ఆనందం ఐదింతలు

7 Jul, 2019 05:21 IST|Sakshi

ఒకే ప్రపంచకప్‌లో రోహిత్‌ శర్మ ఐదో సెంచరీ

ఈ ఘనత సాధించిన ఏకైక బ్యాట్స్‌మన్‌

చివరి మ్యాచ్‌లో శ్రీలంక చిత్తు

7 వికెట్లతో భారత్‌ ఘన విజయం

రాహుల్‌ శతకం

వేర్వేరు ప్రత్యర్థులు... వేర్వేరు మైదానాలు, పిచ్‌లు... ప్రపంచ కప్‌ మెగా టోర్నీ ఒత్తిడి... వేటినీ రోహిత్‌ గురునాథ్‌ శర్మ లెక్క చేయడు... పక్షి కన్నుకు గురి పెట్టిన అర్జునుడిలా అతని దృష్టి అంతా పరుగుల వరద పారించడంపైనే... అందుకే రికార్డులు అతని ముందు మోకరిల్లుతాయి. గణాంకాలు గజ్జె కట్టుకొని అతని ముందు ఆడతాయి. తన అత్యద్భుత వన్డే కెరీర్‌లో ఎన్నో కీర్తికిరీటాలను పదిలపర్చుకున్న ‘హిట్‌మ్యాన్‌’ ఇప్పుడు మరో శిఖరాన్ని అధిరోహించాడు.

పన్నెండు ప్రపంచ కప్‌ల చరిత్రలో మరెవరికీ సాధ్యం కాని రీతిలో ఒకే టోర్నీలో ఐదు సెంచరీలతో అతను ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. అనితర సాధ్యమైన రీతిలో మూడు వన్డే డబుల్‌ సెంచరీలు సాధించిన రోహిత్‌ ఇప్పుడు మరో రీతిలో చరిత్రను తిరగరాశాడు. రోహిత్‌ రికార్డుకు తోడు రాహుల్‌ కూడా సెంచరీతో అండగా నిలవడంతో లీగ్‌ దశను భారత్‌ భారీ విజయంతో ముగించింది. ఏమాత్రం పోటీనివ్వలేని రీతిలో శ్రీలంక తక్కువ స్కోరుకే పరిమితం కాగా... టీమిండియా తమకు అలవాటైన రీతిలో లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది.

   
లీడ్స్‌: ప్రపంచ కప్‌లో భారత్‌ తమ ఆధిపత్యాన్ని మళ్లీ ప్రదర్శిస్తూ మరో సాధికారక విజయాన్ని సాధించింది. శనివారం ఇక్కడి హెడింగ్లీ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 7 వికెట్ల తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న శ్రీలంక 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. ఏంజెలో మాథ్యూస్‌ (128 బంతుల్లో 113; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీతో కదం తొక్కగా, తిరిమన్నె (68 బంతుల్లో 53; 4 ఫోర్లు) రాణించాడు. బుమ్రా 37 పరుగులకే 3 వికెట్లు తీయడం విశేషం. అనంతరం భారత్‌ 43.3 ఓవర్లలో 3 వికెట్లకు 265 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రోహిత్‌ (94 బంతుల్లో 103; 14 ఫోర్లు, 2 సిక్సర్లు), లోకేశ్‌ రాహుల్‌ (118 బంతుల్లో 111; 11 ఫోర్లు, 1 సిక్స్‌) సెంచరీలు బాది జట్టును సునాయాసంగా గెలిపించారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 189 పరుగులు జోడించడం విశేషం. వరుసగా మూడో శతకం బాదిన రోహిత్‌కు వన్డేల్లో ఇది 27వ సెంచరీ.  

కీలక భాగస్వామ్యం...
భారత బౌలర్ల దెబ్బకు శ్రీలంక ఆరంభంలో వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది. 12 ఓవర్లు పూర్తి కాక ముందే జట్టు స్కోరు 55/4 వద్ద నిలిచింది. తన తొలి రెండు ఓవర్లలో ఒక్క పరుగు ఇవ్వని బుమ్రా... కరుణరత్నే (10)ను ఔట్‌ చేసి తొలి దెబ్బ కొట్టాడు. మరో రెండు ఓవర్లకు కుశాల్‌ పెరీరా (18) కూడా బుమ్రా బౌలింగ్‌లోనే వెనుదిరిగాడు. టోర్నీలో తొలి మ్యాచ్‌ ఆడుతున్న రవీంద్ర జడేజా తన మొదటి ఓవర్లోనే కుశాల్‌ మెండిస్‌ (3) పని పట్టగా... పాండ్యా వేసిన తర్వాతి ఓవర్లో అవిష్క ఫెర్నాండో (20) కూడా ఔటయ్యాడు. ఈ స్థితిలో మాథ్యూస్, తిరిమన్నె భాగస్వామ్యం లంకను ఆదుకుంది.

ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌పై 82 పరుగుల ఇన్నింగ్స్‌ మినహా ఇతర అన్ని మ్యాచ్‌లలో విఫలమైన మాథ్యూస్‌ కీలక సమయంలో తన అనుభవాన్ని ప్రదర్శించాడు. ప్రపంచ కప్‌లో తొలి అర్ధ సెంచరీతో తిరిమన్నె అతనికి అండగా నిలిచాడు. నిలదొక్కుకునేందుకు కొంత సమయం తీసుకున్న అనంతరం ఈ జంట కొన్ని చక్కటి షాట్లు ఆడింది. 61 పరుగుల వద్ద మాథ్యూస్‌ ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను భువనేశ్వర్‌ వదిలేశాడు. ఎట్టకేలకు తిరిమన్నెను కుల్దీప్‌ ఔట్‌ చేయడంతో 124 పరుగుల ఐదో వికెట్‌ భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత 115 బంతుల్లో మాథ్యూస్‌ సెంచరీ పూర్తయింది. అతని కెరీర్‌లో ఇది మూడో సెంచరీ కాగా మూడూ భారత్‌పైనే వచ్చాయి.  

రాహుల్‌ హిట్‌...
కెరీర్‌ తొలి వన్డేలోనే సెంచరీ సాధించిన రాహుల్‌ మూడేళ్ల తర్వాత తన 22వ వన్డేలో మరో శతకం సాధించగలిగాడు! గత మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 77 పరుగులు చేసి ఫామ్‌లోకి వచ్చిన అతను దానిని ఇక్కడా కొనసాగించాడు. ఈ క్రమంలో లంక బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొని కొన్ని చూడచక్కటి షాట్లు ఆడాడు. ఆరంభంలో ఐదు బంతుల వ్యవధిలోనే మూడు ఫోర్లు కొట్టి దూకుడు ప్రదర్శించిన రాహుల్, ఆ తర్వాత రోహిత్‌కు అండగా నిలిచాడు.

డి సిల్వా వేసిన ఒక ఓవర్లో అతను చెలరేగిపోయాడు. ఈ ఓవర్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌ కొట్టిన అతను 67 బంతుల్లో అర్ధ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. రోహిత్‌ వెనుదిరిగిన కొద్ది సేపటి తర్వాత మలింగ బౌలింగ్‌లో సింగిల్‌ తీయడంతో 109 బంతుల్లో రాహుల్‌ తొలి ప్రపంచ కప్‌ సెంచరీ పూర్తయింది. జట్టు విజయానికి 21 పరుగుల దూరంలో రాహుల్‌ ఔట్‌ కాగా... విరాట్‌ కోహ్లి (41 బంతుల్లో 34 నాటౌట్‌; 3 ఫోర్లు) అజేయంగా నిలిచి టీమ్‌ను గెలుపు తీరం చేర్చాడు.  

స్కోరు వివరాలు  
శ్రీలంక ఇన్నింగ్స్‌: కరుణరత్నే (సి) ధోని (బి) బుమ్రా 10; కుశాల్‌ పెరీరా (సి) ధోని (బి) బుమ్రా 18; అవిష్క ఫెర్నాండో (సి) ధోని (బి) పాండ్యా 20; కుశాల్‌ మెండిస్‌ (స్టంప్డ్‌) ధోని (బి) జడేజా 3; మాథ్యూస్‌ (సి) రోహిత్‌ (బి) బుమ్రా 113; తిరిమన్నె (సి) జడేజా (బి) కుల్దీప్‌ 53; ధనంజయ డి సిల్వా (నాటౌట్‌) 29; తిసారా పెరీరా (సి) పాండ్యా (బి) భువనేశ్వర్‌ 2; ఉదాన (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 264.  
వికెట్ల పతనం: 1–17, 2–40, 3–53, 4–55, 5–179, 6–253, 7–260.
బౌలింగ్‌: భువనేశ్వర్‌ 10–0–73–1, బుమ్రా 10–2–37–3, హార్దిక్‌ పాండ్యా 10–0–50–1, జడేజా 10–0–40–1, కుల్దీప్‌ 10–0–58–1.

భారత్‌ ఇన్నింగ్స్‌: రాహుల్‌ (సి) కుశాల్‌ పెరీరా (బి) మలింగ 111; రోహిత్‌ (సి) మాథ్యూస్‌ (బి) రజిత 103; కోహ్లి (నాటౌట్‌) 34; పంత్‌ (ఎల్బీ) (బి) ఉదాన 4; పాండ్యా (నాటౌట్‌) 7; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (43.3 ఓవర్లలో 3 వికెట్లకు) 265.  
వికెట్ల పతనం: 1–189, 2–244, 3–253.  
బౌలింగ్‌: మలింగ 10–1–82–1, రజిత 8–0–47–1, ఉదాన 9.3–0–50–1, తిసారా పెరీరా 10–0–34–0, ధనంజయ డి సిల్వా 6–0–51–0.

1: ఒకే ప్రపంచకప్‌లో ఐదు సెంచరీలు కొట్టిన తొలి క్రికెటర్‌గా రోహిత్‌ శర్మ ఘనత వహించాడు.

