భారత్‌ ఆశలు సజీవం

24 May, 2017 00:58 IST|Sakshi
భారత్‌ ఆశలు సజీవం

గోల్డ్‌ కోస్ట్‌ (ఆస్ట్రేలియా): నాకౌట్‌ చేరుకునే అవకాశాలు సజీవంగా ఉండాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో భారత బ్యాడ్మింటన్‌ జట్టు సత్తా చాటుకుంది. సుదిర్మన్‌ కప్‌ ప్రపంచ మిక్స్‌డ్‌ చాంపియన్‌షిప్‌లో భాగంగా గ్రూప్‌1–డి మ్యాచ్‌లో భారత్‌ 4–1తో ఇండోనేసియాను ఓడించింది. తొలుత మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌–అశ్విని పొన్నప్ప జంట 22–20, 17–21, 21–19తో తొంతోవి అహ్మద్‌–గ్లోరియా జోడీని ఓడించింది. పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్‌ 21–15, 21–16తో జొనాథన్‌ క్రిస్టీపై గెలవడంతో భారత్‌ 2–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి ద్వయం 9–21, 17–21తో మార్కస్‌ గిడియోన్‌–కెవిన్‌ సంజయ జంట చేతిలో ఓడింది. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు 21–8, 21–19తో ఫిత్రియానిపై నెగ్గడంతో భారత్‌ 3–1తో విజయాన్ని ఖాయం చేసుకుంది. నామమాత్రమైన మహిళల డబుల్స్‌ మ్యాచ్‌లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప జంట 21–12, 21–19తో డెల్లా డెస్తియారా–రొసియాతా జోడీపై నెగ్గడంతో భారత్‌ 4–1తో గెలుపొందింది.

బుధవారం ఇండోనేసియా, డెన్మార్క్‌ జట్ల మధ్య మ్యాచ్‌ ఫలితంపై భారత్‌ నాకౌట్‌ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. ఒకవేళ ఇండోనేసియా ఓడిపోతే భారత్, డెన్మార్క్‌ జట్లు ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా నాకౌట్‌ దశకు అర్హత సాధిస్తాయి. ఒకవేళ ఇండోనేసియా గెలిస్తే ఈ గ్రూప్‌లోని మూడు జట్లు ఒక్కో విజయంతో సమఉజ్జీగా నిలుస్తాయి. ఈ నేపథ్యంలో మెరుగైన గేమ్‌లు, పాయింట్ల ఆధారంగా తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు నాకౌట్‌కు చేరుతాయి.

>
మరిన్ని వార్తలు