ఓటమి అంచుల నుంచి...

15 Feb, 2020 05:02 IST|Sakshi

థాయ్‌లాండ్‌పై భారత్‌ అద్భుత విజయం

సెమీస్‌ చేరి పతకం ఖాయం చేసుకున్న టీమిండియా

నేడు ఇండోనేసియాతో పోరు

మనీలా (ఫిలిప్పీన్స్‌): ఆసియా టీమ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో భారత పురుషుల జట్టు అద్భుతం చేసింది. ఓటమి అంచుల నుంచి తేరుకొని విజయబావుటా ఎగురువేసింది. సెమీఫైనల్లోకి దూసుకెళ్లి కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. శుక్రవారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో భారత్‌ 3–2తో థాయ్‌లాండ్‌ను ఓడించింది. తొలి సింగిల్స్‌లో సాయిప్రణీత్‌ 14–21, 21–14, 12–21తో కాంతాపోన్‌ వాంగ్‌చరోయిన్‌ చేతిలో... రెండో సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్‌ 20–22, 14–21తో కున్లావుత్‌ వితిద్‌సర్న్‌ చేతిలో ఓడిపోయారు. దాంతో భారత్‌ 0–2తో వెనుకబడి ఓటమి అంచుల్లో నిలిచింది.

అయితే మూడో మ్యాచ్‌గా జరిగిన డబుల్స్‌లో ధ్రువ్‌ కపిల–ఎం.ఆర్‌.అర్జున్‌ జంట 21–18, 22–20తో కెద్రిన్‌–విరియంగ్‌కురా (థాయ్‌లాండ్‌) జోడీని ఓడించింది. నాలుగో మ్యాచ్‌గా జరిగిన సింగిల్స్‌లో లక్ష్య సేన్‌ 21–19, 21–18తో సుపన్యు అవింగ్‌సనోన్‌ (థాయ్‌లాండ్‌)పై గెలిచాడు. దాంతో స్కోరు 2–2తో సమమైంది. నిర్ణాయక ఐదో మ్యాచ్‌లో చిరాగ్‌ శెట్టి–కిడాంబి శ్రీకాంత్‌ జంట 21–15, 16–21, 21–15తో జోంగ్‌జిత్‌–నిపిత్‌పోన్‌ (థాయ్‌లాండ్‌) జోడీని ఓడించి భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించింది. నేడు జరిగే సెమీఫైనల్లో ఇండోనేసియాతో భారత్‌ ఆడుతుంది. 2016 చాంపియన్‌షిప్‌లోనూ భారత్‌ సెమీస్‌లో ఇండోనేసియా చేతిలో ఓడి కాంస్య పతకాన్ని దక్కించుకుంది.  

మరిన్ని వార్తలు