1: ప్రపంచకప్‌ చరిత్రలో అత్యధిక సెంచరీలు కొట్టిన క్రికెటర్ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న సచిన్‌ టెండూల్కర్‌ (44 ఇన్నింగ్స్‌లో 6 సెంచరీలు) సరసన రోహిత్‌ (16 ఇన్నింగ్స్‌లో 6 సెంచరీలు) చేరాడు. ఐదేసి సెంచరీలతో రికీపాంటింగ్‌ (ఆస్ట్రేలియా), కుమార సంగక్కర (శ్రీలంక) రెండో స్థానంలో ఉన్నారు.

2: విరాట్‌ కోహ్లి తర్వాత వన్డేల్లో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో సెంచరీలు కొట్టిన రెండో భారతీయ క్రికెటర్‌గా రోహిత్‌ నిలిచాడు. ఓవరాల్‌గా 11వ ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. సంగక్కర 2015 ప్రపంచకప్‌లో వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో సెంచరీలు కొట్టాడు.  

2: అంతర్జాతీయ క్రికెట్‌లో (టెస్టు, వన్డే ఫార్మాట్‌) ఓ సిరీస్‌లో లేదా ఓ టోర్నమెంట్‌లో ఐదు సెంచరీలు కొట్టిన రెండో క్రికెటర్‌ రోహిత్‌. 1955లో ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌లో విండీస్‌ బ్యాట్స్‌మన్‌ క్లయిడ్‌ వాల్కట్‌ ఐదు సెంచరీలు కొట్టాడు.

3: ప్రపంచకప్‌ మ్యాచ్‌లో ఓ జట్టు తరఫున ఇద్దరు ఓపెనర్లు సెంచరీలు చేయడం ఇది మూడోసారి. 2011 ప్రపంచకప్‌లో శ్రీలంక తరఫున దిల్షాన్, ఉపుల్‌ తరంగ (జింబాబ్వే, ఇంగ్లండ్‌లపై) రెండుసార్లు ఈ ఘనత సాధించారు.  

3: వన్డేల్లో ఎంజెలో మాథ్యూస్‌ చేసిన మూడు సెంచరీలు భారత్‌పైనే వచ్చాయి. అయితే మాథ్యూస్‌ సెంచరీ చేసిన మూడుసార్లూ శ్రీలంక ఓడిపోవడం గమనార్హం.  

27: మరో 27 పరుగులు చేస్తే ఒకే ప్రపంచకప్‌లో అత్యధిక పరుగుల చేసిన బ్యాట్స్‌మన్‌గా రోహిత్‌ ఘనత వహిస్తాడు. ఈ జాబితాలో సచిన్‌ (673 పరుగులు–2003లో), హేడెన్‌ (659 పరుగులు–2007లో) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. ప్రస్తుత ప్రపంచకప్‌లో రోహిత్‌ 647 పరుగులతో టాప్‌ ర్యాంక్‌లో ఉన్నాడు.

రోహిత్‌ స్పెషల్‌...
మంచినీళ్లప్రాయంగా సెంచరీలు బాదుతున్న రోహిత్‌ నుంచి మరో సునాయాస శతకం జాలువారింది. శ్రీలంక బౌలర్లను అసలు ఏమాత్రం లెక్క చేయకుండా నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేస్తున్నంత సునాయాసంగా రోహిత్‌ బ్యాటింగ్‌ సాగింది. రజిత వేసిన రెండో ఓవర్లో కొట్టిన ఫోర్‌తో మొదలైన పరుగుల ప్రవాహం సెంచరీ వరకు సాగింది. మలింగ ఓవర్లో రెండు వరుస ఫోర్ల అనంతరం రజిత తర్వాతి ఓవర్లోనూ రెండు ఫోర్లు కొట్టి రోహిత్‌ దూసుకుపోయాడు. సిల్వా వేసిన బంతిని భారీ సిక్సర్‌గా మలచి 48 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్‌ అదే ఓవర్లో మరో భారీ సిక్సర్‌ బాదాడు.

ఉదాన ఓవర్లో రెండు బౌండరీలతో 90ల్లోకి చేరుకున్న రోహిత్‌... రజిత బౌలింగ్‌లో పుల్‌ షాట్‌తో ఫోర్‌ కొట్టి అరుదైన శతకాలు పూర్తి చేసుకున్నాడు. ఒకే ప్రపంచకప్‌లో ఐదో సెంచరీతో కొత్త ఘనతను అందుకున్నాడు. మొత్తం ఇన్నింగ్స్‌ అనాయాసంగా, శ్రమ లేకుండా సాగడం చూస్తే రోహిత్‌ ఆత్మవిశ్వాసం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజా ప్రదర్శనతో రోహిత్‌ ఈ ప్రపంచ కప్‌లో 647 పరుగులతో అగ్రస్థానానికి చేరుకున్నాడు. లీగ్‌ దశలో ఎనిమిది మ్యాచ్‌లు ఆడితే అందులో ఐదు సెంచరీలు, ఒక అర్ధసెంచరీ ఉండటం విశేషం.  

ఈ ప్రపంచకప్‌లో రోహిత్‌ స్కోర్లు


రాహుల్‌, మాథ్యూస్‌


రోహిత్‌ భార్య రితిక

మరిన్ని వార్తలు