మన కథ ప్లే–ఆఫ్‌ వరకే...

19 Sep, 2017 00:26 IST|Sakshi
మన కథ ప్లే–ఆఫ్‌ వరకే...

కెనడా చేతిలో భారత్‌ 2–3తో ఓటమి
డేవిస్‌కప్‌ వరల్డ్‌ గ్రూప్‌ ప్లే ఆఫ్‌


ఎడ్మాంటన్‌ (కెనడా): డేవిస్‌ కప్‌ టెన్నిస్‌ టోర్నీలో భారత్‌ పోరాటం వరుసగా నాలుగోసారి ప్లే–ఆఫ్‌లోనే ముగిసింది. కెనడాతో జరిగిన వరల్డ్‌ గ్రూప్‌ ప్లే ఆఫ్‌ పోటీలో భారత్‌ 2–3తో ఓడిపోయింది. దాంతో వచ్చే ఏడాది భారత్‌ మళ్లీ ఆసియా ఓసియానియా గ్రూప్‌ నుంచి డేవిస్‌కప్‌ పోరు ప్రారంభిస్తుంది. ఈ విజయంతో ఆతిథ్య కెనడా జట్టు వరల్డ్‌ గ్రూప్‌నకు అర్హత సంపాదించింది. రివర్స్‌ సింగిల్స్‌లో తప్పక గెలవాల్సిన రెండు మ్యాచ్‌ల్లో భారత్‌కు మిశ్రమ ఫలితాలొచ్చాయి. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన తొలి రివర్స్‌ సింగిల్స్‌లో రామ్‌కుమార్‌ రామనాథన్‌ 3–6, 6–7 (1/7), 3–6తో ప్రపంచ 51వ ర్యాంకర్‌ షపొవలోవ్‌ చేతిలో కంగుతిన్నాడు.

ఒక్క రెండో సెట్‌ మినహా మిగతా సెట్లలో రామ్‌ కుమార్‌ తన ప్రత్యర్థి ధాటికి చేతులెత్తేశాడు. ఈ మ్యాచ్‌లో కెనడా నెగ్గడంతో మరో మ్యాచ్‌తో సంబంధం లేకుండానే భారత్‌ కథ ముగిసినట్లయింది. అనంతరం జరిగిన నామమాత్రమైన రెండో రివర్స్‌ సింగిల్స్‌లో యూకీ బాంబ్రీ 6–4, 4–6, 6–4తో బ్రేడెన్‌ ష్నర్‌పై గెలిచాడు.  పరాజయంపై భారత నాన్‌–ప్లేయింగ్‌ కెప్టెన్‌ మహేశ్‌ భూపతి మాట్లాడుతూ ‘పోటీ జరిగిన ఈ మూడు రోజులు మాకు లభించిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకోలేకపోయాం’ అని అన్నారు.

మరిన్ని వార్తలు