రోహిత్‌ ధమాకా రాయుడు పటాకా

30 Oct, 2018 00:47 IST|Sakshi

శతకాల మోత మోగించిన బ్యాట్స్‌మెన్‌

నాలుగో వన్డేలో భారత్‌ ఘన విజయం

153 పరుగులకే కుప్పకూలిన వెస్టిండీస్‌

నవంబరు 1న తిరువనంతపురంలో చివరి వన్డే

టీమిండియా గర్జించింది. పుణేలో పల్టీ కొట్టినా ముంబైలో మేల్కొంది. కీలకమైన మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను పసికూనలా మార్చేసి ఓడించింది. ‘హిట్‌మ్యాన్‌’ రోహిత్‌శర్మ... తెలుగు తేజం అంబటి తిరుపతి రాయుడు అమోఘమైన భాగస్వామ్యంతో శతకాల మోత మోగించడంతో భారత్‌ భారీ స్కోరు చేసింది. బౌలింగ్‌లో ఖలీల్‌ అహ్మద్, కుల్దీప్‌ మాయాజాలంతో ప్రత్యర్థిని చుట్టేసింది. సిరీస్‌లో 2–1తో ఆధిక్యంలోకి వెళ్లింది.   
 

ముంబై: కోహ్లి సేన దుమ్మురేపింది. నాలుగో వన్డేలో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో వెస్టిండీస్‌ను మట్టికరిపించింది. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (137 బంతుల్లో 162; 20 ఫోర్లు, 4 సిక్స్‌లు), మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ అంబటి రాయుడు (81 బంతుల్లో 100; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) శతకాల మోతతో టీమిండియా తిరుగులేని విజయాన్ని అందు కుంది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న టీమిండియా... మూడో వికెట్‌కు రోహిత్, రాయుడు 211 పరుగుల అద్భుత భాగస్వామ్యంతో నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 377 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారత బౌలర్ల ధాటితో పాటు ఫీల్డర్ల చురుకుదనంతో ఛేదనలో వెస్టిండీస్‌ ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. 36.2 ఓవర్లలో 153 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్‌ జాసన్‌ హోల్డర్‌ (70 బంతుల్లో 54 నాటౌట్‌; 1 ఫోర్, 2 సిక్స్‌లు) మినహా మరే బ్యాట్స్‌మన్‌ నిలవలేకపోవడంతో విండీస్‌ 224 పరుగుల భారీ తేడాతో పరాజయం పాలైంది. భారత బౌలర్లలో యువ పేసర్‌ ఖలీల్‌ అహ్మద్‌ (3/13), స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ (3/42) మూడేసి వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిని పతనంలో పాలుపంచుకున్నారు. రోహిత్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది. సిరీస్‌లో చివరిదైన ఐదో వన్డే గురువారం తిరువనంతపురంలో జరుగుతుంది. 
 

శుభారంభం... ఆపై అమోఘం 
సిరీస్‌లో తొలిసారిగా ఓపెనర్లిద్దరూ నిలవడంతో ఈ మ్యాచ్‌లో భారత్‌కు శుభారంభం దక్కింది. ముందుగా రోహితే మొదలుపెట్టినా, కొద్దిసేపటికే జోరందుకున్న శిఖర్‌ ధావన్‌ (40 బంతుల్లో 38; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) కొన్ని చక్కటి షాట్లతో అతడిని మించిపోయాడు. అయితే, కీమో పాల్‌ ఓవర్లో పుల్‌ చేయబోయి మిడ్‌ వికెట్‌లో రావ్‌మన్‌ పావెల్‌కు చిక్కాడు. దీంతో తొలి వికెట్‌కు 71 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. హ్యాట్రిక్‌ సెంచరీల ఊపులో క్రీజులోకి వచ్చిన కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి (16) ఈసారి ఎక్కువసేపు నిలవలేకపోయాడు. ఆఫ్‌ స్టంప్‌ మీద పడిన రోచ్‌ బంతిని థర్డ్‌మ్యాన్‌ దిశగా ఆడే ప్రయత్నంలో విఫలమై కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. ఈ ఏడాది వన్డేల్లో కోహ్లికిదే తక్కువ స్కోరు. భారీ ఇన్నింగ్స్‌లతో టీమిండియాకు వెన్నెముకలా నిలుస్తున్న కెప్టెన్‌ వెనుదిరగడంతో జట్టుకు సవాల్‌ అనదగ్గ పరిస్థితి ఎదురైంది. దీనిని రోహిత్, రాయుడు దీనిని సమర్థంగా ఎదుర్కొన్నారు. కుదురుకునేందుకు సమయం తీసుకున్నా, తర్వాత దూకుడు పెంచారు. ఈ క్రమంలో రోహిత్‌ 60 బంతుల్లో అర్ధశతకాన్ని అందుకున్నాడు. అనంతరం రావ్‌మన్‌ పావెల్‌ ఓవర్లో మూడు, నర్స్‌ ఓవర్లో రెండు బౌండరీలతో చకచకా 90ల్లోకి వెళ్లిపోయాడు. మరో ఎండ్‌లో రాయుడు పూర్తి సంయమనం చూపాడు. అలెన్‌ బౌలింగ్‌లో ఫోర్‌తో కెరీర్‌లో రోహిత్‌ 21వ వన్డే సెంచరీని పూర్తిచేసుకున్నాడు. కాసేపటికే రాయుడు అర్ధశతకం మార్క్‌ను చేరుకున్నాడు. ఇక ఇక్కడి నుంచి బౌలర్‌ ఎవరన్నది లెక్క చేయకుండా ఫోర్లు, సిక్స్‌లతో ఇద్దరూ ధాటైన ఆటను కనబర్చారు. 33 ఓవర్లకు 199/2తో ఉన్న స్కోరు 43వ ఓవర్‌కు 300 దాటిందంటేనే ఈ ద్వయం ఎంత జోరుగా బ్యాటింగ్‌ చేసిందో అర్థం చేసుకోవచ్చు. ఇదే ఊపులో రోహిత్‌ 150 పరుగుల మైలురాయి (131 బంతుల్లో)ని అధిగమించాడు. కానీ, కాసేపటికే అతడి ఇన్నింగ్స్‌కు తెరపడింది. రోచ్‌ ఓవర్లో యార్కర్‌ లెంగ్త్‌ బంతిని సిక్స్‌ బాది 90ల్లోకి చేరుకున్న రాయుడు... అనంతరం ఒక్కో పరుగు జోడిస్తూ వన్డేల్లో మూడో శతకాన్ని (80 బంతుల్లో) పూర్తి చేసుకున్నాడు. సెంచరీ అయిన వెంటనే రాయుడు రనౌటయ్యాడు. ధోని (23; 2 ఫోర్లు), కేదార్‌ జాదవ్‌ (16 నాటౌట్‌; 3 ఫోర్లు), జడేజా (7 నాటౌట్‌; 1 ఫోర్‌) ఆఖర్లో తమవంతుగా జట్టు
స్కోరును పెంచారు. 

