పాక్‌ను ‘శత’కొట్టారు

24 Sep, 2018 04:32 IST|Sakshi
శిఖర్‌ ధావన్‌, రోహిత్‌ శర్మ

దాయాదిపై భారత్‌ మరో భారీ విజయం

9 వికెట్లతో పాకిస్తాన్‌ చిత్తు    ధావన్, రోహిత్‌ సెంచరీలు

ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా

రేపు అఫ్గానిస్తాన్‌తో చివరి సూపర్‌–4 మ్యాచ్‌   

పాకిస్తాన్‌పై గెలుపంటే ఇంత సులువుగా ఉంటుందా అనిపించిన మ్యాచ్‌ ఇది. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఏకపక్షంగా శిక్షించిన పోరు ఇది. ముందుగా చక్కటి బౌలింగ్‌తో తక్కువ స్కోరుకే పరిమితం చేసి ఆపై బ్యాటింగ్‌లో అవధులు లేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ సాధించిన అలవోక విజయం ఇది. ఛేదనలో రోహిత్, ధావన్‌ ఆట చూస్తే వీరిద్దరు కలిసి స్నేహపూర్వక మ్యాచ్‌ ఆడుతున్నట్లే కనిపించింది తప్ప చిరకాల ప్రత్యర్థితో పోటీ పడుతున్నట్లుగా అనిపించలేదు. భారత ఓపెనర్లు పోటీ పడి సెంచరీలు సాధించిన వేళ పాక్‌ బౌలర్లు బేలగా ప్రేక్షకులుగా మారిపోయి బంతులు వేయాల్సిన లాంఛనాన్ని పూర్తి చేయడమే కనిపించింది. సూపర్‌–4లో మరో అలవోక విజయంతో ఆసియా కప్‌ ఫైనల్‌కు అర్హత సాధించిన టీమిండియా ప్రత్యర్థి... మళ్లీ పాకిస్తానా, బంగ్లాదేశా అనేది ఆ రెండు జట్లు తేల్చుకోవాల్సిందే.   

దుబాయ్‌: ఆసియా కప్‌ టోర్నీలో డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌ మళ్లీ ఫైనల్లోకి అడుగు పెట్టింది. తిరుగులేని ప్రదర్శన కనబరుస్తూ ఆదివారం జరిగిన సూపర్‌–4 మ్యాచ్‌లో భారత్‌ 9 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌ను చిత్తుగా ఓడించింది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాక్‌ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. షోయబ్‌ మాలిక్‌ (90 బంతుల్లో 78; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) వరుసగా రెండో అర్ధ సెంచరీ సాధించగా, కెప్టెన్‌ సర్ఫరాజ్‌ (66 బంతుల్లో 44; 2 ఫోర్లు) రాణించాడు. బుమ్రా, కుల్దీప్, చహల్‌ తలా 2 వికెట్లు తీశారు. అనంతరం భారత్‌ 39.3 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 238 పరుగులు చేసి నెగ్గింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ శిఖర్‌ ధావన్‌ (100 బంతుల్లో 114; 16 ఫోర్లు, 2 సిక్సర్లు) కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (119 బంతుల్లో 111 నాటౌట్‌; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) శతకాలతో చెలరేగారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 33.3 ఓవర్లలో 210 పరుగులు జోడించి గెలుపును ఖాయం చేశారు. ప్రాధాన్యత లేని తమ చివరి సూపర్‌–4 మ్యాచ్‌లో భారత్‌ మంగళవారం అఫ్గానిస్తాన్‌తో తలపడుతుంది.  

సెంచరీ భాగస్వామ్యం...
టాస్‌ గెలిచిన పాకిస్తాన్‌ ఫీల్డింగ్‌ ఎంచుకోగా ఓపెనర్లు ఫఖర్‌ జమాన్‌ (44 బంతుల్లో 31; 1 ఫోర్, 1 సిక్స్‌), ఇమామ్‌ ఉల్‌ హఖ్‌ (10) జాగ్రత్తగా ఇన్నింగ్స్‌ను ఆరంభించారు. నాలుగో ఓవర్లో గానీ ఆ జట్టు తొలి బౌండరీ కొట్టలేకపోయింది. ఆ తర్వాత చహల్‌ తన తొలి ఓవర్లోనే ఇమామ్‌ను ఎల్బీగా ఔట్‌ చేసి భారత్‌కు తొలి వికెట్‌ అందించాడు. ముందుగా అంపైర్‌ తిరస్కరించినా, రివ్యూలో భారత్‌ ఫలితం సాధించింది. కొద్దిసేపటికి కుల్దీప్‌ పాక్‌ను దెబ్బ తీశాడు. షాట్‌ ఆడే క్రమంలో పట్టు కోల్పోయిన ఫఖర్‌ వికెట్ల ముందు అడ్డంగా పడిపోగా అంపైర్‌ వెంటనే ఎల్బీడబ్ల్యూగా ప్రకటించాడు. అయితే రీప్లేలో బంతి అతని గ్లవ్‌కు తాకిందని తేలింది. అప్పీల్‌కు వెళితే ఫఖర్‌ బతికిపోయేవాడు! తర్వాతి ఓవర్లోనే సింగిల్‌కు అవకాశం లేని చోట పరుగుకు ప్రయత్నించి బాబర్‌ ఆజమ్‌ (9) రనౌట్‌గా వెనుదిరిగాడు.

