సూపర్‌ షమీ... భళా బుమ్రా...

16 Feb, 2020 05:05 IST|Sakshi
మొహమ్మద్‌ షమీ, బుమ్రా

ఆకట్టుకున్న భారత పేస్‌ బౌలర్లు

న్యూజిలాండ్‌ ఎలెవన్‌ 235 ఆలౌట్‌

రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ 59/0

ప్రాక్టీస్‌ పోరులో మన బ్యాట్స్‌మెన్‌ విఫలమయ్యారని ఆందోళన చెందిన చోట మన పేస్‌ బౌలర్లు తమ స్థాయికి తగ్గ ప్రదర్శనతో సత్తా చాటారు. ఎర్ర బంతితో ఎప్పటిలాగే షమీ చెలరేగిపోగా, పరిమిత ఓవర్ల సిరీస్‌లో పదును చూపించలేకపోయిన బుమ్రా కూడా ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను పడగొట్టాడు. టెస్టు తుది జట్టులో స్థానం కోసం పోటీ పడుతున్న ఉమేశ్, సైనీలకు కూడా వికెట్లు దక్కాయి. మొత్తంగా ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో మన పేసర్లకు సరైన సాధన లభించింది. తొలి ఇన్నింగ్స్‌ వైఫల్యం నుంచి పాఠాలు నేర్చుకొన్న మన ఓపెనర్లు రెండో ఇన్నింగ్స్‌లో చక్కటి బ్యాటింగ్‌ చూపించడం కూడా ఊరటే.  

హామిల్టన్‌: ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో తొలి రోజు బ్యాటింగ్‌లో విఫలమైన భారత జట్టు రెండో రోజు బౌలింగ్‌లో సత్తా చాటింది. ఫలితంగా న్యూజిలాండ్‌ ఎలెవన్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 74.2 ఓవర్లలో 235 పరుగులకే ఆలౌటైంది. భారత్‌కు 28 పరుగుల ఆధిక్యం లభించింది. కివీస్‌ తరఫున హెన్రీ కూపర్‌ (68 బంతుల్లో 40; 6 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌ కాగా... రచిన్‌ రవీంద్ర (67 బంతుల్లో 34; 7 ఫోర్లు), డరైల్‌ మిషెల్‌ (65 బంతుల్లో 32; 5 ఫోర్లు), టామ్‌ బ్రూస్‌ (34 బంతుల్లో 31; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు.

భారత బౌలర్లలో మొహమ్మద్‌ షమీ 17 పరుగులే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టగా...బుమ్రా, ఉమేశ్, సైనీ తలా 2 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన భారత్‌ ఆట ముగిసే సమయానికి వికెట్‌ నష్టపోకుండా 7 ఓవర్లలో 59 పరుగులు చేసింది. పృథ్వీ షా (25 బంతుల్లో 35 బ్యాటింగ్‌; 5 ఫోర్లు, 1 సిక్స్‌), మయాంక్‌ అగర్వాల్‌ (17 బంతుల్లో 23 బ్యాటింగ్‌; 4 ఫోర్లు, 1 సిక్స్‌) క్రీజ్‌లో ఉన్నారు. ఓవరాల్‌గా భారత్‌ ఆధిక్యం 87 పరుగులకు చేరింది.  

కూపర్‌ మినహా...
న్యూజిలాండ్‌ ఎలెవన్‌ తరఫున ఒక్క అర్ధ సెంచరీ కూడా నమోదు కాలేదు. రెండో రోజు కూడా బౌన్స్, స్వింగ్‌కు అనుకూలించిన పిచ్‌ను భారత బౌలర్లు చక్కగా ఉపయోగించుకున్నారు. బుమ్రా తన రెండో ఓవర్లోనే యంగ్‌ (2)ను అవుట్‌ చేసి శుభారంభం అందించగా, సీఫెర్ట్‌ (9)ను షమీ వెనక్కి పంపించాడు. ఈ దశలో రవీంద్ర, అలెన్‌ కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేసినా అది ఎక్కువ సేపు సాగలేదు. మరో ఎండ్‌లో కూపర్‌ మాత్రం కొన్ని చక్కటి షాట్లు ఆడాడు. ఐదో వికెట్‌కు కూపర్, బ్రూస్‌ కలిసి 51 పరుగులు జోడించడమే కివీస్‌ జట్టులో పెద్ద భాగస్వామ్యం. వీరిద్దరు 20 పరుగుల వ్యవధిలో వెనుదిరగ్గా... సీనియర్‌ ఆటగాడు నీషమ్‌ (1)ను చక్కటి బంతితో షమీ బౌల్డ్‌ చేశాడు. ఆ తర్వాత లోయర్‌ ఆర్డర్‌ మొత్తం కలిసి 74 పరుగులు జోడించడంతో జట్టు స్కోరు 200 పరుగులు దాటింది.  

