుస బంతుల్లో 6, 6, 4 బాదడంతో మొత్తం 21 పరుగులు వచ్చాయి.  

వరుస కట్టి...
భారీ లక్ష్య ఛేదనలో ఐర్లాండ్‌ కనీస స్థాయి పోరాటాన్ని కూడా ప్రదర్శించలేకపోయింది. రెండో బంతికే స్టిర్లింగ్‌ (0)ను అవుట్‌ చేయడంతో మొదలైన పతనం చివరి వరకు కొనసాగింది. తొలి మ్యాచ్‌లోనైనా కాస్త చెప్పుకోదగ్గ ఆటతీరు కనబర్చిన జట్టు ఈ సారి పూర్తిగా చేతులెత్తేసింది.  

స్కోరు వివరాలు

భారత్‌ ఇన్నింగ్స్‌: రాహుల్‌ (సి అండ్‌ బి) కెవిన్‌ ఓబ్రైన్‌ 70; కోహ్లి (సి) డాక్‌రెల్‌ (బి) ఛేజ్‌ 9; రైనా (సి) డాక్‌రెల్‌ (బి) కెవిన్‌ ఓబ్రైన్‌ 69; రోహిత్‌ (సి) స్టిర్లింగ్‌ (బి) కెవిన్‌ ఓబ్రైన్‌ 0; మనీశ్‌ పాండే (నాటౌట్‌) 21; పాండ్యా (నాటౌట్‌) 32; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 213.  

వికెట్ల పతనం: 1–22; 2–128; 3–128; 4–169. బౌలింగ్‌: సిమీ సింగ్‌ 2–0 –32–0; రాన్‌కిన్‌ 3–0–33–0; ఛేజ్‌ 4–0–42–1; థాంప్సన్‌ 1–0–17–0; డాక్‌రెల్‌ 4–0–30–0; స్టిర్లింగ్‌ 2–0–19–0; కెవిన్‌ ఓబ్రైన్‌ 4–0–40–3.  

ఐర్లాండ్‌ ఇన్నింగ్స్‌: స్టిర్లింగ్‌ (సి) రైనా (బి) ఉమేశ్‌ 0; షెనాన్‌ (సి) రాహుల్‌ (బి) కౌల్‌ 2; పోర్టర్‌ఫీల్డ్‌ (బి) ఉమేశ్‌ 14; బల్బిర్నీ (బి) చహల్‌ 9; విల్సన్‌ (బి) కుల్దీప్‌ 15; కెవిన్‌ ఓబ్రైన్‌ (సి) కుల్దీప్‌ (బి) పాండ్యా 0; సిమీ  సింగ్‌ (ఎల్బీ) (బి) చహల్‌ 0; థాంప్సన్‌ (బి) చహల్‌ 13; డాక్‌రెల్‌ (సి) ఉమేశ్‌ (బి) కుల్దీప్‌ 4; రాన్‌కిన్‌ (స్టంప్డ్‌) కార్తీక్‌ (బి) కుల్దీప్‌ 10; ఛేజ్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (12.3 ఓవర్లలో ఆలౌట్‌) 70.

వికెట్ల పతనం: 1–0; 2–16; 3–22; 4–30; 5–32; 6–36; 7–44; 8–56; 9–68; 10–70.  

బౌలింగ్‌: ఉమేశ్‌ యాదవ్‌ 2–0–19–2; సిద్ధార్థ్‌ కౌల్‌ 2–0–4–1; హార్దిక్‌ పాండ్యా 2–0–10–1; చహల్‌ 4–0–21–3; కుల్దీప్‌ 2.3–0–16–3.  
► టి20ల్లో భారత్‌కు ఇదే అతి పెద్ద విజయం. గతంలో శ్రీలంకపై (2017లో) 93 పరుగుల విజయాన్ని భారత్‌ సవరించింది.


                                           డ్రింక్స్‌ తీసుకెళ్తున్న ధోని


         అరంగేట్రం చేసిన బౌలర్‌ సిద్ధార్థ్‌ కౌల్‌తో బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌

మరిన్ని వార్తలు