ఓటమి అంచుల నుంచి...

20 Jan, 2020 03:20 IST|Sakshi

షూటౌట్‌లో నెదర్లాండ్స్‌పై భారత్‌ విజయం

ఎఫ్‌ఐహెచ్‌ ప్రొ లీగ్‌ హాకీ

భువనేశ్వర్‌: చివరిదాకా ఆధిక్యంలో ఉండి... ఆ తర్వాత ఆఖరి క్షణాల్లో గోల్స్‌ సమరి్పంచుకొని భారత పురుషుల హాకీ జట్టు మ్యాచ్‌లను చేజార్చుకోవడం చాలాసార్లు జరిగింది. కానీ అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్‌) ప్రొ లీగ్‌లోభాగంగా ప్రపంచ మాజీ చాంపియన్‌ నెదర్లాండ్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు అద్భుతమే చేసింది. ఓటమి అంచుల నుంచి తేరుకొని గెలుపు బాట పట్టింది. శనివారం జరిగిన తొలి లీగ్‌ మ్యాచ్‌లో 5–2తో నెగ్గిన భారత్‌... ఆదివారం జరిగిన రెండో లీగ్‌ మ్యాచ్‌లో ‘షూటౌట్‌’లో 3–1తో నెదర్లాండ్స్‌ను ఓడించింది. నిర్ణీత సమయం వరకు రెండు జట్లు 3–3తో సమంగా నిలిచాయి.

దాంతో విజేతను నిర్ణయించేందుకు షూటౌట్‌ నిర్వహించారు. షూటౌట్‌లో భారత గోల్‌కీపర్‌ శ్రీజేశ్‌ అద్భుత ప్రతిభతో నెదర్లాండ్స్‌ను నిలువరించి భారత విజయాన్ని ఖాయం చేశాడు. అంతకుముందు భారత్‌ ఒకదశలో 1–3తో వెనుకబడింది. అయితే నాలుగు నిమిషాల వ్యవధిలో మన్‌దీప్‌ (51వ ని.లో), రూపిందర్‌ (55వ ని.లో) ఒక్కో గోల్‌ చేసి స్కోరును 3–3తో సమం చేశారు. లలిత్‌ (25వ ని.లో) ఒక గోల్‌ చేశాడు. నెదర్లాండ్స్‌ తరఫున మింక్‌ (24వ ని.లో), జెరోన్‌ (26వ ని.లో), కెలెమన్‌ (27వ ని.లో) ఒక్కో గోల్‌ సాధించారు. ప్రొ లీగ్‌ రెండో రౌండ్‌లో ఫిబ్రవరి 8,9వ తేదీల్లో బెల్జియంతో భారత్‌ ఆడుతుంది.

మరిన్ని వార్తలు