ఈ దశలో మాలిక్, సర్ఫరాజ్‌ కలిసి పాక్‌ను ఆదుకున్నారు. మాలిక్‌ 64 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ వెంటనే చక్కటి బంతితో సర్ఫరాజ్‌ను కుల్దీప్‌ పెవిలియన్‌ పంపించడంతో 107 పరుగుల నాలుగో వికెట్‌ భాగస్వామ్యానికి తెర పడింది. అనంతరం భువనేశ్వర్‌ ఓవర్లో పాక్‌ ఏకంగా 22 పరుగులు రాబట్టి దూకుడు ప్రదర్శించింది. ఈ ఓవర్లో మాలిక్‌ ఒక ఫోర్‌ కొట్టగా, ఆసిఫ్‌ అలీ (21 బంతుల్లో 30; 1 ఫోర్, 2 సిక్సర్లు) వరుస బంతుల్లో 6, 4, 6 బాదాడు. అయితే లెగ్‌సైడ్‌ వెళుతున్న బుమ్రా బంతిని ఆడబోయి ధోనికి క్యాచ్‌ ఇవ్వడంతో మాలిక్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. తర్వాతి ఓవర్లోనే ఆసిఫ్‌ను చహల్, షాదాబ్‌ (10)ను బుమ్రా ఔట్‌ చేశారు.    

ఇద్దరూ ఇద్దరే...
సాధారణ లక్ష్య ఛేదనలో భారత ఓపెనర్ల సొగసైన బ్యాటింగ్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే. తొలి రెండు ఓవర్లు మాత్రమే కాస్త జాగ్రత్తగా ఆడినట్లు కనిపించిన ధావన్, రోహిత్‌ ఆ తర్వాత కనువిందైన షాట్లతో చెలరేగిపోయారు. 14 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఆఫ్రిది బౌలింగ్‌లో రోహిత్‌ ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను కవర్స్‌లో ఇమామ్‌ వదిలేయడం కూడా జట్టుకు కలిసొచ్చింది. ఆ తర్వాత మళ్లీ ఎలాంటి అవకాశం ఇవ్వకుండా రోహిత్‌ దూకుడును కొనసాగించాడు. పాకిస్తాన్‌ ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత మంది బౌలర్లను మార్చినా ఫలితం లేకపోయింది. కనీస స్థాయిలో కూడా లేని బౌలింగ్‌కు చెత్త ఫీల్డింగ్‌ కూడా తోడు కావడంతో పాక్‌ నిస్సహాయంగా ఉండిపోయింది. 81 పరుగుల వద్ద మళ్లీ క్యాచ్‌ వదిలేయడంతో రోహిత్‌కు మరో లైఫ్‌ లభించింది. నువ్వా నేనా అని పోటీ పడిన శతక పరుగులో ధావన్‌ ముందంజంలో నిలిచాడు. ఆఫ్రిది బౌలింగ్‌లో ఫోర్‌తో 95 బంతుల్లోనే అతని సెంచరీ పూర్తయింది. ఇక మమ్మల్ని ఔట్‌ చేయడం మీ వల్ల కాదన్నట్లుగా ధావన్‌ రనౌట్‌గా వెనుదిరగడంతో ఈ భారీ భాగస్వామ్యానికి తెర పడింది. ఆ తర్వాత మాలిక్‌ బౌలింగ్‌లో స్క్వేర్‌ లెగ్‌ దిశగా ఆడి రోహిత్‌ తన శతకం పూర్తి చేసుకున్నాడు. రాయుడు (12 నాటౌట్‌)తో కలిసి అతను మరో 10.3 ఓవర్లు మిగిలి ఉండగానే మ్యాచ్‌ను ముగించాడు.