ఓపెనర్ల జోరు...
తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన భారత ఓపెనర్లు ఈసారి ఎలాంటి తప్పూ చేయలేదు. దూకుడైన షాట్లతో పృథ్వీ షా, మయాంక్‌ వేగంగా పరుగులు రాబట్టారు. రెండో రోజు చివరకు వచ్చేసరికి పిచ్‌ కాస్త నెమ్మదించి బ్యాటింగ్‌కు అనుకూలంగా మారడం కూడా వీరికి కలిసొచ్చింది. ముఖ్యంగా తొలి ఇన్నింగ్స్‌లో తామిద్దరిని అవుట్‌ చేసిన కుగ్‌లీన్‌ బౌలింగ్‌లో విరుచుకుపడిన వీరిద్దరు 3 ఓవర్లలోనే 34 పరుగులు బాదారు. భారత్‌ ఇన్నింగ్స్‌ 8.42 రన్‌రేట్‌తో సాగడం విశేషం. తొలి ఇన్నింగ్స్‌లాగే మరో సారి ఓపెనర్లుగా పృథ్వీ, మయాంక్‌లనే పంపడం చూస్తే తొలి టెస్టులో వీరిద్దరినే ఆడించే ఆలోచనతో టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఉన్నట్లు కనిపిస్తోంది. అదే జరిగితే టెస్టు అరంగేట్రం కోసం శుబ్‌మన్‌ గిల్‌ మరికొంత కాలం వేచి చూడక తప్పదు.  

స్కోరు వివరాలు
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 263; న్యూజిలాండ్‌ ఎలెవన్‌ తొలి ఇన్నింగ్స్‌: యంగ్‌ (సి) పంత్‌ (బి) బుమ్రా 2; రవీంద్ర (సి) పంత్‌ (బి) ఉమేశ్‌ 34; సీఫెర్ట్‌ (సి) పంత్‌ (బి) షమీ 9; అలెన్‌ (బి) బుమ్రా 20; కూపర్‌ (సి) మయాంక్‌ (బి) షమీ 40; బ్రూస్‌ (బి) సైనీ 31; మిషెల్‌ (సి) పృథ్వీ షా (బి) ఉమేశ్‌ 32; నీషమ్‌ (బి) షమీ 1; క్లీవర్‌ (బి) సైనీ 13; కుగ్‌లీన్‌ (నాటౌట్‌) 11; సోధి (సి) పుజారా (బి) అశ్విన్‌ 14; ఎక్స్‌ట్రాలు 28; మొత్తం (74.2 ఓవర్లలో ఆలౌట్‌) 235.

వికెట్ల పతనం: 1–11; 2–36; 3–70; 4–82; 5–133; 6–155; 7–161; 8–204; 9–213; 10–235.

బౌలింగ్‌: బుమ్రా 11–3–18–2; ఉమేశ్‌ 13–1–49–2; షమీ 10–5–17–3; సైనీ 15–2–58–2; అశ్విన్‌ 15.2–2–46–1; జడేజా 10–4–25–0.  

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: పృథ్వీ షా (బ్యాటింగ్‌) 35; మయాంక్‌ అగర్వాల్‌ (బ్యాటింగ్‌) 23; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (7 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా) 59

బౌలింగ్‌: టిక్‌నెర్‌ 3–0–19–0; కుగ్‌లీన్‌ 3–0–34–0; జాన్‌స్టన్‌ 1–0–6–0. 

>
మరిన్ని వార్తలు