భారత్‌ను ఊరిస్తున్న విజయం!

9 Dec, 2018 14:10 IST|Sakshi
ఆనందంలో భారత ఆటగాళ్లు

అడిలైడ్‌ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో భారత్‌ను విజయం ఊరిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో స్వల్ప ఆధిక్యం సాధించి రెండో ఇన్నింగ్స్‌ మొదలు పెట్టిన భారత్‌ 307 పరుగులకు కుప్పకూలింది. 151/3 ఓవర్‌ నైట్‌ స్కోరుతో నాలుగో రోజు ఆట ప్రారంభించిన కోహ్లి సేన మరో 156 పరుగులు జోడించి మిగతా వికెట్లు కోల్పోయింది. అనంతరం 323 పరుగుల లక్ష్యంతో బరిలోకి ఆతిథ్య జట్టు నాలుగోరోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 104 పరుగులు చేసింది. ఆసీస్‌ ఓపెనర్‌ ఆరోన్‌ ఫించ్‌(11)ను భారత స్పిన్నర్‌ అశ్విన్‌ పెవిలియన్‌ చేర్చగా.. మరో ఓపెనర్‌ హ్యారీస్‌(26)ను మహ్మద్‌ షమీ క్యాచ్‌ ఔట్‌ చేయడంతో 44 పరుగులకే ఆసీస్‌ రెండు వికెట్లు కోల్పోయింది. అనంతరం మరోసారి చెలరేగిన అశ్విన్‌-షమీ ద్వయం.. ఉస్మాన్‌ ఖవాజా(8), హ్యాండ్స్‌ కోంబ్‌ (14)లను పెవిలియన్‌ చేర్చింది. క్రీజులో షాన్‌ మార్ష్‌ (31నాటౌట్‌), ట్రావిస్‌ హెడ్‌ (11 నాటౌట్‌)లున్నారు.

అంతకుముందు ఆసీస్‌ స్పిన్నర్‌ నాథన్‌ లయన్‌ ఏకంగా 6 వికెట్లతో చెలరేగడంతో భారత్‌ బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్‌ క్యూ కట్టారు. పుజారా(71), రహానే(70) ఆసీస్‌ బౌలర్లను ఎదురొడ్డి నిలిచినప్పటికీ మిగతా బ్యాట్స్‌మన్‌ నుంచి సహకారం లేకపోవడంతో టీమిండియా సాధారణ స్కోరుకే పరిమితమైంది.

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 250 ఆలౌట్‌, ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌ 235 ఆలౌట్‌
భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ 307 ఆలౌట్‌, ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌  104/4

మరిన్ని వార్తలు