భారత్‌ హ్యాట్రిక్‌

22 Oct, 2018 04:58 IST|Sakshi
మన్‌దీప్‌ సింగ్‌, హర్మన్‌ప్రీత్‌ సింగ్‌

మూడో లీగ్‌ మ్యాచ్‌లో జపాన్‌పై 9–0తో ఘన విజయం

మస్కట్‌ (ఒమన్‌): ఆసియా హాకీ చాంపియన్స్‌ ట్రోఫీలో డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌ తమ విజయాల పరంపర కొనసాగిస్తోంది. ఆదివారం జరిగిన మూడో లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ 9–0తో జపాన్‌ను ఓడించి వరుసగా మూడో గెలుపుతో హ్యాట్రిక్‌ నమోదు చేసింది. తొలి మ్యాచ్‌లో ఒమన్‌పై 11–0తో... రెండో మ్యాచ్‌లో పాక్‌పై 4–1తో నెగ్గిన మన్‌ప్రీత్‌ సింగ్‌ బృందం మూడో మ్యాచ్‌లోనూ తమ జోరును ప్రదర్శించింది. ప్రతి క్వార్టర్‌లో గోల్‌ చేసి జపాన్‌ను హడలెత్తించింది. భారత్‌ తరఫున మన్‌దీప్‌ సింగ్‌ (4, 49, 57వ నిమిషాల్లో) మూడు గోల్స్‌తో హ్యాట్రిక్‌ నమోదు చేయగా... హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ (17, 21వ నిమిషాల్లో) రెండు గోల్స్‌ సాధించాడు.

గుర్జంత్‌ సింగ్‌ (8వ నిమిషంలో), ఆకాశ్‌దీప్‌ సింగ్‌ (36వ నిమిషంలో), సుమీత్‌ (42వ నిమిషంలో), లలిత్‌ ఉపాధ్యాయ్‌ (45వ నిమిషంలో) ఒక్కో గోల్‌ చేశారు. ఈ టోర్నీలో భారత్‌ తరఫున హ్యాట్రిక్‌ చేసిన రెండో ప్లేయర్‌గా మన్‌దీప్‌ సింగ్‌ నిలిచాడు. ఒమన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో దిల్‌ప్రీత్‌ సింగ్‌ ఈ ఘనత సాధించాడు. తాజా విజయంతో భారత్‌ 9 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. అంతర్జాతీయ స్థాయిలో జపాన్‌తో ఇప్పటివరకు 22 మ్యాచ్‌లు ఆడిన భారత్‌ 18 మ్యాచ్‌ల్లో గెలిచి, మూడింటిని ‘డ్రా’ చేసుకొని... ఒక మ్యాచ్‌లో ఓడింది.  మంగళవారం జరిగే నాలుగో లీగ్‌ మ్యాచ్‌లో మలేసియాతో భారత్‌ తలపడుతుంది. ఇటీవలే జకార్తా ఆసియా క్రీడల సెమీఫైనల్లో మలేసియా చేతిలో అనూహ్యంగా ఎదురైన ఓటమికి భారత్‌ భారీ విజయంతో ప్రతీకారం తీర్చుకుంటుందో లేదో వేచి చూడాలి.  

మరిన్ని వార్తలు