‘టీమిండియా కోచ్‌కు అవే ప్రధానం’

30 Jul, 2019 16:19 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి హయాంలో టీమిండియా అద్భుతమైన విజయాలు సాధించిందని ఇటీవల వ్యాఖ్యానించిన క్రికెట్‌ సలహా కమిటీ(సీఏసీ) సభ్యుడు అన్షుమన్‌ గైక్వాడ్‌.. తాజాగా ఒక వ్యక్తిని కోచ్‌గా నియమించే క్రమంలో ఏ లక్షణాలు ప్రధానంగా పరిశీలిస్తామనే దానిపై స్పష్టత ఇచ్చారు. ప్రధానంగా టీమిండియా కోచ్‌గా క్రికెటర్లను సమన్వయ పరుస్తూ జట్టును ముందుండి ఎవరైతే నడుపుతారని భావిస్తామో వారికే అధిక ప్రాముఖ్యత ఉంటుందన్నారు.

దీంతో పాటు కచ్చితమైన ప్రణాళికలు కూడా కోచ్‌గా నియమించే వ్యక్తికి అత్యంత అవసరమని గైక్వాడ్‌ అన్నారు. ఈ రెండు అంశాలు టీమిండియా కోచ్‌కు అత్యంత అవసరమని తాము భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ‘ మంచి ప్రణాళికతో పాటు ఆటగాళ్లను సమన్వయంతో ముందుకు నడిపించే వ్యక్తే టీమిండియా కోచ్‌గా అవసరం. ఈ రెండు లక్షణాలు కోచ్‌ను ఎంపిక చేసే క్రమంలో ముఖ్యంగా పరిశీలిస్తాం.  దాంతో పాటు టెక్నికల్‌ నాలెడ్జ్‌ అనేది ఎలాగు ఉండాలి.  టెక్నికల్‌ నాలెడ్జ్‌ ఉన్నప్పుడే ఆ వ్యక్తి సరైన ప్రణాళికతో ఉన్నాడా..లేడా అనేది అర్థమవుతుంది’ అని గైక్వాడ్‌ తెలిపారు. త్వరలో టీమిండియా కోచ్‌ ఎంపిక ప్రక్రియ మొదలుకానున్న తరుణంలో గైక్వాడ్‌ తరచు చేస్తున్న వ్యాఖ్యలు ఆసక్తిని రేపుతున్నాయి.

మరిన్ని వార్తలు