థ్రిల్లర్ 67

8 Nov, 2017 01:01 IST|Sakshi

స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకున్న భారత్‌

8 ఓవర్ల ఉత్కంఠభరిత మ్యాచ్‌ను6 పరుగులతో గెలుచుకున్న టీమిండియా

బుమ్రా, చహల్‌ అద్భుత బౌలింగ్‌

కివీస్‌పై 2–1తో టి20 సిరీస్‌ సొంతం

పవర్‌ ప్లే లెక్కలు లేవు... ఆరంభ ఓవర్లు, డెత్‌ ఓవర్లు అని ప్రత్యేకంగా ఏమీ లేవు... ప్రతీ ఓవర్‌ డెత్‌ ఓవరే, ప్రతీ బంతి ఉత్కంఠను, ఆందోళనను పెంచేదే! భారీ షాట్‌ ఒకటి పడితే ఆ వెంటనే వికెట్‌ కూడా... 48 ప్లస్‌ 48 బంతుల సమరం ఆసక్తికరంగా, హోరాహోరీగా సాగి చివరకు విజయం భారత్‌ పక్షాన నిలిచింది.టి8 మ్యాచ్‌లో విజయంతో సిరీస్‌ సొంతమైందికివీస్‌ చక్కటి బౌలింగ్, ఫీల్డింగ్‌తో భారత్‌ చేసింది 67 పరుగులే!  కానీ ఆ స్కోరును కూడా నిలబెట్టుకోవడంలో కోహ్లి సేన సఫలమైంది. విరామం లేకుండా వికెట్లు తీసి ఒత్తిడి పెంచుతూ ఈ చిట్టి మ్యాచ్‌లోనూ మన జట్టు సత్తా చాటింది. బుమ్రా, చహల్‌ కట్టుదిట్టమైన  బౌలింగ్‌కు తోడు మెరుపు ఫీల్డింగ్‌ కలగలిసి భారత్‌ను మరో సిరీస్‌లో విజేతగా నిలబెట్టాయి.   

తిరువనంతపురం: భారత్, న్యూజిలాండ్‌ టి20 సిరీస్‌కు ఉత్కంఠభరిత ముగింపు లభించింది. భారీ వర్షం కారణంగా 8 ఓవర్లకే పరిమితమైన చివరి టి20 మ్యాచ్‌లో భారత్‌ 6 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. వాన కారణంగా దాదాపు రెండున్నర గంటల పాటు మ్యాచ్‌ ఆలస్యం కావడంతో మ్యాచ్‌ను 8 ఓవర్లకు కుదించారు. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 8 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసింది. మనీశ్‌ పాండే (11 బంతుల్లో 17; 1 ఫోర్, 1 సిక్స్‌) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం న్యూజిలాండ్‌ 8 ఓవర్లలో 6 వికెట్లకు 61 పరుగులు మాత్రమే చేయగలిగింది. గ్రాండ్‌హోమ్‌ (10 బంతుల్లో 17 నాటౌట్‌; 2 సిక్సర్లు) పోరాడే ప్రయత్నం చేశాడు. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ బుమ్రా (2/9)తో పాటు చహల్‌ (0/8) కివీస్‌ను కట్టి పడేశారు. తాజా ఫలితంతో భారత్‌ ఈ సిరీస్‌ను 2–1తో గెలుచుకుంది. బుమ్రాకే ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డు దక్కింది.
 
