మూడో వన్డేలో భారత్ సూపర్ విక్టరీ

24 Oct, 2016 06:42 IST|Sakshi
మూడో వన్డేలో భారత్ సూపర్ విక్టరీ

కివీస్ తో మూడో వన్డేలో టీమిండియా జయభేరి మోగించింది. ఐదు వన్డేల సిరీస్ లో 2-1 ఆధిక్యంతో ముందుకు దూసుకెళ్లింది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ 283 పరుగుల విజయలక్ష్యాన్ని భారత్ ముందు ఉంచింది. భారత బ్యాట్స్ మన్లలో వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిలు సమయోచిత ఇన్నింగ్స్ తో జట్టును విజయతీరాలకు చేర్చారు.  

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఓపెనర్లు అజింక్యా రహానే(8), రోహిత్ శర్మ(13) స్వల్ప వ్యవధిలో పెవిలియన్ కు చేరడంతో లక్ష్య చేధనలో భారత్ కు కష్టాలు తప్పవని అనిపించింది. ఈ దశలో కెప్టెన్ ధోని ముందువరుసలో బ్యాటింగ్ వచ్చాడు. మరో ఎండ్ లో కోహ్లీకి కుదురుకోవడానికి ధోని చక్కగా సహకరించాడు. ఆరు పరుగుల వ్యక్తిగత స్కోరు న్యూజిలాండ్ ప్లేయర్ టేలర్ వదిలేయడంతో బతికిపోయిన కోహ్లీ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. దీంతో ఇద్దరూ ఆచితూచి ఆడుతూ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. హాప్ సెంచరీలు పూర్తి చేసుకున్న ఇద్దరూ పరుగుల వేగాన్ని పెంచారు.

దీంతో న్యూజిలాండ్ బౌలర్లు పరుగులు సమర్పించుకోవడానికే పరిమితమయ్యారు. 192 పరుగుల వద్ద హెన్రీ బౌలింగ్ లో చెత్త షాట్ ఆడిన ధోని(80)  టేలర్ కు క్యాచ్ ఇచ్చి మూడో వికెట్ గా వెనుదిరిగాడు.  జట్టుకు విజయానికి ఇంకా 80పై చిలుకూ అవసరమయ్యాయి. ధోని తర్వాత క్రీజులోకి వచ్చిన మనీశ్ పాండే తో జత కలిసిన కోహ్లీ కెరీర్ లో 26వ శతకం సాధించాడు.  చెత్త బంతులను బౌండరీలుగా మలిచిన కోహ్లీ(154), మనీశ్(28)లు మరికొన్ని బంతులు మిగిలివుండగానే లక్ష్యాన్ని చేధించారు.

న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ రెండు వికెట్లు పడగొట్టగా, సౌథీ కు ఒక వికెట్ దక్కింది. న్యూజిలాండ్ బ్యాట్స్ మన్లలో టామ్ లాథమ్(61) జట్టు తరఫున టాప్ స్కోరర్ గా నిలిచాడు. భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్, కేదార్ జాదవ్ లకు చెరో మూడు వికెట్లు, అమిత్ మిశ్రా, బుమ్రాలకు చెరో రెండు వికెట్లు దక్కాయి.

మరిన్ని వార్తలు