భువీంద్రజాలం

25 Aug, 2017 00:58 IST|Sakshi
భువీంద్రజాలం

భారత్‌ను గెలిపించిన భువనేశ్వర్, ధోని
ఆరు వికెట్లు  తీసిన లంక బౌలర్‌ ధనంజయ


భారత్‌ ముందున్న లక్ష్యం 231... రోహిత్, ధావన్‌ జోరుగా ఆడి తొలి వికెట్‌కు 109 పరుగులు జోడించారు. ఇక మ్యాచ్‌ మళ్లీ ఏకపక్షం అనుకున్న దశలో లంక స్పిన్నర్‌ అఖిల ధనంజయ మాయకు బ్యాటింగ్‌ ఆర్డర్‌ ఒక్కసారిగా పేకమేడలా కుప్పకూలింది.  22 పరుగుల వ్యవధిలో ఏకంగా 7 వికెట్లు కూలాయి. జట్టు ఓటమి దిశగా పయనిస్తున్న సమయంలో ధోని, భువీ భాగస్వామ్యం అద్భుత విజయాన్ని అందించింది. ధోని ఎప్పటిలాగే తనదైన శైలిలో ప్రశాంతంగా ఆడగా... భువనేశ్వర్‌ తన కెరీర్‌లోనే అత్యుత్తమ ఇన్నింగ్స్‌తో సత్తా చాటాడు. 100 పరుగుల అభేద్య భాగస్వామ్యం టీమిండియాకు ఎప్పటికీ గుర్తుంచుకునే విజయాన్ని అందించింది.   

కాండీ: ఓటమి ఖాయమే అనుకున్న స్థాయి నుంచి సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ ఎంఎస్‌ ధోని (68 బంతుల్లో 45 నాటౌట్‌; 1 ఫోర్‌) అనుభవానికి తోడు భువనేశ్వర్‌ (80 బంతుల్లో 53 నాటౌట్‌; 4 ఫోర్లు; 1 సిక్స్‌) విలువైన అర్ధసెంచరీతో భారత జట్టు గట్టెక్కింది. ఈ జోడీ రికార్డు భాగస్వామ్యంతో గురువారం జరిగిన రెండో వన్డేలో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిన భారత్‌ మూడు వికెట్ల తేడాతో శ్రీలంకపై నెగ్గింది. అంతకుముందు టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన లంక 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 236 పరుగులు చేసింది. సిరివర్ధన (58 బంతుల్లో 58; 2 ఫోర్లు, 1 సిక్స్‌), కపుగెడెర (61 బంతుల్లో 40; 2 ఫోర్లు) మాత్రమే రాణించారు. బుమ్రాకు నాలుగు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత భారీ వర్షం కురవడంతో రెండు గంటలపాటు మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. దీంతో 47 ఓవర్లలో లక్ష్యాన్ని 231 పరుగులకు కుదించారు. రోహిత్‌ (45 బంతుల్లో 54; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), ధావన్‌ (50 బంతుల్లో 49; 6 ఫోర్లు, 1 సిక్స్‌) వేగంగా ఆడారు. ధనంజయకు ఆరు వికెట్లు దక్కాయి.

ఆదుకున్న సిరివర్ధన
లంక ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌ డిక్‌వెల్లా క్రీజులో ఉన్న కాసేపు వేగంగా ఆడాడు. అయితే మిడ్‌ వికెట్‌లో ధావన్‌ పట్టిన క్యాచ్‌తో అవుటయ్యాడు. దీంతో తొలి వికెట్‌కు 41 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. కొద్దిసేపటికే వరుస ఓవర్లలో గుణతిలక (37 బంతుల్లో 19; 2 ఫోర్లు), కెప్టెన్‌ తరంగ (9) అవుట్‌ కావడంతో జట్టుపై ఒత్తిడి పెరిగింది. ఆ తర్వాత కుశాల్‌ (19), మాథ్యూస్‌ (41 బంతుల్లో 20;2 ఫోర్లు) రూపంలో 121 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో లంక ఇన్నింగ్స్‌ను సిరివర్ధన, కపుగెడెర ఆదుకున్నారు. సిరివర్ధన 49 బంతుల్లో 50 పరుగులు పూర్తిచేశాడు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని బుమ్రా విడదీశాడు.  

శుభారంభం అదుర్స్‌..
స్వల్ప లక్ష్యం కోసం బరిలోకి దిగిన భారత్‌కు రోహిత్, ధావన్‌ మెరుపు ఆరంభాన్నిచ్చారు. ముఖ్యంగా లంక గడ్డపై ఆడిన చివరి పది వన్డేల్లో మొత్తం 37 పరుగులే చేసిన రోహిత్‌ ప్రారంభం నుంచే ఎదురుదాడికి దిగాడు. రెండో బంతినే ఫోర్‌గా మలిచిన అతను తొమ్మిదో ఓవర్‌ లో వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. 43 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా అటు ధావన్‌ కూడా చెత్త బంతులను బౌండరీ దాటించడంతో 15 ఓవర్లలోనే జట్టు స్కోరు 102 పరుగులకు చేరింది. 16వ ఓవర్‌ నుంచి స్పిన్నర్‌ ధనంజయ చేసిన మాయతో భారత శిబిరం కుదేలైంది. మొదట రోహిత్‌ను ఎల్బీగా అవుట్‌ చేయడంతో తొలి వికెట్‌కు 109 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. సిరివర్ధన వేసిన ఆ మరుసటి ఓవర్‌లోనే మాథ్యూస్‌ తీసుకున్న అద్భుత డైవింగ్‌ క్యాచ్‌తో ధావన్‌ అవుటయ్యాడు.

ఇక 18వ ఓవర్‌లో ధనంజయ భారత్‌కు గట్టి షాకే ఇచ్చాడు. బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ కోసం రాహుల్‌ (4), జాదవ్‌ (1)లను కోహ్లి (4)ముందుగా పంపించాడు. కానీ ధనంజయ ఐదు బంతుల వ్యవధిలోనే తన గూగ్లీ బంతులతో ఈ ముగ్గురినీ బౌల్డ్‌ చేయడంతో ఏం జరుగుతుందో అర్ధం కాని పరిస్థితి నెలకొంది. ఇంతటితో ఆగకుండా తన మరుసటి రెండు ఓవర్లలో పాండ్యా (0), అక్షర్‌ (6)ల పనిపట్టాడు. ఈ ఇబ్బందికర పరిస్థితిలో క్రీజులో ఉన్న ధోనికి భువనేశ్వర్‌ అండగా నిలిచాడు. దాదాపు 23 ఓవర్ల పాటు క్రీజులో నిలిచిన ఈ జోడి మొదట వికెట్‌ పడకుండా ఆచితూచి ఆడినా చివర్లో జోరు కనబరిచింది. ముఖ్యంగా భువీ.. ధోనికన్నా వేగంగా ఆడుతూ 77 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. చివరికంటా నిలిచిన వీరు జట్టుకు అద్భుత విజయాన్ని అందించారు.

1 ఎనిమిదో వికెట్‌కు భారత్‌ తరఫున అత్యధిక భాగస్వామ్యం (100) నెలకొల్పిన ధోని, భువనేశ్వర్‌ జోడి
►  99 వన్డేల్లో ఎంఎస్‌ ధోని చేసిన స్టంపింగ్‌ల సంఖ్య. సంగక్కరతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు.

మరిన్ని వార్తలు