భారత్‌ శుభారంభం

12 Oct, 2017 00:11 IST|Sakshi

జపాన్‌పై 5–1తో విజయం

ఆసియా కప్‌ హాకీ టోర్నీ

ఢాకా: కొత్త కోచ్‌ ఆధ్వర్యంలో బరిలోకి దిగిన తొలి టోర్నమెంట్‌లో భారత సీనియర్‌ పురుషుల హాకీ జట్టు ఆకట్టుకునే ప్రదర్శన చేసింది. ఆసియా కప్‌ టోర్నమెంట్‌లో టైటిల్‌ ఫేవరెట్‌ హోదాకు తగ్గట్టు ఆడుతూ భారత్‌ శుభారంభం చేసింది. జపాన్‌తో బుధవారం జరిగిన పూల్‌ ‘ఎ’ లీగ్‌ మ్యాచ్‌లో టీమిండియా 5–1 గోల్స్‌ తేడాతో ఘనవిజయం సాధించింది. ఆద్యంతం ఆధిపత్యం కనబరిచిన భారత్‌ నాలుగు క్వార్టర్స్‌లోనూ గోల్స్‌ చేయడం విశేషం. ఆట మూడో నిమిషంలో ఎస్‌వీ సునీల్‌ చేసిన గోల్‌తో ఖాతా తెరిచిన భారత్‌కు 22వ నిమిషంలో లలిత్‌ ఉపాధ్యాయ్‌ రెండో గోల్‌ను అందించాడు. 33వ నిమిషంలో రమణ్‌దీప్‌ సింగ్‌ ఒక గోల్‌ చేయగా... 35వ, 48వ నిమిషాల్లో హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ రెండు గోల్స్‌ సాధించాడు.

జపాన్‌ తరఫున నమోదైన ఏకైక గోల్‌ను నాలుగో నిమిషంలో కెంజీ కిటజాటో చేశాడు. చీఫ్‌ కోచ్‌ రోలంట్‌ ఓల్ట్‌మన్స్‌పై అనూహ్యంగా వేటు వేయడంతో గత నెలలో మారిన్‌ జోయెర్డ్‌ భారత జట్టు కోచ్‌గా బాధ్యతలు స్వీకరించారు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఆరో స్థానంలో ఉన్న భారత్‌ ఈ మ్యాచ్‌లో ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. మూడో నిమిషంలో ఆకాశ్‌దీప్‌ అందించిన పాస్‌ను సునీల్‌ లక్ష్యానికి చేర్చడంతో భారత్‌ బోణీ చేసింది. మ్యాచ్‌ మొత్తంలో భారత్‌కు ఐదు పెనాల్టీ కార్నర్‌లు రాగా రెండింటిని హర్మన్‌ప్రీత్‌ సద్వినియోగం చేసుకున్నాడు. శుక్రవారం జరిగే తదుపరి మ్యాచ్‌లో ఆతిథ్య బంగ్లాదేశ్‌తో భారత్‌ తలపడుతుంది. తొలి రోజు జరిగిన మరో లీగ్‌ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ 7–0తో బంగ్లాదేశ్‌ను ఓడించింది.   

మరిన్ని వార్తలు