భారత్‌ ఇన్నింగ్స్‌ సాగిందిలా...
ఓవర్‌ 1 (బౌల్ట్‌–7 పరుగులు): తొలి నాలుగు బంతుల్లో మూడు పరుగులే రాగా, ఐదో బంతిని ధావన్‌ ఫోర్‌ కొట్టాడు.
ఓవర్‌ 2 (సాన్‌ట్నర్‌–7 పరుగులు): నాలుగో బంతికి ఫోర్‌ కొట్టిన రోహిత్, మిగతా బంతులను ఆడలేక ఇబ్బంది పడ్డాడు.
ఓవర్‌ 3 (సౌతీ–4 పరుగులు/2 వికెట్లు): రెండో బంతికి భారీ షాట్‌కు ప్రయత్నించిన ధావన్, సాన్‌ట్నర్‌కు క్యాచ్‌ ఇవ్వగా... తర్వాతి బంతికే రోహిత్‌ కూడా పుల్‌ చేయబోయి డీప్‌ స్క్వేర్‌ లెగ్‌లో సాన్‌ట్నర్‌కే క్యాచ్‌ ఇచ్చాడు. నాలుగు సింగిల్స్‌తో పరుగులు వచ్చాయి.  
ఓవర్‌ 4 (సోధి–13 పరుగులు/ఒక వికెట్‌): తొలి బంతిని ఫోర్‌గా మలచిన కోహ్లి రెండో బంతిని లాంగాన్‌ మీదుగా సిక్సర్‌ కొట్టాడు. అయితే ఐదో బంతికి అదే తరహా షాట్‌ ఆడబోయి డీప్‌ మిడ్‌వికెట్‌లో బౌల్ట్‌ చేతికి చిక్కాడు.  
ఓవర్‌ 5 (సౌతీ–9 పరుగులు): తొలి బంతిని మనీశ్‌ పాండే ఫోర్‌ కొట్టగా, తర్వాతి ఐదు బంతుల్లో మరో ఐదు పరుగులు మాత్రమే లభించాయి.  
ఓవర్‌ 6 (సోధి–10 పరుగులు/ఒక వికెట్‌): మొదటి బంతిని పాండే భారీ సిక్సర్‌ కొట్టగా... నాలుగో బంతికి క్యాచ్‌ ఇచ్చి అయ్యర్‌ వెనుదిరిగాడు.  
ఓవర్‌ 7 (సాన్‌ట్నర్‌–11 పరుగులు): మొదటి నాలుగు బంతులను ఆడటంలో ఇబ్బంది పడ్డ పాండ్యా, ఐదో బంతిని లాంగాన్‌ దిశగా భారీ సిక్స్‌ బాదాడు.
ఓవర్‌ 8 (బౌల్ట్‌–6 పరుగులు/ఒక వికెట్‌): రెండో బంతికి కివీస్‌ అద్భుత ఫీల్డింగ్‌తో భారత్‌ మరో వికెట్‌ కోల్పోయింది. పాండే కొట్టిన షాట్‌ను బౌండరీ వద్ద సాన్‌ట్నర్‌ అందుకునే ప్రయత్నం చేశాడు. అయితే చివరి క్షణంలో తాను నియంత్రణ కోల్పోయే పరిస్థితి ఉండటంతో బంతిని విసిరేయగా పక్కనే ఉన్న గ్రాండ్‌హోమ్‌ దానిని చక్కగా అందుకొని పాండే ఆట ముగించాడు.  
న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌ సాగిందిలా...
ఓవర్‌ 1 (భువనేశ్వర్‌–8 పరుగులు/ఒక వికెట్‌): రెండో బంతిని మున్రో భారీ సిక్సర్‌ బాదాడు. అయితే చివరి బంతికి షాట్‌కు ప్రయత్నించిన గప్టిల్‌ తన ఆఫ్‌స్టంప్‌ను కోల్పోయాడు.
ఓవర్‌ 2 (బుమ్రా–3 పరుగులు/ఒక వికెట్‌): తొలి రెండు బంతులకు పరుగు తీయలేకపోయిన మున్రో మూడో బంతికి భారీ షాట్‌కు ప్రయత్నించగా... మిడాన్‌ వైపు రోహిత్‌ వెనక్కి పరుగెడుతూ అత్యద్భుత క్యాచ్‌ అందుకున్నాడు.
ఓవర్‌ 3 (చహల్‌–5 పరుగులు): చహల్‌ను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడ్డ కివీస్‌ బ్యాట్స్‌మన్‌ భారీ షాట్‌ ఆడటంలో విఫలమయ్యారు.  
ఓవర్‌ 4 (భువనేశ్వర్‌–10 పరుగులు): తొలి మూడు బంతుల్లో రెండు పరుగులే రాగా, తర్వాతి రెండు బంతులను వరుసగా ఫిలిప్స్‌ ఫోర్లు కొట్టాడు.
ఓవర్‌ 5 (కుల్దీప్‌–10 పరుగులు/2 వికెట్లు): ఈ ఓవర్‌ మ్యాచ్‌ను భారత్‌ పక్షాన మార్చేసింది. మూడో బంతికి విలియమ్సన్‌...  తర్వాతి బంతికే ఫిలిప్స్‌ అవుటయ్యారు. అయితే ఆఖరి బంతిని గ్రాండ్‌హోమ్‌ సిక్సర్‌ బాదాడు.
ఓవర్‌ 6 (చహల్‌–3 పరుగులు): కివీస్‌ బ్యాట్స్‌మెన్‌ చహల్‌ బంతులను ఆడలేక మూడు సింగిల్స్‌తోనే సరిపెట్టారు.
ఓవర్‌ 7 (బుమ్రా–10 పరుగులు/2 వికెట్లు): తొలి బంతికే నికోల్స్‌ను బుమ్రా అవుట్‌ చేశాడు. మూడో బంతికి బ్రూస్‌ ఫోర్‌ కొట్టినా... మరో రెండు బంతుల తర్వాత లేని రెండో పరుగు కోసం ప్రయత్నించి అతను రనౌటయ్యాడు.  
ఓవర్‌ 8 (పాండ్యా–12 పరుగులు): మూడో బంతిని గ్రాండ్‌హోమ్‌ భారీ సిక్సర్‌ కొట్టగా, తర్వాతి బంతి వైడ్‌ కావడంతో 3 బంతుల్లో 11 పరుగులు చేయాల్సిన స్థితిలో కివీస్‌లో ఆశలు రేగాయి. అయితే పాండ్యా కట్టుదిట్టంగా బంతులు విసిరి నాలుగు పరుగులు మాత్రమే ఇవ్వడంతో భారత్‌ గెలుపు ఖాయమైంది.  

మరిన్ని వార్తలు