స్కోరు వివరాలు
పాకిస్తాన్‌ ఇన్నింగ్స్‌: ఇమామ్‌ ఉల్‌ హఖ్‌ (ఎల్బీ) (బి) చహల్‌ 10; ఫఖర్‌ జమాన్‌ (ఎల్బీ) (బి) కుల్దీప్‌ 31; బాబర్‌ ఆజమ్‌ (రనౌట్‌) 9; సర్ఫరాజ్‌ (సి) రోహిత్‌ (బి) కుల్దీప్‌ 44; షోయబ్‌ మాలిక్‌ (సి) ధోని (బి) బుమ్రా 78; ఆసిఫ్‌ అలీ (బి) చహల్‌ 30; షాదాబ్‌ ఖాన్‌ (బి) బుమ్రా 10; నవాజ్‌ (నాటౌట్‌) 15; హసన్‌ అలీ (నాటౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 237.
వికెట్ల పతనం: 1–24; 2–55; 3–58; 4–165; 5–203; 6–211; 7–234.  
బౌలింగ్‌: భువనేశ్వర్‌ 9–0–46–0; బుమ్రా 10–1–29–2; చహల్‌ 9–0–46–2; కుల్దీప్‌ 10–0–41–2; జడేజా 9–0–50–0; జాదవ్‌ 3–0–20–0.  
భారత్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ శర్మ (నాటౌట్‌) 111; శిఖర్‌ ధావన్‌ (రనౌట్‌) 114; రాయుడు (నాటౌట్‌) 12; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (39.3 ఓవర్లలో వికెట్‌ నష్టానికి) 238.  
వికెట్ల పతనం: 1–210.  
బౌలింగ్‌: ఆమిర్‌ 5–0–41–0; షాహిన్‌ అఫ్రిది 6–0–42–2; హసన్‌ అలీ 9–0–52–0; నవాజ్‌ 7–0–35–0; షాదాబ్‌ ఖాన్‌ 8–0–54–0; షోయబ్‌ మాలిక్‌ 4.3–0–14–0.   

► ఛేజింగ్‌లో భారత జట్టుకు తొలి వికెట్‌కు అత్యధికంగా 210 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన ఓపెనింగ్‌ జంటగా రోహిత్‌ శర్మ–శిఖర్‌ ధావన్‌ నిలిచారు. గంభీర్‌–సెహ్వాగ్‌ (209 పరుగులు; హామిల్టన్‌లో ► న్యూజిలాండ్‌పై 2009లో) పేరిట ఉన్న రికార్డును రోహిత్‌–ధావన్‌ అధిగమించారు.
► వన్డేల్లో తొలి వికెట్‌కు ఎక్కువసార్లు 100కంటే ఎక్కువ పరుగులు నమోదు చేసిన నాలుగో జోడీగా రోహిత్‌–ధావన్‌ (13 సార్లు) గుర్తింపు పొందారు. తొలి మూడు స్థానాల్లో సచిన్‌–గంగూలీ (21 సార్లు–భారత్‌),  గిల్‌క్రిస్ట్‌–హేడెన్‌ (16 సార్లు–ఆస్ట్రేలియా), గ్రీనిడ్జ్‌–హేన్స్‌ (15 సార్లు–వెస్టిండీస్‌) జోడీలు ఉన్నాయి.  
► పాకిస్తాన్‌పై ఒకే మ్యాచ్‌లో ఇద్దరు భారత బ్యాట్స్‌మెన్‌ సెంచరీలు చేయడం ఇది మూ డోసారి. గతంలో 2006 షార్జాలో సచిన్‌ (118), సిద్ధూ (101); 2005లో కొచ్చిలో సెహ్వాగ్‌ (108), ద్రవిడ్‌ (104) ఈ ఘనత సాధించారు.  
► వన్డేల్లో 7 వేల పరుగులు పూర్తి చేసుకున్న ఏడో భారత బ్యాట్స్‌మన్‌గా రోహిత్‌ శర్మ రికార్డుల కెక్కాడు.
► ఒకే మ్యాచ్‌లో ఇద్దరు భారత ఓపెనర్లు సెంచరీలు చేయడం ఇది ఏడోసారి. గతంలో సచిన్‌–గంగూలీ మూడుసార్లు (1998లో శ్రీలంకపై; 2001లో దక్షిణాఫ్రికాపై; 2001లో కెన్యాపై), సెహ్వాగ్‌–గంగూలీ (2002లో ఇంగ్లండ్‌పై), సెహ్వాగ్‌–సచిన్‌ టెండూల్కర్‌ (2003లో న్యూజిలాండ్‌పై), రహానే–ధావన్‌ (2014లో శ్రీలంకపై) ఒక్కోసారి ఇలా చేశారు.   


  హసన్‌ అలీ
 

మరిన్ని వార్తలు