ఒత్తిడిలో కివీస్ చిత్తు: విరాట్ సేనదే సిరీస్

7 Nov, 2017 22:46 IST|Sakshi

తిరువనంతపురం: న్యూజిలాండ్ తో జరిగిన మూడు ట్వంటీ 20ల సిరీస్ ను టీమిండియా 2-1తో కైవసం చేసుకుంది. మంగళవారం ఇక్కడ జరిగిన చివరి మ్యాచ్ లో భారత్ 6 పరుగుల తేడాతో విజయం సాధించి  సిరీస్ ను సొంతం చేసుకుంది. వర్షం కారణంగా ఎనిమిది ఓవర్లకు కుదించబడ్డ మ్యాచ్ లో భారత బౌలర్లు రాణించి జట్టుకు విజయాన్ని అందించారు. న్యూజిలాండ్ కు నిర్దేశించిన 68 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోవడంలో భారత్ సఫలమై మ్యాచ్ ను సాధించింది. కివీస్ ను 61 పరుగులకే కట్టడి చేసిన భారత్ సిరీస్ ను చేజిక్కించుకుంది. చివరి వరకూ ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ ఒత్తిడిని జయించలేక చిత్తయ్యింది. భారత బౌలర్లలో బూమ్రా రెండు వికెట్లతో రాణించగా, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ సాధించి జట్టుకు  అద్భుతమైన విజయాన్ని సాధించిపెట్టారు.  కివీస్ ఆటగాళ్లలో గ్రాండ్ హోమ్(17 నాటౌట్),ఫిలిప్స్(11)ఫర్వాలేదనిపించగా, గప్టిల్(1), మున్రో(7), విలియమ్సన్(8)లు పూర్తిగా విఫలమయ్యారు.


టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 8.0 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 67 పరుగులు చేసింది. తొలి రెండు ఓవర్లలో 14 పరుగులు మాత్రమే సాధించిన ఓపెనర్లు శిఖర్-రోహిత్ లు..మూడో ఓవర్ లో వరుసగా అవుటయ్యారు. సౌతీ వేసిన మూడో ఓవర్ రెండో బంతికి భారీ షాట్ కు యత్నించిన ధావన్(6) అవుట్ కాగా, ఆ మరుసటి బంతికి రోహిత్ శర్మ(8) కూడా పెవిలియన్ చేరాడు. ఈ ఇద్దరూ సాంట్నార్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరడం గమనార్హం.భారత జట్టులో మనీష్ పాండే(17), హార్దిక్ పాండ్యా(14 నాటౌట్), కోహ్లి(13) రెండంకెల మార్కును దాటిన ఆటగాళ్లు.
 

మరిన్ని వార్తలు