కోహ్లి కొడితే... మొహాలీ మనదే...

19 Sep, 2019 02:25 IST|Sakshi

రెండో టి20లో భారత్ ఘన విజయం

7 వికెట్లతో దక్షిణాఫ్రికా  చిత్తూ

విరాట్ అర్ధసెంచరీ, రాణించిన ధావన్

ఆదివారం చివరి టి 20

విరాట్‌ కోహ్లి విరచిత మరో విజయం... మొహాలీలో తాను ఆడిన గత టి20 మ్యాచ్‌లో అద్భుతం చేసిన కోహ్లి బుధవారం అదే వేదికపై మరోసారి చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌ ఆడాడు... బ్యాటింగ్‌లో కోహ్లికి తోడు ధావన్‌  రాణించడంతో దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో భారత్‌ శుభారంభం చేసింది. సాధారణ లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించి ఆధిక్యంలో నిలిచింది. అంతకుముందు టీమిండియా బౌలర్ల సమష్టి ప్రదర్శనకు నిలవలేక దక్షిణాఫ్రికా తక్కువ స్కోరుకే పరిమితం కావడంతో భారత్‌కు గెలుపు సులువైంది. స్వదేశంలో దక్షిణాఫ్రికాపై భారత్‌కిదే తొలి టి20 విజయం కావడం విశేషం.  

మొహాలీ: దక్షిణాఫ్రికాతో టి20 సిరీస్‌లో భారత్‌ బోణీ చేసింది. ఇక్కడ జరిగిన రెండో టి20లో 7 వికెట్లతో సఫారీలను చిత్తు చేసి 1–0తో ఆధిక్యం సాధించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. కెప్టెన్‌ డి కాక్‌ (37 బంతుల్లో 52; 8 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించగా... బవుమా (43 బంతుల్లో 49; 3 ఫోర్లు, 1 సిక్స్‌) ఆకట్టుకున్నాడు. దీపక్‌ చహర్‌కు 2 వికెట్లు దక్కాయి. అనంతరం భారత్‌ 19 ఓవర్లలో 3 వికెట్లకు 151 పరుగులు చేసింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’  కోహ్లి (52 బంతుల్లో 72 నాటౌట్‌; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీ సాధించగా... ధావన్‌ (31 బంతుల్లో 40; 4 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు. ఇరు జట్ల మధ్య చివరి మ్యాచ్‌ ఆదివారం బెంగళూరులో జరుగుతుంది.   

కీలక భాగస్వామ్యం...
రెండో వికెట్‌కు 45 బంతుల్లో 57 పరుగులు... డి కాక్, బవుమా మధ్య సాగిన ఈ భాగస్వామ్యం మినహా దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో చెప్పుకోవడానికేమీ లేదు. భారత్‌ కట్టుదిట్టమైన బౌలింగ్‌ను సఫారీ బ్యాట్స్‌మెన్‌ సమర్థంగా ఎదుర్కోలేకపోవడంతో ఆ జట్టు సాధారణ స్కోరుకే పరిమితమైంది. పవర్‌ప్లేలో దక్షిణాఫ్రికా 39 పరుగులు చేయగలిగింది. ఆరు బంతుల వ్యవధిలో డి కాక్, వాన్‌ డర్‌ డసెన్‌ (1) డగౌట్‌ చేరడంతో సఫారీ జట్టు భారీ స్కోరు ఆశలకు కళ్లెం పడింది.  సైనీ వేసిన చివరి ఓవర్లో రెండు సిక్సర్లు సహా 16 పరుగులు రావడంతో దక్షిణాఫ్రికా 150 పరుగుల లక్ష్యాన్ని భారత్‌కు నిర్దేశించగలిగింది.  

