భారత్‌-పాక్‌ టీ20.. ఓ అద్భుతం

14 Sep, 2018 11:22 IST|Sakshi

సాక్షి, స్పోర్ట్స్‌: క్రికెట్‌ చరిత్రలో అభిమానులు కొత్త అనుభూతి చెందిన రోజు. టీ20 ఫార్మటే కొత్తగా అనిపిస్తున్న తరుణంలో అందరినీ ఆశ్యర్చపరిచింది.. ఎప్పుడూ వినని, చూడని ‘బౌల్‌ ఔట్‌’ . అప్పట్లో మ్యాచ్‌ టై అయితే ఇరుజట్లకు చెరో పాయింట్.. అదే ఇప్పుడు సూపర్‌ ఓవర్‌. కానీ 2007 టీ20 ప్రపంచకప్‌లో ‘బాల్‌ ఔట్‌’  అనే కొత్త విధానం క్రీడా జనాలను ఆకట్టుకుంది. ఈ విధానంతో బొక్క బోర్లాపడ్డ జట్టు పాక్‌ అయితే గెలిచిన జట్టు టీమిండియా. సరిగ్గా 11ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన ప్రపంచ కప్‌లో భాగంగా గ్రూప్‌ దశలో పాకిస్తాన్‌పై టీమిండియా గెలిచింది బాల్‌ ఔట్‌ విధానంతోనే. దానికి సంబంధించిన వీడియో ఐసీసీ ట్వీట్‌ చేసింది.  

కొత్తగా సారథ్య బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎంఎస్‌ ధోనికి అసలు సవాలు 2007 టీ20 ప్రపంచకప్‌లో ఎదురైంది. కొత్త ఆట, యువ ఆటగాళ్లు, ప్రత్యర్థులకు అప్పటికే అలవాటైన ‘బాదుడు’ ఆట. కానీ పక్కావ్యూహాలు అమలు చేసి టీమిండియా సగర్వంగా విశ్వవిజేతగా నిలిచింది. అయితే గ్రూప్‌ దశలో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌ మాత్రం ఎప్పటికీ ఎవ్వరూ మర్చిపోలేరు. ఆ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది పాక్‌. మహ్మద్‌ ఆసిఫ్‌(4/18) చెలరేగి బౌలింగ్‌ చేసినా.. ఊతప్ప(50), ధోని(33)లు రాణించటంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. అనంతరం 142 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ చేపట్టిన పాక్‌.. టీమిండియా బౌలర్లు కట్టు దిట్టంగా బౌలింగ్‌ చేయడంతో నిర్ణీత ఓవర్లు ముగిసే సరికి ఏడు వికెట్లు కోల్పోయి 141 పరుగులే చేసింది.  

‘బౌల్‌ ఔట్‌’తో విజయం
అందరూ మ్యాచ్‌ టై అయిందని నిరుత్సాపడుతున్న సమయంలో ఐసీసీ కొత్తగా ప్రవేశ పెట్టిన ‘బౌల్‌ ఔట్‌’ విధానం అందరినీ ఆకట్టుకుంది. కొత్త విధానం ప్రకారం టీమిండియా ఆటగాళ్లు వీరేంద్ర సెహ్వాగ్‌, రాబిన్‌ ఊతప్ప, హర్భజన్‌ సింగ్‌లు నేరుగా బంతి వికెట్లను తాకేలా బౌలింగ్‌ చేయగా.. పాక్‌ బౌలర్లు యాసిర్‌ ఆరాఫత్‌, ఉమర్‌ గుల్, షాహిద్‌ ఆఫ్రిదిలు విఫలమయ్యారు. దీంతో టీమిండియా 3-0 తేడాతో విజయం సాధించింది. 


 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు