చక్ దే ఇండియా...

3 Oct, 2014 00:53 IST|Sakshi
చక్ దే ఇండియా...

ప్రత్యర్థిగా దాయాది దేశం... ముఖాముఖి రికార్డూ అంతగా బాగాలేదు... లీగ్ దశలోనూ ఓటమి... ఎలాగైనా, ఈసారైనా గెలవాలనే ఒత్తిడి... ఈ నేపథ్యంలో భారత పురుషుల హాకీ జట్టు నరాలు తెగే ఉత్కంఠతను తట్టుకుంది. కొడితే కుంభస్థలం మీద కొట్టాలి అనే విధంగా అంతిమ సమరంలో అద్భుతం చేసింది. కీలక క్షణాల్లో సంయమనం కోల్పోకుండా ఆడింది.  48 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను ‘షూటౌట్’లో బోల్తా కొట్టించి టీమిండియా ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. 16 ఏళ్ల తర్వాత ఏషియాడ్‌లో మళ్లీ పసిడి నెగ్గిన భారత్ 2016లో రియో డి జనీరోలో జరిగే ఒలింపిక్స్ క్రీడలకు నేరుగా అర్హత సాధించింది.
 
ఫైనల్లో పాక్‌పై విజయం

16 ఏళ్ల తర్వాత ఏషియాడ్‌లో స్వర్ణం
2016 ఒలింపిక్స్‌కూ అర్హత
ఇంచియాన్: ఆధిక్యంలో ఉండటం... ఆ తర్వాత వెనుకబడిపోవడం... ఇటీవల కాలంలో భారత హాకీ జట్టుకు అలవాటుగా మారింది. కానీ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన ఆసియా క్రీడల ఫైనల్లో మాత్రం భారత ఆటగాళ్లు శక్తివంచన లేకుండా పోరాడారు. తొలుత  0-1తో వెనుకబడినా... ఆ తర్వాత బెదరకుండా, నమ్మకం కోల్పోకుండా స్కోరును సమం చేశారు. నిర్ణీత సమయం పూర్తయ్యాక విజేతను నిర్ణయించే ‘షూటౌట్’లోనూ సంయమనం కోల్పోకుండా అనుకున్న లక్ష్యాన్ని సాధించారు.

ఫలితంగా 16 ఏళ్ల విరామం తర్వాత భారత పురుషుల హాకీ జట్టు ఆసియా క్రీడల్లో మళ్లీ పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. అంతేకాకుండా 2016 ఒలింపిక్స్ క్రీడలకు నేరుగా అర్హత సాధించింది. గురువారం జరిగిన ఫైనల్లో సర్దార్ సింగ్ నాయకత్వంలోని భారత్ ‘షూటౌట్’లో 4-2తో పాకిస్థాన్‌ను ఓడించింది. నిర్ణీత సమయం వరకు రెండు జట్లు 1-1తో సమఉజ్జీగా నిలిచాయి. దాంతో ఫలితం తేలడానికి ‘షూటౌట్’ అనివార్యమైంది. ‘షూటౌట్’లో భారత్ తరఫున ఆకాశ్‌దీప్ సింగ్, రూపిందర్ పాల్ సింగ్, బీరేంద్ర లాక్రా, ధరమ్‌వీర్ సింగ్ సఫలమయ్యారు.

మన్‌ప్రీత్ సింగ్ విఫలమయ్యాడు. పాకిస్థాన్ తరఫున మహ్మద్ వకాస్, రసూల్ సఫలంకాగా... హసీమ్ ఖాన్, ఉమర్ విఫలమయ్యారు. ‘షూటౌట్’లో భారత గోల్‌కీపర్, వైస్ కెప్టెన్ శ్రీజేష్ చాకచక్యంగా వ్యవహరించి పాక్ ఆటగాళ్ల రెండు షాట్‌లను నిలువరించి ‘హీరో’గా అవతరించాడు. అంతకుముందు ఆట మూడో నిమిషంలో మహ్మద్ రిజ్వాన్ గోల్‌తో పాకిస్థాన్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే ఆట 27వ నిమిషంలో కొత్తాజిత్ సింగ్ గోల్‌తో భారత్ స్కోరును 1-1తో సమం చేసింది.
     
లీగ్ దశలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో భారత ఆటగాళ్లు ఫైనల్లో బరిలోకి దిగారు. కానీ మూడో నిమిషంలోనే పాక్ గోల్ చేసి భారత్‌కు షాక్ ఇచ్చింది. అయితే భారత ఆటగాళ్లు వెంటనే ఈ పరిణామం నుంచి తేరుకున్నారు. సమన్వయంతో కదులుతూ పాక్‌పై ఒత్తిడిని పెంచారు. రెండో అర్ధభాగంలో భారత కృషి ఫలించింది. కొత్తాజిత్ గోల్‌తో భారత్ స్కోరును సమం చేసింది. ఆ తర్వాతి రెండు అర్ధ భాగాల్లో రెండు జట్లు మరో గోల్ చేయడంలో సఫలంకాలేదు.
ఓవరాల్‌గా ఆసియా క్రీడల హాకీలో భారత్‌కిది మూడో స్వర్ణం. గతంలో టీమిండియా రెండుసార్లు (1966లో, 1998లో) బ్యాంకాక్‌లోనే జరిగిన క్రీడల్లో పసిడి పతకాలు గెలిచింది.
ఆసియా క్రీడల ఫైనల్లో పాక్‌ను ఓడించడం భారత్‌కిది రెండోసారి మాత్రమే. చివరిసారి 1966 క్రీడల ఫైనల్లో భారత్ 1-0తో పాక్‌పై గెలిచింది.

 
‘‘ఆసియా క్రీడల్లో స్వర్ణం నెగ్గడం నా కెరీర్‌లోనే గొప్ప విజయంగా భావిస్తున్నాను. పసిడి సాధించి రియో ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత పొందాలనే ఏకైక లక్ష్యంతో ఇంచియాన్‌కు వచ్చాం. తుదకు నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించాం. ఈ విజయంలో కోచ్ టెర్రీ వాల్ష్, సహాయక సిబ్బంది పాత్రను మరువలేం.’’    - సర్దార్ సింగ్, భారత కెప్టెన్

మరిన్ని వార్తలు