టీమిండియాదే సిరీస్‌

17 Dec, 2017 20:00 IST|Sakshi

విశాఖ: శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా కైవసం చేసుకుంది. ఆదివారం ఇక్కడ డా. వైఎస్‌ రాజశేఖర రెడ్డి స్టేడియంలో జరిగిన చివరిదైన మూడో వన్డేలో భారత్‌ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. శ్రీలంక నిర్దేశించిన 216 పరుగుల లక్ష్యాన్ని 32.1 ఓవర్లలోనే ఛేదించిన టీమిండియా మరో ఘన విజయాన్ని నమోదు చేసింది. ఫలితంగా వన్డే సిరీస్‌ను 2-1తో చేజిక్కించుకుంది. శిఖర్‌ ధావన్‌(100 నాటౌట్; 85 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్లు‌), శ్రేయస్‌ అయ్యర్‌(65;63 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్సర్‌) విజయంలో కీలక పాత్ర పోషించారు.

లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా ఆదిలోనే రోహిత్‌ శర్మ(7) వికెట్‌ను కోల్పోయింది. ఆ సమయంలో శిఖర్‌ ధావన్‌కు జత కలిసిన శ్రేయస్‌ అయ్యర్‌  దాటిగా బ్యాటింగ్‌ చేశాడు. ఈ క్రమంలోనే 44 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్‌ సాయంతో హాఫ్‌ సెంచరీ నమోదు చేశాడు.  ఆపై కాసేపటికి శిఖర్‌ ధావన్‌ కూడా 46 బంతుల్లో ఆరు ఫోర్లు, 1 సిక్స్‌తో అర్థ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. దూకుడుగా ఆడే క్రమంలో అయ్యర్‌ రెండో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. దాంతో శిఖర్‌-అయ్యర్‌ల 135 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ సమయంలో దినేశ్‌ కార్తీక్‌-శిఖర్‌ల జోడి మరో వికెట్‌ పడకుండా టీమిండియాను విజయం వైపు నడిపించింది. దినేశ్‌ కార్తీక్‌(26నాటౌట్‌) బాధ్యతాయుతంగా బ్యాటింగ్‌ చేశాడు.  శ్రీలంక బౌలర్లలో ధనంజయ, పెరీరాలకు తలో వికెట్‌ దక్కింది.అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 44.5 ఓవర్లలో 215 పరుగులకు ఆలౌటైంది. లంక బ్యాట్స్‌మన్‌లలో తరంగ 95 ( 82 బంతులు, 12 ఫోర్లు, 3 సిక్సులు) సదీర సమరవిక్రమా 42(57 బంతుల్లో 5 ఫోర్లు) మినహా మిగతా బ్యాట్స్‌మెన్‌ చేతులెత్తేశారు. ఇక భారత బౌలర్లలో చహల్‌, కుల్దీప్‌లు మూడేసి వికెట్లు తీయగా పాండ్యా రెండు, బుమ్రా, భువనేశ్వర్‌లు ఒక వికెట్‌ తీశారు.


లంక ఆరంభం అదుర్స్‌

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లంక ఓపెనర్‌ గుణతిలక మరో సారి నిరాశపరిచాడు. అయినా మరో ఓపెనర్‌ తరంగ, సమరవిక్రమాతో కలిసి మంచి శుభారంభాన్ని అందించాడు. ఈ ఇద్దరు సమన్వయంతో ఆడుతూ వీలు చిక్కినప్పుడల్లా బంతిని బౌండరీలకు తరలించారు. పాండ్యా వేసిన 8 ఓవర్‌లో తరంగ ఏకంగా 5 ఫోర్లతో విరుచుకుపడ్డాడు. దీంతో పవర్‌ ప్లే ముగిసే సరికి లంక వికెట్‌ నష్టపోయి 68 పరుగుల చేసింది. అనంతరం మరింత స్పీడ్‌ పెంచిన ఈ జోడి స్కోరు బోర్డును వేగంగా పరుగెత్తించింది.  ఈ దశలోనే తరంగ 36 బంతుల్లో 10 ఫోర్లతో కెరీర్‌లో 36వ అర్ధ సెంచరీ సాధించాడు. జట్టు స్కోర్‌ 136 పరుగుల వద్ద సదీర చహల్‌ బౌలింగ్‌లో అనవసర షాట్‌కు ప్రయత్నించి ధావన్‌కు చిక్కాడు.  దీంతో రెండో వికెట్‌కు నమోదైన 121 పరుగుల భాగ స్వామ్యానికి తెరపడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన మాథ్యూస్‌తో తరంగా ఏమాత్రం వేగం తగ్గించుకుండా పరుగులు చేశాడు.

మలుపు తిప్పిన ధోని స్టంప్‌ అవుట్‌..

భారత చైనామన్‌ కుల్దీప్‌ యాదవ్‌ వేసిన 27 ఓవర్‌ తొలి బంతిని ఉపుల్‌ తరంగ క్రీజు దాటి ఆడబోగా.. బంతిని అందుకున్న ధోని అంతే వేగంతో వికెట్లను కొట్టేశాడు. ఫీల్డ్‌ అంపైర్‌ థర్డ్‌ అంపైర్‌ను రివ్యూ కోరగా రిప్లయ్‌లో తరంగ సరిగ్గా తన లెగ్‌ ఆన్‌ది లైన్‌పై పెట్టె సమయంలో ధోని వికెట్లను గీరేశాడు. థర్డ్‌ అంపైర్‌ అవుట్‌గా ప్రకటించడంతో తరంగ సెంచరీ చేజారింది. తరంగా అవుట్‌ తర్వాత తడబడిన లంకేయుల సాధారణ స్కోరుకే పరిమితమయ్యారు.

మరిన్ని వార్తలు