టీమిండియాకు వెరీ వెరీ స్పెషల్‌ డే

24 Sep, 2018 13:30 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భారత్‌ క్రికెట్‌ చరిత్రలో ఈరోజు(సెప్టెంబర్‌ 24) ఒక చిరస్మరణీయమైనది. ఎంఎస్‌ ధోని నేతృత్వంలోని టీమిండియా.. టీ20 వరల్డ్‌కప్‌ను అందుకున్న రోజు. పొట్టి ఫార్మాట్‌లో వరల్డ్‌కప్‌ను ప్రవేశపెట్టిన ఏడాదే దాయాది పాకిస్తాన్‌ను ఓడించి కప్‌ను ముద్దాడింది భారత్‌. ఈ రోజు గుర్తొచ్చినప్పుడల్లా క్రికెట్‌ అభిమానులకు ఆ మధుర క్షణాలు ఇంకా కళ్ల ముందు కదులుతూనే ఉన్నాయి. జోగిందర్‌ శర్మ బౌలింగ్‌.. మిస్బావుల్‌ హక్‌ బ్యాటింగ్‌.. శ్రీశాంత్‌ క్యాచ్‌.  తొలి టీ20 ప్రపంచప్‌ను అందుకున్న జట్టుగా టీమిండియా అవతరించింది ఈ రోజే.  సరిగ్గా 11 ఏళ్ల క్రితం ఎంఎస్‌ ధోని నేతృత్వంలోని యంగ్‌ టీమిండియా అద్భుతాలు చేస్తూ విశ్వవిజేతగా నిలిచింది. యువ ఆటగాళ్లను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సచిన్‌ టెండూల్కర్‌, సౌరవ్‌ గంగూలీ, అనిల్‌ కుంబ్లే, రాహుల్‌ ద్రవిడ్‌లు పొట్టి ఫార్మట్‌ క్రికెట్‌ నుంచి తప్పుకున్న నేపథ్యంలో యువ భారత జట్టు భవిష్యత్‌కు భరోసానిస్తూ అఖండ విజయాన్ని సాధించింది.

అలవాటు లేని ఆట..
ప్రపంచకప్‌ కోసం దక్షిణాఫ్రికాలో అడుగుపెట్టే సమయానికి టీమిండియాకు ఓకేఒక టీ20 ఆడిన ఆనుభవం. అప్పటికే టీ20లో ప్రత్యర్థి జట్లు నిష్ణాతులు. కొత్త సారథి, కొత్త ఆటగాళ్లు, కొత్త ఫార్మట్‌ అందరూ అనుకున్నారు లీగ్‌లోనే భారత జట్టు కథ ముగుస్తుందని జోస్యం చెప్పారు. అండర్‌ డాగ్‌గా బరిలోకి దిగిన ధోని సేన విశ్వవిజేతగా నిలిచింది. పాకిస్తాన్‌పై బౌల్‌ ఔట్‌ విధానంతో గెలిచింది.. న్యూజిలాండ్‌పై ఓటమి.. యువీ మెరుపులతో ఇంగ్లండ్‌పై విజయం.. బౌలర్ల ప్రదర్శనతో సెమీస్‌లో ఆస్ట్రేలియాపై గెలుపు.. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఫైనల్లో పాకిస్తాన్‌పై గెలుపు. దాదాపు 24 సంవత్సరాల తర్వాత ఒక ఫార్మట్‌లో ప్రపంచ కప్‌ను టీమిండియా ముద్దాడింది. 

గంభీర్‌ పోరాటం.. బౌలర్ల విజృంభణ
టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేపట్టిన భారత జట్టు గంభీర్‌(75; 54 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు) అద్భుత పోరాటంతో నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. అనంతరం 158 పరుగుల లక్ష్యంతో పాకిస్తాన్‌ జట్టు బరిలోకి దిగింది. భారత బౌలర్లు తొలుత విజృంభించి తర్వాత జూలు విదిల్చారు. దీంతో ఆఖరి ఓవర్‌లో పాకిస్తాన్‌ గెలవాలంటే 13 పరుగులు సాధించాలి. ఒక్క వికెట్‌ తీసినా.. 11 పరుగులకే కట్టడి చేసినా విజయం ధోని సేనదే. కానీ అప్పటికే ధారళంగా పరుగులిచ్చిన జోగిందర్‌ శర్మ చివరి ఓవర్‌ వేస్తున్నాడు. బ్యాటింగ్‌ చేస్తుంది పాక్‌ సారథి మిస్బావుల్‌ హక్‌.. అందరిలోనూ ఆందోళన. రెండో బంతి సిక్స్‌ ఇక మ్యాచ్‌ ముగిసందనుకున్నారు. కానీ జోగిందర్‌ వేసిన మూడో బంతిని స్కూప్‌ చేయబోయి మిస్బా శ్రీశాంత్‌కు చిక్కాడు. దీంతో టీమిండియా ఐదు పరుగుల తేడాతో విజయం సాధించి సగర్వంగా ప్రపంచకప్‌ను అందుకుంది.

మరిన్ని వార్తలు