కోహ్లి అలవోకగా...
ఛేదనలో ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (12) ఎక్కువసేపు నిలవలేకపోయాడు. నోర్టే వేసిన రెండో ఓవర్లో రెండు సిక్సర్లు బాదిన అతను అదే స్కోరు వద్ద ఫెలుక్‌వాయో బౌలింగ్‌లో ఎల్బీగా దొరికిపోయాడు. అయితే ధావన్, కోహ్లి అలవోకగా షాట్లు ఆడుతూ స్కోరును చకచకా పరుగెత్తించారు. రబడ ఓవర్లో ధావన్‌ వరుసగా రెండు ఫోర్లు కొట్టగా, ప్రిటోరియస్‌ బౌలింగ్‌లో కోహ్లి ఆకట్టుకునే సిక్సర్‌తో అలరించాడు. వీరిద్దరు రెండో వికెట్‌కు 47 బంతుల్లో 61 పరుగులు జోడించిన తర్వాత ధావన్‌ అవుటయ్యాడు. అనంతరం రిషభ్‌ పంత్‌ (4) మరో పేలవ షాట్‌కు వెనుదిరిగి తనపై విమర్శలకు మళ్లీ అవకాశం కలి్పంచాడు. అయితే మరో ఎండ్‌లో ఉన్న కోహ్లి మాత్రం ఎక్కడా తగ్గలేదు. ఈ క్రమంలో 40 బంతుల్లో అతని 22వ అర్ధసెంచరీ పూర్తయింది. ఆ తర్వాతా రెండు భారీ సిక్సర్లు బాదిన కోహ్లి... అయ్యర్‌ (16 నాటౌట్‌) తోడుగా ఓవర్‌ మిగిలి ఉండగానే మ్యాచ్‌ను ముగించాడు.  

జెర్సీ నంబర్‌ మారింది!
కెరీర్‌ ఆరంభం నుంచి శిఖర్‌ ధావన్‌ జెర్సీ నంబర్‌ 25గానే ఉంది...దానిని అదృష్ట సంఖ్యగా చెబుతూ కొనసాగిస్తూ వచ్చాడు.  అతడి ట్విట్టర్‌ అకౌంట్‌ కూడా   Sdhawan 25గా కనిపిస్తుంది. బుధవారం మ్యాచ్‌లో మాత్రం 42 నంబర్‌ జెర్సీతో బరిలోకి దిగాడు. టెస్టు జట్టులో ఇప్పటికే చోటు కోల్పోయిన శిఖర్‌...గాయంతో వన్డే వరల్డ్‌కప్‌నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. విండీస్‌తో ఆడిన ఐదు ఇన్నింగ్స్‌లలో కూడా అతను విఫలమయ్యాడు. దాంతో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కూడా అతని స్థానంపై సందేహాలు నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలో అదృష్టం మార్పును కోరుకుంటూ అతను ఏదైనా సంఖ్యాశాస్త్రం ప్రకారం 42కు మారినట్లుగా చెబుతున్నారు!  

సూపర్‌ క్యాచ్‌లు...
సఫారీ ఇన్నింగ్స్‌లో డి కాక్‌ ఇచి్చన క్యాచ్‌ను కెప్టెన్‌ విరాట్‌ అందుకున్న తీరు హైలైట్‌గా నిలిచింది. సైనీ బౌలింగ్‌లో డి కాక్‌ మిడ్‌ వికెట్‌ మీదుగా షాట్‌ ఆడే ప్రయత్నం చేయగా, బంతి బౌలర్‌ తల మీదుగా పైకి లేచింది. అటు వైపు దగ్గరలో కూడా లేని కోహ్లి మిడాఫ్‌నుంచి అనూహ్య వేగంతో దూసుకొచ్చాడు. బంతి కింద పడిపోతున్న దశలో ఎడమ చేతితో అద్భుత రీతిలో దానిని అందుకున్నాడు. భారత్‌ ఇన్నింగ్స్‌లో ధావన్‌ ఇచ్చిన క్యాచ్‌ను మిల్లర్‌ అద్భుతంగా అందుకున్న తీరుకు కూడా అంతే స్థాయిలో ప్రశంసలు దక్కాయి. బౌండరీ వద్ద ఏ మాత్రం అవకాశం లేని చోట మిల్లర్‌ గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో ఒడిసి పట్టుకున్నాడు.  
 

>
మరిన్ని వార్తలు