టీమిండియాదే సిరీస్

28 Mar, 2017 13:54 IST|Sakshi
టీమిండియాదే సిరీస్

ధర్మశాల: ఆస్ట్రేలియాతో చివరి టెస్టు మ్యాచ్ కు ముందు భారత్ క్రికెట్ జట్టులో ఒకే ఒక్క ఆందోళన ఉంది. ఇక్కడ ధర్మశాలలో జరిగిన అరంగేట్రపు వన్డే, ట్వంటీ 20ల్లో భారత జట్టు ఓడి పోవడం భారత్ ను తీవ్రంగా కలవరపెట్టింది. ఇది సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్ కావడంతో  ఆ పాత రికార్డు సెంటిమెంట్ భారత్ జట్టును ఆలోచనలో్ పడేసింది. అయితే ఆ రికార్డుకు ఘనంగా ఫుల్ స్టాప్ పెట్టింది భారత్. చివరిదైన నాల్గో టెస్టులో ఆసీస్ ను ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించిన టీమిండియా అందుకు చరమగీతం పాడింది. తద్వారా బోర్డర్-గవాస్కర్ ట్రోఫిని  భారత్ 2-1తో కైవశం చేసుకుంది. మరొకవైపు గతంలో ఈ సిరీస్ లో ఆసీస్ పై ఎదురైన ఓటమికి ఘనంగా ప్రతీకారం తీర్చుకుంది భారత్.

(ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

నాల్గో టెస్టులో ఆసీస్ విసిరిన 106 పరుగుల విజయలక్ష్యాన్ని భారత్ సునాయాసంగా ఛేదించింది. 19/0 ఓవర్ నైట్ స్కోరుతో మంగళవారం నాల్గో రోజు రెండో ఇన్నింగ్స్ ను కొనసాగించిన భారత్ జట్టు ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని చేరుకుంది. తొలి సెషన్ ఆదిలో భారత్ వరుసగా మురళీ విజయ్(8), చటేశ్వర పూజరా(0)ల వికెట్లను కోల్పోయినప్పటికీ కేఎల్ రాహుల్, కెప్టెన్ అజింక్యా రహానేలు మిగతా పనిని దిగ్విజయంగా పూర్తి చేశారు. ఈ జోడి స్కోరు బోర్డును వేగంగా పరుగులు పెట్టించడంతో భారత్ జట్టు 25.0 ఓవర్లలోనే విజయాన్ని సాధించింది. రాహుల్(52 నాటౌట్;76 బంతుల్లో9 ఫోర్లు), రహానే(38 నాటౌట్; 27 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) దాటిగా బ్యాటింగ్ చేయడంతో భారత్ తొలి సెషన్లోపే గెలుపును సొంతం చేసుకుంది.

రహానే జోరు..
భారత జట్టు విజయలక్ష్యాన్ని అందుకునే క్రమంలో తన రెండో ఇన్నింగ్స్ లో 46 పరుగుల వద్ద వరుసగా రెండు వికెట్లను కోల్పోయి కాస్త ఇబ్బందుల్లో పడింది. తొలుత మురళీ విజయ్ వికెట్ ను కోల్పోయిన భారత్.. ఆ వెంటనే పుజరా వికెట్ ను చేజార్చుకుంది. అనవసరపు పరుగు కోసం యత్నించిన పుజరాను మ్యాక్స్ వెల్ అద్భుతమైన రీతిలో రనౌట్ చేశాడు. ఆ తరుణంలో క్రీజ్లోకి వచ్చిన రహానే తనశైలికి భిన్నంగా బ్యాట్ ఝుళిపించాడు. వచ్చీ రావడంతోనే ఆసీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లతో విరుచుకు పడ్డాడు. దాంతో ఈ రోజు విజయానికి కావాల్సిన 87 పరుగులను భారత్ జట్టు 18.0 ఓవర్ల లోపే సాధించి విజయబావుటా ఎగురవేసింది.

 

ఆస్టేలియా తొలి ఇన్నింగ్స్ 300 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 137 ఆలౌట్

భారత్ తొలి ఇన్నింగ్స్  332 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 106/2