విండీస్‌... పేలవంగా: అతి భారీ లక్ష్య ఛేదనలో వెస్టిండీస్‌ తేలిపోయింది. గత మూడు మ్యాచ్‌ల్లో తలా కొన్ని పరుగులతో జట్టు భారీ స్కోర్లకు ఉపయోగపడిన బ్యాట్స్‌మెన్‌... ఈసారి పూర్తిగా చేతులెత్తేశారు. ఓపెనర్లు కీరన్‌ పావెల్‌ (4), హేమ్‌రాజ్‌ (14)తో పాటు నిలకడగా రాణిస్తున్న షై హోప్‌ (0) వికెట్లను ఒకే స్కోరు వద్ద కోల్పోయిన జట్టు ముందే కుదేలైంది. ఖలీల్‌ స్వింగ్‌ బంతులకు మార్లోన్‌ శామ్యూల్స్‌ (18), అద్భుత ఫామ్‌లో ఉన్న హెట్‌మైర్‌ (13), రావ్‌మన్‌ పావెల్‌ (1) వరుస కట్టడంతో చేసేదేమీ లేకపోయింది. 56/6తో నిలిచిన జట్టును హోల్డర్‌ మరీ తక్కువ స్కోరుకే పరిమితం కాకుండా చూశాడు.  


కోహ్లి... సూపర్‌ రనౌట్‌ 

మ్యాచ్‌ ఏదైనా తనదైన ముద్ర ఉండేలా చూసే కోహ్లి... ముంబైలో తక్కువ స్కోరుకే ఔటైనా మెరుపు ఫీల్డింగ్‌తో తళుక్కుమన్నాడు. విండీస్‌ బ్యాట్స్‌మన్‌ శామ్యూల్స్‌ కవర్స్‌ దిశగా కొట్టిన షాట్‌ను అడ్డుకున్న కోహ్లి... అంతే వేగంగా డైవ్‌తో బంతిని నాన్‌ స్ట్రయికింగ్‌ వైపు వికెట్లకేసి విసిరాడు. అది గురి చూసి వదిలిన బాణంలా తగలడం క్షణాల్లో జరిగి పోయింది. అప్పటికే చాలా ముందుకొచ్చిన కీరన్‌ పావెల్‌ తిరిగి క్రీజును చేరే అవకాశమూ లేకపోయింది. 

►భారత్‌ తరఫున వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మెన్‌ జాబితాలో సచిన్‌ (196)ను దాటి రెండో స్థానానికి చేరిన రోహిత్‌ శర్మ (198). ధోని (211) తొలి స్థానంలో ఉన్నాడు.  

►పరుగుల పరంగా (224) భారత్‌కిది మూడో పెద్ద విజయం. ఇంతకుముందు 2007 ప్రపంచకప్‌లో బెర్ముడాపై 257 పరుగులతో, 2008లో హాంకాంగ్‌పై 256 పరుగులతో నెగ్గింది. 

►వన్డేల్లో రోహిత్‌ ఏడుసార్లు 150 పైగా స్కోరు చేశాడు. సచిన్‌ (5), జయసూర్య, గేల్, ఆమ్లా, కోహ్లి (4 సార్లు చొప్పున) తర్వాత ఉన్నారు.   

మరిన్ని వార్తలు