విరాట్ సేన ఘన విజయం

12 Dec, 2016 15:21 IST|Sakshi
విరాట్ సేన ఘన విజయం

మొహాలి:తొలిరోజు  మినహా ఆ తరువాత పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన భారత క్రికెట్ జట్టు..ఇంగ్లండ్ తో జరిగిన మూడో  టెస్టుల్లో ఘన విజయాన్ని అందుకుంది. నాల్గో రోజు ఆటలో భాగంగా ఇంగ్లండ్ నిర్దేశించిన 103 పరుగుల లక్ష్యాన్ని భారత్ రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ మురళీ విజయ్ డకౌట్ గా నిష్క్రమించనప్పటికీ  మరో ఓపెనర్ పార్థీవ్ పటేల్(67 నాటౌట్;54 బంతుల్లో11 ఫోర్లు,1 సిక్స్) రాణించడంతో భారత్ 20.2 ఓవర్లలోనే విజయాన్ని సాధించింది. దాంతో సిరీస్లో 2-0 ఆధిక్యంలో నిలిచింది.

అంతకుముందు 78/4 ఓవర్ నైట్ స్కోరుతో మంగళవారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ 90.2 ఓవర్లలో 236 పరుగులకు ఆలౌటైంది. దాంతో ఇంగ్లండ్ స్వల్ప లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించకల్గింది. అయితే ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ ఆదిలోనే విజయ్ వికెట్ ను నష్టపోయింది.  ఎనిమిది బంతులు ఎదుర్కొన్న విజయ్ పరుగులేమీ చేయకుండా నిష్ర్కమించాడు. కాగా, మరో ఓపెనర్ పార్థీవ్ పటేల్ వన్డే తరహాలో చెలరేగిపోయాడు. పార్థీవ్ పటేల్ సాధించిన స్కోరులో 10 ఫోర్లు ఉండటం అతనిలో ప్రతిభకు మరోసారి అద్దం పట్టింది. భారత జట్టు విజయానికి 15 పరుగుల దూరంలో ఉండగా చటేశ్వర పూజారా(25) రెండో వికెట్ గా అవుటయ్యాడు. ఆ తరుణంలో పార్థీవ్ కు జత కలిసిన కెప్టెన్ విరాట్ కోహ్లి(6నాటౌట్) మరో వికెట్ పడకుండా జట్టును గెలుపువైపు నడిపించాడు.


భారత్ దూకుడు..

ఈ రోజు ఆట ప్రారంభమైనప్పట్నుంచీ భారత్ దూకుడును ప్రదర్శించింది. ఓవర్ నైట్ ఆటగాడు బాటీని ఆదిలోనే పెవిలియన్ కు పంపిన భారత్.. ఆ తరువాత కాసేపటికి జాస్ బట్లర్(18)ను కూడా అవుట్ చేసింది. దాంతో మ్యాచ్ భారత్ చేతుల్లోకి వచ్చేసింది. కాగా, ఓవర్ నైట్ ఆటగాడు,  ఓపెనర్ జో రూట్ మాత్రం తన పోరును కొనసాగించాడు. హమిద్ తో కలిసి 47 పరుగులు జత చేసిన తరువాత  జో రూట్(78) ఏడో వికెట్ గా అవుటయ్యాడు. ఆ తరుణంలో హమిద్-వోక్స్లో జోడి ఇన్నింగ్స్ ను చక్కదిద్దే యత్నం చేసింది.  ఈ జంట 43 పరుగులు జోడించిన తరువాత వోక్స్ పెవిలియన్ కు చేరాడు. ఆ తరువాత స్వల్ప వ్యవధిలో రషిద్ డకౌట్ గా అవుటయ్యాడు.  కాసేపటికే జేమ్స్ అండర్సన్(5) రనౌట్ కావడంతో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ ముగిసింది. మరోవైపు హమిద్(59నాటౌట్) క్రీజ్లో మిగిలాడు.

భారత బౌలర్లలో రవి చంద్రన్ అశ్విన్ మూడు వికెట్లు సాధించగా, మొహ్మద్ షమీ, రవీంద్ర జడేజా, జయంత్ యాదవ్లకు తలో రెండు వికెట్లు దక్కాయి.