ధోని సేనదే సిరీస్

13 Jun, 2016 20:41 IST|Sakshi
ధోని సేనదే సిరీస్

హరారే: జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్ను భారత్ కైవసం చేసుకుంది. సోమవారం జరిగిన రెండో వన్డేలో ధోని సేన 8 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్ను 2-0 తేడాతో గెలుపొందింది. జింబాబ్వే విసిరిన 127 పరుగుల లక్ష్యాన్ని భారత్ రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 26.5 ఓవర్లలో ఛేదించింది. భారత ఆటగాళ్లలో కేఎల్ రాహుల్(33;50 బంతుల్లో 4 ఫోర్లు), కరుణ్ నాయర్(39 ;68 బంతుల్లో 5 ఫోర్లు), అంబటి రాయుడు(41 నాటౌట్; 44  బంతుల్లో 7 ఫోర్లు) రాణించి జట్టుకు ఘన విజయాన్ని అందించారు. భారత విజయానికి రెండు పరుగుల దూరంలో ఉండగా నాయర్ రెండో వికెట్ గా అవుటయ్యాడు. ఈ తరుణంలో క్రీజ్ లోకి వచ్చిన మనీష్ పాండే ఫోర్ కొట్టి లాంఛనాన్ని పూర్తి చేశాడు.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 126 పరుగులకే పరిమితమైన సంగతి తెలిసిందే. జింబాబ్వే జట్టు వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి స్వల్ప స్కోరును మాత్రమే నమోదు చేసింది.  ఆదిలోనే మసకద్జా(9) నిరాశపరచగా, ఆపై మూర్(1) కూడా పెవిలియన్ చేరాడు. దీంతో 19 పరుగులకే జింబాబ్వే రెండు వికెట్లను నష్టపోయింది. కాగా, చిబాబా(21) మోస్తరుగా ఫర్వాలేదనిపించగా, సిబందా(53) ఆకట్టుకున్నాడు. సిబందా-సికిందర్ రాజా(16)ల జోడి నాల్గో వికెట్ కు 67 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును ఆదుకున్నారు.
 
ఆ తరువాత జింబాబ్వే వరుసగా క్యూకట్టడంతో 34.3 ఓవర్లలో  126 పరుగులకే ఆలౌటైంది. జింబాబ్వే ఆదిలో మెరుగైన ప్రదర్శన చేసినప్పటికీ, ఆ తరువాత చతికిలబడింది.  25.0 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 106 పరుగులు చేసిన జింబాబ్వే.. మరో 2 0 పరుగుల వ్యవధిలో మిగతా ఏడు వికెట్లను కోల్పోయింది. జింబాబ్వే ఆటగాళ్లలో ఏడుగురు సింగిల్ డిజిట్ కే పరిమితం కావడం గమనార్హం. ఈ మ్యాచ్ లో చాహల్ మూడు వికెట్లు సాధించగా, బరిందర్ శ్రవణ్, కులకర్ణిలకు తలో రెండు వికెట్లు, అక్షర్ పటేల్, బూమ్రాలకు చెరో వికెట్  దక్కాయి. అంతకుముందు తొలి వన్డేలో భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇరు జట్ల మధ్య నామమాత్రమే అయిన మూడో వన్డే బుధవారం జరుగనుంది.
 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు