సెమీస్‌కు సునాయాసంగా

16 Nov, 2018 01:23 IST|Sakshi

భారత మహిళల జట్టు  హ్యాట్రిక్‌ విజయం

ఐర్లాండ్‌పై 52 పరుగులతో గెలుపు

మిథాలీ రాజ్‌ అర్ధ సెంచరీ

రాణించిన రాధ, దీప్తి శర్మ

ప్రత్యర్థి బౌలింగ్‌ నుంచి ప్రతిఘటన  ఎదురైనా... బ్యాటింగ్‌లో మోస్తరు స్కోరే చేయగలిగినా... పట్టు విడవని భారత అమ్మాయిలు విజయాన్ని ఒడిసిపట్టారు. టి20 ప్రపంచ కప్‌లో ఐర్లాండ్‌ను ఓడించి సెమీఫైనల్స్‌ చేరారు. హైదరాబాదీ మిథాలీ రాజ్‌ స్థిరమైన ఇన్నింగ్స్‌కు... రాధ యాదవ్, దీప్తి శర్మ, పూనమ్‌ యాదవ్‌ స్పిన్‌ మాయ తోడవడంతో టీమిండియా గెలుపు సునాయాసమైంది.  

ప్రావిడెన్స్‌: భారత అమ్మాయిలు అంచనాలను అందుకున్నారు. హ్యాట్రిక్‌ విజయంతో అదరగొట్టారు. గ్రూప్‌ ‘బి’లో భాగంగా గురువారం రాత్రి ఐర్లాండ్‌తో ఇక్కడ జరిగిన మూడో లీగ్‌ మ్యాచ్‌లో 52 పరుగుల తేడాతో గెలుపొందిన టీమిండియా ప్రపంచకప్‌ సెమీస్‌లో అడుగుపెట్టింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌ దిగిన భారత జట్టు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ మిథాలీ రాజ్‌ (56 బంతుల్లో 51; 4 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ శతకానికి తోడు స్మృతి మంధాన (29 బంతుల్లో 33; 4 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించింది. కింబర్లీ గార్త్‌ (2/22) కట్టడి చేసింది. ఛేదనలో రాధ యాదవ్‌ (3/25), దీప్తి శర్మ (2/15) పొదుపైన బౌలింగ్‌తో ఐర్లాండ్‌ 8 వికెట్లు కోల్పోయి 93 పరుగులే చేయగలిగింది. ఇసొబెల్‌ జాయ్సే (33) టాప్‌ స్కోరర్‌. శనివారం జరిగే చివరి లీగ్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో భారత్‌ తలపడుతుంది.  

మిథాలీ అర్ధశతకం... 
తొలి వికెట్‌కు 67 పరుగులు జోడించి భారత ఇన్నింగ్స్‌కు మిథాలీ, స్మృతి శుభారంభం అందించారు. పెద్దగా మెరుపుల్లేకున్నా సమయోచితంగా ఆడారు. మళ్లీ భారీ స్కోరు ఖాయం అనుకుంటున్న దశలో స్మృతిని బౌల్డ్‌ చేసి గార్త్‌ ఈ భాగస్వామ్యాన్ని విడదీసింది. దూకుడు చూపిన జెమీమా రోడ్రిగ్స్‌ (11 బంతుల్లో 18; 3 ఫోర్లు) మిథాలీకి అండగా నిలిచింది. రెండో వికెట్‌కు వీరిద్దరూ 40 పరుగులు జత చేశారు. అప్పటికి ఐదు ఓవర్లపైనే ఆట ఉండటం... కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (7) బ్యాటింగ్‌కు రావడంతో టీమిండియా మరోసారి పెద్ద లక్ష్యాన్ని విధించేలా కనిపించింది. అయితే, రిచర్డ్‌సన్‌ బౌలింగ్‌లో సిక్స్‌ కొట్టిన కౌర్‌ అదే ఊపు కొనసాగించబోయి అవుటైంది. వేదా కృష్ణమూర్తి (9) త్వరగానే వెనుదిరిగింది. అర్ధ శతకం (54 బంతుల్లో) అందుకున్న మరుసటి ఓవర్లోనే మిథాలీ పెవిలియన్‌ చేరడంతో ఇన్నింగ్స్‌ వేగం తగ్గింది. ఛేదనలో ఐర్లాండ్‌ ఓపెనర్‌ క్లారా షిల్లింగ్టన్‌ (23) జాగ్రత్తగా ఆడింది. దీంతో ఆ జట్టు ఐదు ఓవర్ల పాటు వికెట్‌ కోల్పోలేదు. భారత పేసర్‌ మాన్సి జోషి పొదుపుగా బంతులేయగా మరో ఓపెనర్‌ గాబి లూయీస్‌ (9)ను చక్కటి బంతితో దీప్తిశర్మ బోల్తా కొట్టించింది. రన్‌రేట్‌ ఒత్తిడిలో ముందుకొచ్చి ఆడబోయి తొలుత షిల్లింగ్టన్, అనంతరం కెప్టెన్‌ డెలానీ (9) స్టంపౌటయ్యారు. జాయ్సే బ్యాట్‌ ఝళిపించినా అప్పటికే మ్యాచ్‌ చేజారింది. 

మరిన్ని వార్తలు