అమ్మాయిలు శుభారంభం

16 Jun, 2019 06:18 IST|Sakshi

తొలి మ్యాచ్‌లో ఉరుగ్వేపై 4–1తో విజయం

ఎఫ్‌ఐహెచ్‌ సిరీస్‌ ఫైనల్స్‌ టోర్నీ

హిరోషిమా: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్‌) మహిళల సిరీస్‌ ఫైనల్స్‌ టోర్నమెంట్‌లో టైటిల్‌ ఫేవరెట్‌ భారత్‌ శుభారంభం చేసింది. శనివారం జరిగిన పూల్‌ ‘ఎ’ లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ 4–1 గోల్స్‌ తేడాతో ఉరుగ్వే జట్టును ఓడించింది. భారత్‌ తరఫున కెప్టెన్‌ రాణి రాంపాల్‌ (10వ నిమిషంలో), గుర్జీత్‌ కౌర్‌ (21వ నిమిషంలో), జ్యోతి (40వ నిమిషంలో), లాల్‌రెమ్‌సియామి (56వ నిమిషంలో) ఒక్కో గోల్‌ చేశారు. ఉరుగ్వే జట్టుకు వియానా తెరీసా (51వ నిమిషంలో) ఏకైక గోల్‌ సాధించింది. ఆదివారం జరిగే తదుపరి మ్యాచ్‌లో పోలాండ్‌తో భారత్‌ ఆడుతుంది.

రెండేళ్ల తర్వాత ఉరుగ్వేతోమ్యాచ్‌ ఆడిన భారత్‌ అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంది. మరోవైపు మొదటి క్వార్టర్‌లో ఉరుగ్వే జట్టు చురుగ్గా ఆడుతూ గోల్స్‌ చేసే అవకాశాలను సృష్టించినా భారత డిఫెన్స్‌ వాటిని సమర్ధవంతంగా అడ్డుకుంది. మూడో క్వార్టర్‌లో ఇరు జట్లు పలుమార్లు గురి తప్పాయి. ముఖ్యంగా ఉరుగ్వే రెండు పెనాల్టీ కార్నర్‌లను జారవిడచగా, భారత్‌ ఒక పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచడంలో విఫలమైంది. తొలి రోజు జరిగిన ఇతర మ్యాచ్‌ల్లో చిలీ 7–0తో మెక్సికోపై, జపాన్‌ 2–1తో రష్యాపై, పోలాండ్‌ 6–1తో ఫిజీపై విజయం సాధించాయి.

మరిన్ని వార్తలు